Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 94

94 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు.
    నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి.
    గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు?
    యెహోవా, ఇంకెన్నాళ్లు?
ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి
    ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు.
    నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
మా దేశంలో నివసించే విధవరాండ్రను, పరదేశస్థులను ఆ దుర్మార్గులు చంపుతారు.
    తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు.
    జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబుతారు.

దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు.
    మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు?
దుర్మార్గులారా, మీరు అవివేకులు
    మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
దేవుడు మన చెవులను చేశాడు.
    కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు.
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి.
    జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు.
    ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు.
    ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.

12 యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు.
    సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు.
    దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
    సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది.
    అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.

16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు.
    చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే
    నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు.
    కాని యెహోవా తన అనుచరుని బలపరిచాడు.
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను.
    కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.

20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు.
    ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు.
    అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే.
    నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు.
    వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు.
    మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.

యిర్మీయా 5:1-17

యూదా వారి దుష్టత్వం

“యెరూషలేము నగర వీధులలో తిరుగుతూ చుట్టుప్రక్కల పరిశీలిస్తూ ఈ విషయాలపై ఆలోచించు. నగర కూడలి స్థలాలలో వెదకి ఏ ఒక్కడైనా మంచి వ్యక్తి కనిపిస్తాడేమో చూడు. నీతిగా వ్యవహరించే ఏ ఒక్కడు గాని, సత్యాన్వేషిగాని ఉన్నాడేమో చూడు. ఏ ఒక్క మంచి వ్యక్తిని చూడ గలిగినా, నేను యెరూషలేమును క్షమిస్తాను! ప్రజలు ప్రమాణాలు చేస్తూ ‘నిత్యుడైన యెహోవాతోడు’ అంటారు. కాని అది పేరుకు మాత్రం. వారు చెప్పింది చేయరు.”

యెహోవా, నీవు ప్రజలలో నమ్మకస్థులకై
    చూస్తున్నావని నాకు తెలుసు.
యూదా వారిని నీవు కొట్టావు.
    అయినా వారికి నొప్పి కలుగలేదు.
వారిని నాశనం చేశావు,
    అయినా వారొక గుణపాఠం నేర్చుకోటానికి తిరస్కరించారు.
వారు మొండి వైఖరి దాల్చారు.
    వారి దుష్కార్యాలకు వారు చింతించ నిరాకరించారు.

కాని నేను (యిర్మీయా) ఇలా అనుకున్నాను:
“కేవలం పేద మరియు సామాన్య వర్గాల వారే అలా మూర్ఖులై ఉండాలి.
    వారే యెహోవా మార్గాన్ని అనుసరించటం నేర్చుకోలేదు.
    పేదలు వారి దేవుని బోధనలు తెలుసుకోలేదు.
కావున యూదా ప్రజల నాయకుల వద్దకు నేను వెళతాను.
    నేను వారితో మాట్లాడతాను.
నాయకులు తప్పక యెహోవా మార్గాన్ని మరియు ఉపదేశాలను అర్థం చేసుకుంటారు.
    వారి దేవుని న్యాయమార్గం వారికి తెలుస్తుందనే నమ్మిక నాకు ఉంది!”
కాని నాయకులంతా యెహోవా సేవను
    నిరాకరించే నిమిత్తం ఏకమైనారు.[a]
వారు దేవునికి వ్యతిరేకులైనారు.
అందువల్ల అరణ్యంలోనుండి ఒక సింహం వారిని ఎదిరిస్తుంది.
    ఎడారిలో నుండి ఒక తోడేలు వచ్చి వారిని చంపుతుంది.
వారి నగరాల దాపున ఒక చిరుతపులి పొంచి ఉంది.
    నగరంలో నుంచి ఎవడు బయటికి వచ్చినా చిరుతపులి చీల్చి చెండాడుతుంది.
యూదా ప్రజలు మరల మరల చేసిన పాపాల ఫలితంగా ఇదంతా జరుగుతుంది.
    అనేక పర్యాయములు వారు యెహోవాకు దూరమైనారు.

