Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 4:11-12

11 ఆ సమయంలో యూదా,
    యోరూషలేము ప్రజలకు ఒక వర్తమానం ఇవ్వబడుతుంది:
“వట్టి కొండలపై నుండి వేడిగాలి వీస్తుంది.
    అది ఎడారి నుండి నీ ప్రజల మీదికి వీస్తుంది.
అది రైతులు నూర్చిన ధాన్యం పోతపోయటానికి
    పనికి వచ్చే పైరుగాలిలాంటిది కాదు.
12 ఇది దీనికంటె బలమైన గాలి;
    పైగా అది నావద్ద నుండి వీస్తుంది.
ఇప్పుడు, యూదా ప్రజలపై నా న్యాయనిర్ణయం ప్రకటిస్తాను.”

యిర్మీయా 4:22-28

22 దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు మూర్ఖులు.
    వారు నన్నెరుగరు.
వారు మంద బుద్ధిగల పిల్లలవలె ఉన్నారు.
    వారికి అవగాహనే లేదు.
కాని వారు చెడు చేయటంలో నేర్పరులు.
    మంచిపని ఎలా చేయాలో వారికి తెలియనే తెలియదు.”

ముంచుకు వచ్చే ముప్పు

23 నేను భూమివైపు చూశాను.
    భూమి ఖాళీగా ఉంది;
    దానిపై ఏమీ లేదు.
నేను అకాశంవైపు చూశాను.
    వెలుగు పోయింది.[a]
24 నేను పర్వతాల వైపు చూశాను,
    అవి కదిలిపోతున్నాయి.
    కొండలన్నీ కంపించి పోతున్నాయి.
25 నేను చూడగా, అక్కడ మనుష్యులు లేరు.
    ఆకాశంలో పక్షులు లేకుండా పోయాయి.
26 నేను చూడగా సుక్షేత్రమైన రాజ్యం ఎడారిలా కన్పించింది.
    ఆ రాజ్యంలో నగరాలన్నీ సర్వనాశనమయ్యాయి. ప్రభువే ఇదంతా కలుగజేశాడు. అధికమైన యెహోవా కోపమే దీనిని కలుగచేసింది.

27 యెహోవా ఇలా అన్నాడు:
“దేశం యావత్తూ నాశనమవుతుంది.
    (కానీ దేశాన్ని పూర్తిగా నాశనం చేయను)
28 అందువల్ల దేశంలో మిగిలినవారు చనిపోయిన వారి కొరకు విలపిస్తారు.
    ఆకాశం చీకటవుతుంది.
నా మాటకు తిరుగులేదు.
    నేనొక నిర్ణయాని కొచ్చాను; మరల నేను మనస్సు మార్చుకోను.”

కీర్తనలు. 14

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
    బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
    వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.

పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
    వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
    (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
    మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
    మంచి పనులు చేయలేదు.

దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
    ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
    దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
    ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
    కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
    ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.

సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
    ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
    ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

1 తిమోతికి 1:12-17

దేవుని దయకు నేను కృతజ్ఞుణ్ణి

12 నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపాత్రునిగా ఎంచి, ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేసు క్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 13 ఒకనాడు నేను దైవదూషణ చేసినవాణ్ణి, హింసించిన వాణ్ణి, క్రూరుణ్ణి. నేను అమాయకంగా నాలో విశ్వాసం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను కనికరించాడు. 14 మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై ధారాళంగా కురిపించాడు. ఆ అనుగ్రహంతో పాటు యేసు క్రీస్తులో ఉన్న విశ్వాస గుణాన్ని, ప్రేమను కూడా నాకు ప్రసాదించాడు.

15 పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రథముణ్ణి. 16 నేను ప్రథముణ్ణి కనుకనే యేసు నాపై దయ చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయేవాళ్ళకు, తనవల్ల విముక్తి పొందబోయేవాళ్ళకు అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని అంతులేని సహనాన్ని ప్రదర్శించాడు. 17 చిరకాలం రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ చిరకాలం కలుగుగాక! ఆమేన్.

లూకా 15:1-10

తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం

(మత్తయి 18:12-14)

15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. కాని పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి తింటాడు” అని గొణిగారు.

అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “మీలో ఒకని దగ్గర వంద గొఱ్ఱెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక గొఱ్ఱె తప్పిపోతే అతడు తన తొంబది తొమ్మిది గొఱ్ఱెల్ని అక్కడ బయల్లో వదిలేసి ఆ తప్పిపోయిన గొఱ్ఱె దొరికేదాకా వెతకడా? అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని ఆనందంతో యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, ‘తప్పిపోయిన నా గొఱ్ఱె దొరికింది. మనమంతా ఆనందించుదాం’ అని అంటాడు. నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు పొందనవసరం లేని తొంభైతొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగె ఆనందంకన్నా పాపం చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు.

“ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి యిల్లంతా వూడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా? దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది. 10 నేను చెప్పేదేమిటంటే అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International