Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 32:1-3

యిర్మీయా భూమిని కొనుట

32 యూదా రాజైన సిద్కియా పాలనలో పదవ సంవత్సరం[a] గడుస్తు ఉండగా యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది. ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమును ముట్టడిస్తూ వచ్చింది. (యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేము నగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు.

యిర్మీయా 32:6-15

యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, “యెహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం ఇలా ఉంది: నీ పినతండ్రి కుమారుడైన హనమేలు త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు. హనమేలు నీ వద్దకు వచ్చి, ‘అనాతోతు వద్ధ నున్న తన పొలం కొనమని నిన్ను అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ ఉంది’ అని అంటాడు.

“తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.’”

అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది. అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హనమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను. 10 క్రయ దస్తావేజు మీద సంతకం చేశాను దాని ప్రతినొక దానిని తీసికొని ముద్రవేయించాను. ఇందుకు సాక్షులను కూడా నియమించాను. వారి ఎదుట వెండిని తూచాను. 11 మడత పెట్టి ముద్ర వేసిన దస్తావేజును, ముద్ర వేయించి దాని ప్రతిని నేను తీసుకున్నాను. 12 తరువాత వాటిని నేను బారూకునకు ఇచ్చినాను. బారూకు అనేవాడు నేరీయా కుమారుడు. నేరీయా అనేవాడు మహసేయా అను వాని కుమారుడు. ముద్ర వేసి మూసిన క్రయ దస్తావేజులో నేను పొలం ఖరీదు చేసిన నియమ నిబంధనావళి ఉంది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు, మరియు ఇతర సాక్షుల యెదుట నేనా దస్తావేజులను బారూకునకు ఇచ్చాను. ఆ సాక్షులు కూడా దస్తావేజుల మీద సంతకాలు చేశారు. ఆ ఆవరణలో కూర్చుని వున్న అనేక మంది యూదా ప్రజలు కూడా నేను బారుకునకు దస్తావేజులను అప్పగించటం చూశారు.

13 ఆ ప్రజలంతా చూస్తూ ఉండగా, నేను బారూకుతో ఇలా చెప్పాను: 14 “సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: ‘ముద్ర వేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటిని నీవు తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. ఆ దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున నీవు ఆ విధంగానే చేయుము.’ 15 ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడునగు యెహోవా ఇలా అంటున్నాడు: ‘భవిష్యత్తులో నా ప్రజలు తిరిగి ఇండ్లను, పొలాలను, ద్రాక్షతోటలను ఇశ్రాయేలులో కొనుగోలు చేస్తారు.’”

కీర్తనలు. 91:1-6

91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
    సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
“నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
    అని నేను యెహోవాకు చెబుతాను.
దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
    ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
    పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
    దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
    పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
చీకటిలో దాపురించే రోగాలకు గాని
    మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.

కీర్తనలు. 91:14-16

14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
    నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
    నేను వారికి జవాబు ఇస్తాను.
    వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
    నేను వాళ్లను రక్షిస్తాను.”

1 తిమోతికి 6:6-19

కాని సంతృప్తితో ఉండి, భక్తిని అవలంభిస్తే అదే ఒక గొప్ప ధనము. ఈ లోకంలోకి మనమేమీ తీసుకురాలేదు. ఈ లోకంనుండి ఏమీ తీసుకుపోలేము. మనకు తిండి, బట్ట ఉంటే చాలు. దానితో తృప్తి పొందుదాము. కాని ధనవంతులు కావాలనుకొనేవారు, ఆశలకులోనై మూర్ఖత్వంతో హానికరమైన ఆశల్లో చిక్కుకుపోతారు. అవి వాళ్ళను అధోగతి పట్టించి పూర్తిగా నాశనం చేస్తాయి. 10 ధనాశ అన్ని రకాల దుష్టత్వానికి మూలకారణం. కొందరు, ధనాన్ని ప్రేమించి, క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసానికి దూరమైపోయారు. తద్వారా దుఃఖాల్లో చిక్కుకుపోయారు.