దేవుడిలా అన్నాడు: “యూదా, నేను నిన్నెందుకు క్షమించాలో ఒక కారణం చూపించు.
    నీ పిల్లలు నన్ను త్యజించారు.
    దేవుళ్లే కానటువంటి వ్యర్థమైన విగ్రహాలకు వారు ప్రమాణాలు చేశారు.
నీ సంతానానికి కావలసిన ప్రతుది నేను యిచ్చి వున్నాను.
    అయినా వారింకా నా పట్ల విశ్వాసఘాతకులై ఉన్నారు!
    వారెక్కువ కాలం వ్యభిచార గృహాలలోనే గడిపారు
వారు తినటానికి సమృద్ధిగా ఉండి, సంభోగించటానికి సిద్ధంగా ఉన్న గుర్రాలవలె ఉన్నారు.
    పొరుగువాని భార్య కోసం మదించి సకిలిస్తున్న గుర్రంలా వున్నారు.
ఈ పనులన్నీ చేసినందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?”
ఇదే యెహోవా వాక్కు.
“అవును! ఇటువంటి దేశాన్ని నేను శిక్షించాలిగదా.
    వారికి తగిన శిక్ష విధించాలి.

10 “యూదావారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు.
    ద్రాక్షలతలన్నీ నరికివేయుము. (కాని వాటి మొద్దులను నరికి నాశనం చేయవద్దు).
    వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, ఈ తీగెలు యెహోవాకు చెందినవికావు.[b]
11 ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు
    ప్రతి విషయంలోనూ నాకు విశ్వాసఘాతుకులుగా ఉన్నారు.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.

12 “యెహోవా విషయంలో ఆ ప్రజలు అబద్ధమాడారు.
వారిలా అన్నారు: ‘యెహోవా మమ్మల్ని ఏమీ చేయడు.
    మాకు ఏ రకమైన కీడూ రాదు.
    మమ్మల్ని ఏ శత్రు సైన్యం ఎదిరించగా మేము చూడము.
    మేము ఆకలికి మాడిపోము.’
13 తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకుతారు,
    దేవుని వాక్కు వారియందు లేదు.
    వారికి కీడు మూడుతుంది.”

14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు తెలియజేసాడు:
“నేను వారిని శిక్షించనని ఆ ప్రజలు అన్నారు.
కావున యిర్మీయా, నేను నీకు చెప్పిన మాటలు అగ్నిలా ఉంటాయి.
    ఆ ప్రజలు కొయ్యలాంటివారు.
అగ్ని ఆ కట్టెనంతా దహించివేస్తుంది.”
15 ఓ ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవా ఇలా చెప్పినాడు:
“మీ మీదికి బహు దూరంలో ఉన్న ఒక దేశాన్ని తీసుకొని వస్తున్నాను.
అది ఒక ప్రాచీన రాజ్యం
    అది ఒక శక్తివంతమైన రాజ్యం.
మీకు అర్థంకాని భాషను వారు మాట్లాడతారు.
    వారు చెప్పేది మీకు అర్థం కాదు.
16 వారి అమ్ముల పొదులు తెరచిన సమాధుల్లా వున్నాయి.
    వారంతా యోధాన యోధులు.
17 మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు తినివేస్తారు.
    మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు.
    మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనం చేస్తారు.
వారు మీ గొర్రెల మందలను, పశువుల మందలను తింటారు.
    మీ ద్రాక్షాపంటను, అంజూరపు చెట్లను వారు తింటారు.
కత్తులతో వారు మీ బలమైన నగరాలను నాశనం చేస్తారు.
    మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను వారు నాశనం చేస్తారు!”

1 తిమోతికి 1:18-20

18 తిమోతీ, నా కుమారుడా! గతంలో ప్రవక్తలు నీ భవిష్యత్తును గురించి చెప్పారు. దాని ప్రకారం మంచి పోరాటం సాగించి ఆ ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. 19 విశ్వాసంతో, మంచి హృదయంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి తమ విశ్వాసాన్ని పోగొట్టుకొన్నారు. 20 హుమెనై, అలెక్సంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దైవదూషణ చెయ్యకుండా ఉండటం నేర్చుకోవాలని వాళ్ళను సాతానుకు అప్పగించాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International