Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 79:1-9

ఆసాపు స్తుతి కీర్తన.

79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
    ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
    యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
    అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
    మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
    మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
    బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
    నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
    వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
    త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
    నీవు మాకు ఎంతో అవసరం.
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
    నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
    నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.

యిర్మీయా 8:1-13

ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “ఆ సమయంలో యూదా రాజులయొక్క, ముఖ్యపాలకుల యొక్క ఎముకలను ప్రజలు సమాధులనుండి తీస్తారు. వారు యాజకుల యొక్క, ప్రవక్తల యొక్క ఎముకలను సమాధులనుండి తీస్తారు. యెరూషలేము ప్రజలు ఎముకలను కూడ వారి సమాధుల నుండి తీస్తారు. ఆ మనుష్యులు ఆ ఎముకలను ఆరుబయట సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు కనపడేలా పడవేస్తారు. యోరూషలేము ప్రజలు సూర్య చంద్రులను, నక్షత్రాలను ఆరాధించటానికి యిష్టపడతారు. ఆ ఎముకలను తిరిగి ఎవ్వరూ ప్రోగుచేసి పాతిపెట్టరు. కావున ఆ యెముకలన్నీ పశువుల పేడవలె బయట పారవేయబడును.

“యూదా ప్రజలు వారి ఇండ్లను, రాజ్యాన్ని వదిలి పోయేలా నేను ఒత్తిడి చేస్తాను. ఆ ప్రజలు వారి దేశాన్నుండి పరరాజ్యానికి తీసికొని పోబడతారు. యుద్ధంలో చావగా మిగిలిన యూదా ప్రజలు (ఈ దుష్ట ప్రజలు) తాము కూడ చనిపోతే బాగుండేదని భావిస్తారు,” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.

పాపము శిక్ష

“యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు తెలియజేయుము: ‘యెహోవా ఈ విషయాలు చెప్పినాడు:

“‘ఒక వ్యక్తి క్రింద పడితే
    తిరిగి లేస్తాడని మీకు తెలుసు.
ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్లితే
    అతడు మరల తిరిగి వెనుకకు వస్తాడు.
యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు.
కాని యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు పెడమార్గాన వెళ్లుచున్నారు?
వారి అబద్ధాలను వారే నమ్ముతారు.
    వారు వెనుదిరిగి రావటానికి నిరాకరిస్తారు.
వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను.
    కాని వారు ఏది సరైనదో తెలియజెప్పరు.
ప్రజలు వారి పాపాలకు విచారించుట లేదు.
    ప్రజలు వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు.
ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు.
    వారు యుధ్ధానికి పరుగెత్తే గుర్రాల్లా ఉన్నారు.
ఆకాశంలో ఎగిరే పక్షులకు సైతం
    తమ పనులకు ఒక నిర్ణీత కాలం తెలుసు.
కొంగలు, గువ్వలు, వాన కోవిలలు, ఓదెకరువులు (ఒక జాతి కొంగ)
    వీటన్నిటికీ ఇతర ప్రాంతాలకు వలసపోయే కాలము క్రమము తప్పక తెలుసు.
కాని నా ప్రజలకు మాత్రం వారి యెహోవా వారిని ఏమి చేయమని కోరుతున్నాడో తెలియదు.

“‘యెహోవా ధర్మశాస్త్రం (ఉపదేశములు) మావద్ద ఉన్నది! అందువల్ల మేము తెలివిగలవారము! అని మీరు చెప్పుకుంటూ వుంటారు.
    కాని అది నిజం కాదు. ఎందువల్లనంటే లేఖకులు[a] (వ్రాత గాండ్రు) వారి కలాలతో అబద్ధమాడారు.
ఈ “తెలివిగలవారు” యెహోవా ఉపదేశములను వినటానికి నిరాకరించారు.
    కావున నిజంగా వారు జ్ఞానవంతులు కారు.
ఆ “జ్ఞానవంతులు” అనబడే వారు మోసంలో పడ్డారు.
    వారు విస్మయం పొంది, సిగ్గుపడ్డారు.
10 కావున వారి భార్యలను నేనితరులకిచ్చి వేస్తాను.
    వారి పొలాలను క్రొత్త యజమానులకిచ్చివేస్తాను.
ఇశ్రాయేలు ప్రజలంతా అధిక ధనసంపాదనపై ఆసక్తిగలవారు.
    ప్రాముఖ్యంలేని అతి సామాన్యుల నుండి ముఖ్యుల వరకు ప్రజలంతా అలాంటివారే.
    ప్రవక్తల నుండి యాజకుల వరకు ప్రజలంతా అబద్ధాలు చెప్పేవారే.
11 నా ప్రజలు బాగా గాయపడ్డారు.
    కాని అదేదో బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజకులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మాన్పజూస్తారు.
“అంతా మంచిగా వుంది; అంతా మంచిగా వుంది!” అని వారంటారు.
    కాని పరిస్థితి ఏమీ బాగా లేదు!
12 ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి.
    కాని వారు సిగ్గుపడనే లేదు.
వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వారికి తెలియదు.
    అందరితో పాటు వారూ శిక్షించబడతారు.
    నేను వారిని శిక్షిస్తాను; వారిని క్రిందికి పడవేస్తాను.’”
ఇది యెహోవా వాక్కు.

13 “‘వారి ఫలాలను, పంటను నేను తీసుకుంటాను
    అందుచేత అక్కడ పంటకోత ఉండదు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది
ద్రాక్ష తీగలపై కాయలేమాత్రం ఉండవు. అంజూరపు చెట్లకు కూడ కాయలుండవు.
    వాటి ఆకులు సైతం ఎండిపోయి చనిపోతాయి.
నేను వారికిచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను.’”[b]

రోమీయులకు 8:31-39

క్రీస్తు యేసులో దేవుని ప్రేమ

31 మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? 32 మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? 33 దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. 34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? 36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము,
    మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”(A)

37 ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International