తిమోతికి చెప్పిన ఉపదేశము

11 కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. 12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు. 13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 14 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు. 15 “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. 16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.

17 ధనవంతులు గర్వించరాదనీ, క్షణికమైన ధనాన్ని నమ్మకూడదనీ, వాళ్ళతో చెప్పుదానికి మారుగా మన ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని ఆజ్ఞాపించు. 18 సత్కార్యాలు చేస్తూ సత్ ప్రవర్తన కలిగి అవసరమైనవాటిని యితర్లతో ఔదార్యముగా పంచుకుంటూ ఉండుమని ఆజ్ఞాపించు. 19 ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందకల్గుతారు.

లూకా 16:19-31

ధనవంతుడు, లాజరు

19 “ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు మంచి విలువైన దుస్తులు వేసుకొని ప్రతిరోజు భోగాలనుభవిస్తూ జీవించేవాడు. 20 అతని గడప ముందు లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు ఉండేవి. కుక్కులు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. 21 అతడాధనికుని బల్లమీద నుండి పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి ఆశతో అక్కడ పడి ఉండేవాడు.

22 “ఆ భిక్షగాడు చనిపొయ్యాడు. అతణ్ణి దేవదూతలు తీసుకువెళ్ళి అబ్రాహాము ప్రక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ ధనికుడు కూడా చనిపొయ్యాడు. అతడు సమాధి చెయ్యబడ్డాడు. 23 నరకంలో ఆ ధనికుడు హింసలు అనుభవిస్తూవుండేవాడు. తలెత్తి చూడగా లాజరును తన ప్రక్కన కూర్చోబెట్టుకున్న అబ్రాహాము కనిపించాడు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. 24 అందువల్ల అబ్రాహామును పిలిచి, ‘తండ్రి అబ్రాహామా! నామీద దయ చూపు. నేను ఈ మంటల్లో తీవ్రంగా బాధపడ్తున్నాను. లాజరుతో ఇక్కడకు వచ్చి తన వేలుముంచి నా నాలుక తడపమని చెప్పండి’ అని అన్నాడు.

25 “కాని అబ్రాహాము, ‘కుమారుడా! జ్ఞాపకం తెచ్చుకో! నీవు బ్రతికిన రోజుల్లో సుఖాలనుభవించావు. లాజరు కష్టాలనుభవించాడు. కాని అతడిక్కడ ఆనందంగా ఉన్నాడు. నీవు బాధలను అనుభవిస్తున్నావు. 26 ఇక్కడి వాళ్ళు అక్కడకు రాకూడదని, అక్కడివాళ్ళు యిక్కడికి రాకూడదని మన మధ్య పెద్ద అఘాతం ఉంది’ అని అన్నాడు.

27 “ఆ ధనికుడు అలాగైతే ‘తండ్రి! లాజరును మా తండ్రి ఇంటికి పంపు. 28 అక్కడ నా ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళు యిక్కడకు వచ్చి హింసలు అనుభవించకుండా ఉండేటట్లు వాళ్ళకు బోధించుమని చెప్పు’ అని అన్నాడు.

29 “అబ్రాహాము ఈ విధంగా సమాధానం చెప్పాడు: ‘మోషే, ప్రవక్తలు ఉన్నారు కదా! వాళ్ళు చెప్పినట్లు చెయ్యనీ!’

30 “‘తండ్రీ అబ్రాహామా! చనిపోయిన వాళ్ళనుండి ఎవరైనా వెళ్తే వాళ్ళు విని మారుమనస్సు పొందుతారు’ అని ఆ ధనికుడు అన్నాడు.

31 “అబ్రాహాము, ‘వాళ్ళు మోషే, ప్రవక్తలు చెప్పినట్లు విననట్లైతే చనిపోయినవాడు బ్రతికి వచ్చినా వాళ్ళు వినరు’ అని అన్నాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International