Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 139:1-6

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
    నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
    దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
    నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
    నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
    నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
    గ్రహించటం నాకు కష్టతరం.

కీర్తనలు. 139:13-18

13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
    నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
    నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
    నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
    ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
    నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
    కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.

యిర్మీయా 15:10-21

దేవునికి మరల యిర్మీయా తెలియజేయుట

10 తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది.
    నేను దుఃఖపడుతున్నాను.
నేను దురదృష్టవంతుడను.
    ఈ సమస్త రాజ్యాన్నీ నేను (యిర్మీయా) నిందిస్తూ, విమర్శిస్తూ ఉన్నాను.
నేనెవరికీ ఏదీ అప్పు యివ్వలేదు; అరువు తీసుకోలేదు.
    కాని ప్రతివాడూ నన్ను శపిస్తున్నాడు!
11 యెహోవా, నేను నిన్ను భక్తితో సేవించాను.
    ఆపదకాలం వచ్చినప్పుడు నా శత్రువుల గురించి నేను నిన్ను వేడుకున్నాను.

యెహోవానుండి యిర్మీయాకు జవాబు

12 “యిర్మీయా, ఇనుప ముక్కను నుగ్గుచేయటం
    ఎవరితరమూ కాదని నీకు తెలుసు.
అంటే నా ఉద్దేశ్యం ఉత్తరాన్నుంచి వచ్చేది ఇనుమువలె ఉంటుంది[a]
    అలాగే ఇనుప ముక్కను చిదుకగొట్టే వారెవరు?
13 యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి.
    ఆ సంపదను పరులకు ఇస్తాను.
అన్యులు ఆ సంపదను ఖరీదు చేయనక్కరలేదు.
    నేనే వారికి స్వయంగా ఇచ్చివేస్తాను.
    ఎందువల్లనంటే యూదా చాలా పాపాలు చేసింది.
    యూదా దేశంలో ప్రతిచోటా పాపాలు జరిగాయి.
14 యూదా ప్రజలారా, మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను.
    ముందెన్నడూ ఎరుగని రాజ్యంలో మీరు బానిసలవుతారు.
నేను మిక్కిలి కోపంతో ఉన్నాను.
    నా కోపం రగులుతున్న అగ్నిలా ఉంది.
    అందులో మీరు కాలిపోతారు.”

యిర్మీయా ఈ విధంగా చెప్పాడు:
15 యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో.
    నన్ను గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో.
ప్రజలు నన్ను గాయపర్చుతున్నారు.
    వారికి తగిన శిక్ష విధించుము.
ఆ ప్రజలపట్ల నీవు చాలా ఓపిక పట్టినావు.
    వారి పట్ల ఓపికపడుతూ, నన్ను నాశనం కానీయకు.
నా గురించి ఆలోచించుము.
    యెహోవా, నీ గురించి నేననుభవిస్తున్న నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో.
16 నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుతున్నాను.
    నీ వాక్కు నన్ను మిక్కిలి సంతోషపర్చింది.
నా సంతోషానికి కారణమేమంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ పేరు సర్వశక్తిమంతుడు.
17 నేను ప్రజలతో కలసి ఎన్నడూ కూర్చోలేదు.
    కారణమేమనగా వారు నన్ను చూచి నవ్వి, ఎగతాళి చేశారు.
నామీద నీ ప్రభావం పడుటవలన నాకు నేను ఒంటరిగా కూర్చున్నాను.
నాచుట్టూ ఉన్న చెడు వాతావరణంపట్ల నేను కోపగించుకొనేలా చేశావు.
18 నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు.
    నా గాయం ఎందుకు నయంకాలేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు అర్థంకావటం లేదు.
యెహోవా, నీవు మారి పోయావేమోనని అనుకుంటున్నాను.
    నీవు ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు.
    నీవు ఇంకిపోయిన నీటిబుగ్గలా ఉన్నావు.
19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే
    నిన్ను నేను శిక్షించను.
నీవు మారి నావద్దకు వస్తే
    నీవు నన్ను వెంబడించగలవు.
వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూలంగా మాట్లాడితే
    నాగురించి నీవు మాట్లాడగలవు.
యూదా ప్రజలు మార్పు చెంది నీవద్దకు తిరిగిరావాలి.
    అంతేగాని నీవు మారి, వారిలా వుండకూడదు.
20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను.
నిన్ను చూచి వారంతా
    కంచుగోడలాంటి వాడని అనుకుంటారు.
యూదావారు నీతో పోట్లాడుతారు.
    కాని వారు నిన్ను ఓడించలేరు.
ఎందువల్లనంటే నేను నీతో వున్నాను.
    నేను నీకు సహాయ పడతాను; నిన్ను రక్షిస్తాను.”

ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
21 “ఆ దుష్టులనుండి నేను నిన్ను రక్షిస్తాను.
    వారు నిన్ను బెదరగొడతారు. కాని వారి బారినుండి నిన్ను నేను రక్షిస్తాను.”

ఫిలిప్పీయులకు 2:25-30

25 నాకు సహాయం చెయ్యటానికి మీరు ఎపఫ్రొదితును పంపారు. అతడు మీరు పంపిన దూత. అతణ్ణి తిరిగి మీ దగ్గరకు పంపటం అవసరమని భావిస్తున్నాను. ఎపఫ్రొదితు నాతో కలిసి నా సోదరునివలే పోరాడి, పని చేసాడు. 26 మిమ్మల్ని చూడాలని, మీ దగ్గరకు రావాలని అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు జబ్బుతో ఉన్నాడన్న విషయం మీరు విన్నట్లు అతనికి తెలిసి అతడు చాలా చింతిస్తున్నాడు. 27 అతనికి నిజంగా చనిపోయేటంత జబ్బు చేసింది. కాని దేవుని దయ అతనిపై ఉంది. కనుక అతను బ్రతికాడు. దేవుడు అతనికే కాకుండా, నాకు మరొకసారి దుఃఖం కలుగరాదని నాపై కూడా దయచూపాడు. 28 అందువల్ల అతణ్ణి మీ దగ్గరకు పంపాలని ఎదురు చూస్తున్నాను. అతణ్ణి చూసి మీరు ఆనందించాలని నా ఉద్దేశ్యం. అప్పుడు నాకు నిశ్చింతగా ఉంటుంది. 29 కనుక ప్రభువు పేరిట ఆనందంతో అతనికి స్వాగతం చెప్పండి. అలాంటి వాళ్ళను మీరు గౌరవించాలి. 30 మీరు చేయలేని సహాయం తాను చేయాలని అతడు తన ప్రాణానికి తెగించాడు. క్రీస్తు అప్పగించిన పని పూర్తిచేయటం కొరకు మరణించటానికి కూడా అతడు సిద్ధమయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International