Revised Common Lectionary (Semicontinuous)
94 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు.
నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
2 నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి.
గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
3 యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు?
యెహోవా, ఇంకెన్నాళ్లు?
4 ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి
ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
5 యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు.
నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
6 మా దేశంలో నివసించే విధవరాండ్రను, పరదేశస్థులను ఆ దుర్మార్గులు చంపుతారు.
తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
7 వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు.
జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబుతారు.
8 దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు.
మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు?
దుర్మార్గులారా, మీరు అవివేకులు
మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
9 దేవుడు మన చెవులను చేశాడు.
కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు.
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి.
జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు.
ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు.
ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.
12 యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు.
సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు.
దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది.
అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.
16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు.
చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే
నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు.
కాని యెహోవా తన అనుచరుని బలపరిచాడు.
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను.
కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.
20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు.
ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు.
అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే.
నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు.
వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు.
మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.
18 యెహోవా ఇలా చెబుతున్నాడు:
“కాని ఆ భయంకరమైన రోజులు వచ్చినప్పుడు,
ఓ యూదా, నేను నిన్ను పూర్తిగా నాశనం కానివ్వను.
19 యూదా ప్రజలు నిన్ను,
‘యిర్మీయా, మా దేవుడైన యెహోవా మాకెందుకీ ఆపద తెచ్చిపెట్టాడు?’ అని అడుగుతారు.
అప్పుడు నీవు,
‘ఓ యూదా ప్రజలారా, మీరు యెహోవాను విస్మరించారు.
మీ స్వంత దేశంలోనే పరదేశాల వారి విగ్రహాలను పూజించారు.
మీరలా ప్రవర్తించారు గనుక
ఇప్పుడు మీరు పరాయి రాజులను మీకు చెందని రాజ్యంలో సేవించవలసి ఉంది!’ అని సమాధానం చెప్పు.”
20 యెహోవా ఇలా అన్నాడు: “యాకోబు వంశస్తులకు ఈ వర్తమానం అందజేయుము.
యూదా రాజ్యానికి ఈ సమాచారం తెలియజేయుము.
21 బుద్ధిహీనులైన మూర్ఖుపు జనులారా ఈ వర్తమానం వినండి:
మీకు కళ్లు ఉండికూడా చూడరు!
మీకు చెవులు ఉండి కూడా వినరు!
22 నేనంటే మీరు నిజంగా భయపడటం లేదు.”
ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది
“మీరు నాముందు భయంతో కంపించాలి.
సముద్రానికి తీరాన్ని ఏర్పరచిన వాడను నేనే.
తద్వారా సముద్రజలాలు తమ పరిధిలో శాశ్వతంగా ఉండేలా చేశాను.
అలల తాకిడికి సముద్రతీరం దెబ్బతినదు.
అలలు ఘోషిస్తూ తీరాన్ని చేరుతాయి, కాని అవి దానిని దాటిపోవు.
23 కాని యూదా ప్రజలు మొండి వైఖరి వహించారు.
వారు నాకు వ్యతిరేకంగా తిరగటానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు.
నాకు విముఖులై, నానుండి వారు దూరంగా పోయారు.
24 మనం మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని,
‘ఆయన మనకు శీతాకాల, వసంతకాల వర్షాలు సకాలంలో ఇస్తున్నాడనీ,
ఆయన సకాలంలో, సక్రమంగా మనం పంటనూర్పిడి చేసుకొనేలా చేస్తున్నాడనీ’
యూదా ప్రజలు ఎన్నడూ అనుకోలేదు.
25 యూదా ప్రజలారా, మీరు చెడు చేశారు. అందువల్ల వర్షాలు లేవు; నూర్పిళ్లు లేవు.
నీవు యెహోవా ఇచ్చే అనేక మంచి విషయాలను మీరు అనుభవించకుండా మీ పాపాలు అడ్డు పడుతున్నాయి.
26 నా ప్రజల మధ్య దుష్ట వ్యక్తులున్నారు.
ఆ దుష్టులు పక్షులను పట్టటానికి వలలు పన్నే కిరాతకుల్లా[a] ఉన్నారు.
వారు తమ బోనులు సిద్ధంచేసి పొంచి వుంటారు.
కాని వాళ్లు పక్షులకు బదులు మనుష్యులను పట్టుకుంటారు.
27 పంజరం నిండా పక్షులున్నట్లుగా,
ఈ దుష్టుల ఇండ్ల నిండా అబద్దాలే!
వారి అబద్ధాలు వారిని ధనికులుగా, శక్తివంతులుగా చేశాయి.
28 వారు చేసిన దుష్కార్యాల ద్వారా వారు బాగా ఎదిగి, కొవ్వెక్కినారు.
వారు చేసే అకృత్యాలకు అంతం లేదు.
వారు అనాధ శిశువుల తరఫున వాదించరు.
వారు అనాధలను అదుకోరు.
వారు పేదవారికి న్యాయం జరిగేలా చూడరు.
29 వారు ఈ కృత్యాలన్నీ చేస్తున్నందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?”
ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
“ఈ రకమైన దేశాన్ని నేను శిక్షించాలని నీకు తెలుసు.
వారికి తగిన శిక్ష నేను విధించాలి.”
30 యెహోవా ఇలా అన్నాడు,
“యూదా రాజ్యంలో ఆశ్చర్యం కలిగించే ఒక భయానక సంఘటన జరిగింది. అదేమంటే,
31 ప్రవక్తలు అబద్ధం చెప్పటం;
యాజకులు దేన్ని చేయుటకై ఎంచుకోబడ్డారో దానిని చేయరు[b]
నా ప్రజలు దానినే ఆదరించారు.
కానీ, ఓ ప్రజలారా చివరలో మీరు శిక్షకు
గురియైన నాడు మీరేమి చేస్తారు?”
8 కాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్సరాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను ఉంటాయి[a] 9 ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందాలని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీపట్ల సహనం వహిస్తున్నాడు.
10 కాని ప్రభువు రానున్న దినం ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ మాయమైపోతాయి. ఆకాశాల్లో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్త వస్తువులూ కాలిపోతాయి. 11 అన్నీ ఈ విధంగా నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా జీవించటం ఎంత అవసరమో గ్రహించండి. 12 దేవుని దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ వేడికి పరమాణువులు కరిగి పోతాయి. 13 దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిపై నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు చూస్తున్నాం.
© 1997 Bible League International