Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.
2 పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
(వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
3 కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
మంచి పనులు చేయలేదు.
4 దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.
7 సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.
20 యెరూషలేమా, పైకి చూడు!
ఉత్తర దిశనుండి వచ్చే శత్రువును చూడు.
నీ మంద ఎక్కడ? ఆ అందమైన మందను దేవుడు నీకిచ్చాడు.
ఆ మంద రక్షణ బాధ్యత నీదై వుంది.
21 ఆ మంద ఏమైనదని దేవుడు నిన్నడిగితే నీవేమి చెపుతావు?
నీవు దేవుని గురించి ప్రజలకు బోధించవలసివుంది.
నీ నాయకులు ప్రజలను నడిపించవలసి ఉంది.
కాని వారి పని వారు చేయలేదు!
కావున నీవు మిక్కిలి బాధను, కష్టాలను అనుభవిస్తావు.
నీ బాధ స్త్రీ యొక్క ప్రనవవేదనలాంటిది.
22 “నాకెందుకీ చెడు దాపురించింది?”
అని నీకు నీవే ప్రశ్నించుకో.
నీవు చేసిన అనేక పాపాల ఫలమే నీకు వచ్చిన కష్టాలు.
నీ పాపాల కారణంగా నీ అంగీ చిరిగిపోయింది.
నీ పాదరక్షలు తీసుకొని పోబడ్డాయి.
నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా చేశారు.
23 నల్లని వ్యక్తి తన శరీరపు రంగును మార్చలేడు.
చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు.
అలాగే, ఓ యెరూషలేమా, నీవు మారి మంచి పనులు చేయలేవు.
నీవు ఎల్లప్పుడూ చెడు చేయటానికే అలవాటు పడ్డావు.
24 “మీరు మీ ఇండ్లు వదిలిపోయేలా వత్తిడి తెస్తాను.
మీరు పారిపోయేటప్పుడు చెల్లా చెదరై అన్ని వైపులకూ పారిపోతారు.
ఎడారి గాలికి కొట్టుకు పోయే పొట్టులాంటి వారు మీరు.
25 ఈ విషయాలన్నీ నీకు సంభవిస్తాయి.
నా ప్రణాళికల్లో నీ పాత్ర ఇదే.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
“ఇది ఎందుకు సంభవిస్తుందంటే
నీవు నన్ను మర్చిపోయావు.
నీవు బూటకపు దేవుళ్లను నమ్మావు.
26 యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను.
ప్రతివాడూ నిన్ను చూస్తాడు. నీవు అవమానం పాలవుతావు.
27 నీవు చేసిన భయంకరమైన పనులను నేను చూశాను.[a]
నీవు విజృంభించి ప్రియులతో వ్యభిచరించటం చూశాను.
వేశ్యలా ప్రవర్తించాలనే నీ పథకం నాకు తెలుసు.
నీవు కొండలమీద, మైదానాల మీద పాపాలు చేయుట నేను చూశాను.
యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా ఉంటుంది.
అసహ్యమైన ఈ పాపాలు నీ వెన్నాళ్లు సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.”
1 విశ్వాసంలో నా కుమారునితో సమానమైన తిమోతికి పౌలు వ్రాయడం ఏమనగా, నేను మన రక్షకుడైన దేవుని ఆజ్ఞానుసారమూ, మనకు రక్షణ లభిస్తున్న ఆశకు మూలకారకుడైన యేసు క్రీస్తు ఆజ్ఞానుసారమూ, యేసు క్రీస్తుకు అపొస్తలుడనయ్యాను.
2 తండ్రి అయినటువంటి దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు, నీపై అనుగ్రహం చూపాలనీ, నిన్ను కరుణించాలనీ, నీకు శాంతి చేకూర్చాలనీ ఆశిస్తున్నాను.
దొంగ బోధకుల విషయంలో జాగ్రత్త
3 నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన విధంగా నీవు ఎఫెసులో ఉండుము. అక్కడ కొందరు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. వాళ్ళతో ఆ విధంగా చెయ్యవద్దని చెప్పు. 4 అంతేకాక, వాళ్ళు కల్పితగాథలు చెప్పకూడదనీ, అంతు పొంతులేని వంశావళులతో సమయం వ్యర్థం చేయవద్దని కూడా ఆజ్ఞాపించు. ఇలాంటివి దైవకార్యానికి తోడ్పడడానికి బదులుగా చీలికలు కల్గిస్తాయి. దైవకార్యం విశ్వాసంతో కూడుకొన్నపని. 5 ఇందులోని ఉద్దేశ్యం ఏమిటంటే, పవిత్ర హృదయం నుండీ, స్వచ్ఛమైన అంతరాత్మ నుండీ, నిజమైన విశ్వాసం నుండీ ఉద్భవించే ప్రేమను కలిగియుండటమే. 6 కొందరు వ్యక్తులు నిజమైన ధ్యేయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు. 7 తాము ధర్మశాస్త్ర పండితులు కావాలనుకొంటారు. కాని వాళ్ళకు వాళ్ళు చెప్పే మాటలే తెలియదు. నమ్మకంతో మాట్లాడుతున్న విషయాలను గురించి వాళ్ళకు తెలియదు.
8 ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయోగిస్తే మంచిదని మనకు తెలుసు. 9 మంచివాళ్ళ కోసం ధర్మశాస్త్రం వ్రాయబడలేదని మనకు తెలుసు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళకోసం, తిరుగుబాటు చేసేవాళ్ళ కోసం, దేవుణ్ణి నమ్మనివాళ్ళకోసం, భక్తిహీనుల కోసం, పాపుల కోసం, అపవిత్రమైనవాళ్ళకోసం, తల్లిదండ్రులను గౌరవపరచనివాళ్ళకోసం, హంతకుల కోసం, 10 వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా ప్రవర్తించేవాళ్ళకోసం, బానిస వ్యాపారం చేసేవాళ్ళకోసం, అసత్యాలాడేవాళ్ళకోసం, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళ కోసం, నిజమైన బోధనకు వ్యతిరేకంగా నడుచుకొనేవాళ్ళకోసం, అది వ్రాయబడింది. 11 నాకందించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. దాన్ని తేజోవంతుడైన దేవుడు నాకందించాడు.
© 1997 Bible League International