Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 106:40-48

40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది.
    దేవుడు వారితో విసిగిపోయాడు!
41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు.
    వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు.
42 దేవుని ప్రజలను శత్రువులు తమ అదుపులో పెట్టుకొని
    వారికి జీవితాన్నే కష్టతరం చేసారు.
43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు.
    కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే చేశారు.
    దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు.
44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు.
    ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు.
45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు.
    దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు.
46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు.
    అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
    నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
    అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
    దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.

యిర్మీయా 10:1-16

దేవుడు మరియు విగ్రహాలు

10 ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము! యెహోవా ఇలా చెప్పుచున్నాడు:

“అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు!
    ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు[a] నీవు భయపడవద్దు!
అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు.
    కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.
ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవికావు.
వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు.
వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో చెక్కి మలుస్తాడు.
వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు.
వాటిని పడిపోకుండా సుత్తులతో
    మేకులు కొట్టి నిలబెడతారు.
బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి.
    వారి విగ్రహాలు మాట్లాడవు.
వారి విగ్రహాలు నడవలేవు.
    ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి!
కావున ఆ విగ్రహాలకు భయపడకు.
    అవి నిన్ను ఏమీ చేయలేవు.
పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!”

యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు!
    నీవు గొప్పవాడవు!
    నీ నామము గొప్పది మరియు శక్తి గలది.
ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు.
    వారందరి గౌరవానికి నీవు అర్హుడవు.
ప్రపంచ దేశాలలో చాలామంది జ్ఞానులున్నారు.
    కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు.

అన్యదేశవాసులు మందబుద్ధులు, మూర్ఖులు.
వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి.
వారు తర్షీషు నగరంనుండి వెండిని,
    ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు.
విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి.
ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు.
    “జ్ఞానులు” ఆ “దేవుళ్ల” ని చేస్తారు.
10 కాని యెహోవా నిజమైన దేవుడు.
    ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు!
    శాశ్వతంగా పాలించే రాజు ఆయనే.
దేవునికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది.
    ప్రపంచ రాజ్యాల ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు.

11-12 “ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము,
    ‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు.
    వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’”[b]

తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే.
    దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు.
తన అవగాహనతో దేవుడు
    ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు.
13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు.
    ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు.
భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు.
    ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు.
    ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.

14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు!
    లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు.
వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు.
    అవి జడపదార్థములు[c]
15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి.
    అవి హాస్యాస్పదమైనవి.
తీర్పు తీర్చే కాలంలో
    ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి.
16 కాని యాకోబు యొక్క దేవుడు[d] ఆ విగ్రహాలవంటి వాడు కాదు.
ఆయన సర్వసృష్టికి కారకుడు.
    ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు.
ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”

1 కొరింథీయులకు 9:19-23

19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవ్వరికీ బానిసను కాను. కాని చేతనైనంతమందిని గెలవాలని నేను ప్రతి ఒక్కనికీ బానిసనౌతాను. 20 నేను యూదులతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని యూదునిలా జీవించాను. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు గెలవాలని, నేను ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరం లేకపోయినా ధర్మశాస్త్రం అనుసరించేవాళ్ళకోసం దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లు జీవించాను. 21 ధర్మశాస్త్రం లేనివాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని, ధర్మశాస్త్రం లేనివానిగా ప్రవర్తించాను. అంటే నేను దేవుని న్యాయానికి అతీతుడను కాను. నిజానికి నేను క్రీస్తు న్యాయాన్ని అనుసరిస్తున్నాను. 22 బలహీనుల్ని గెలవాలని బలహీనుల కోసం బలహీనుడనయ్యాను. ఏదో ఒక విధంగా కొందరినైనా రక్షించగలుగుతానేమో అని నేను అందరికోసం అన్ని విధాలుగా మారిపొయ్యాను. 23 నేను ఇవన్నీ సువార్త కోసం చేసాను. అది అందించే దీవెనలు పొందాలని నా అభిలాష.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International