Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం.
58 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు.
మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.
2 లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు.
ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
3 ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు.
పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
4 వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు.
వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.
5 త్రాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు.
ఆ దుర్మార్గులు అలా ఉన్నారు.
6 యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు.
కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.
7 ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక.
బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.
8 మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక.
చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.
9 కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా
కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.
10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం
వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు.
ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది.
లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”
15 అప్పుడు మీకు నూతన కాపరులను (పాలకులు) ఇస్తాను. ఆ పాలకులు నాకు విశ్వాస పాత్రులై ఉంటారు. వారు జ్ఞానంతోను, అవగాహనతోను మిమ్మల్ని నడిపిస్తారు. 16 ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీరనేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది.
“ఆ సమయంలో ప్రజలు తాము దేవుని నిబంధన మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు కోరు. వారు మరో పవిత్ర ఒడంబడికను చేయరు. 17 ఆ సమయంలో యెరూషలేము నగరం ‘యెహోవా సింహాసనం’ అని పిలువబడుతుంది. దేశ దేశాల ప్రజలు యెరూషలేము నగరంలో కలిసి యెహోవాను స్మరించి ఆయన నామాన్ని గౌరవిస్తారు. ప్రజలు తమ మొండి హృదయాలను ఇక ఎంత మాత్రం అనుసరించరు. 18 ఆ రోజుల్లో యూదా వంశం ఇశ్రాయేలు వంశంతో కలుస్తుంది వారు ఉత్తర ప్రాంతంలో ఒకే చోటునుండి కలిసి వస్తారు. వారి పితరులకు నేనిచ్చిన రాజ్యంలోకి వారు వస్తారు.”
19 యెహోవానైన నేనిలా అనుకున్నాను,
“మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం నాకు సంతోషదాయకం.
మీకో మంచి రాజ్యాన్నివ్వటం వాకు తృప్తినిస్తుంది.
ఆ రాజ్యం ఇతర రాజ్యాలకంటె సుందరంగా ఉంటుంది.
మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలుస్తారనుకున్నాను.
మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను.
20 కాని తన భర్త పట్ల వంచనగా నడిచే స్త్రీవలె మీరు తయారయ్యారు.
ఇశ్రాయేలు వంశమా, నీవు నా పట్ల విశ్వాస పాత్రంగా మెలగ లేదు!
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
21 నగ్నంగా ఉన్న కొండలమీద రోదన నీవు వినవచ్చు.
ఇశ్రాయేలు ప్రజలు దయాభిక్ష కోరుకుంటూ ఏడుస్తూ ప్రార్ధన చేస్తున్నారు.
వారు బహు దుష్టులైనారు!
వారు తమ యెహోవా దేవున్ని మర్చిపోయారు.
22 “విశ్వాసఘాతకులగు ఇశ్రాయేలీయులారా నా వద్దకు తిరిగి రండి.
నన్నాశ్రయించి రండి.
నా పట్ల వంచనతో
మెలిగినందుకు క్షమిస్తాను.”
“అవును. మేము నీ వద్దకు వస్తాము.
నీవు మా యెహోవా దేవుడవు
23 కొండల మీద విగ్రహాలను పూజించుట అవివేకం.
కొండలమీద ఆడంబరంగా జరిగే పూజా కార్యక్రమమంతా మోసం.
నిజానికి, ఇశ్రాయేలుకు రక్షణ
యెహోవా దేవుని వద్దనుండే వస్తుంది.
24 ఆ భయంకరమైన బయలుదేవత
మన తండ్రుల ఆస్తిని మ్రింగివేసింది.
మనం పిల్లలం కావటంతో ఇదంతా జరిగింది.
ఆ భయంకరమైన దేవత[a]
మన తండ్రుల గొర్రెలను, పశువులను,
వారి కుమారులను, కుమార్తెలను చంపింది.
25 మనం సిగ్గుతో తలవంచుకుందాం.
మన అవమానం మనల్ని దుప్పటిలా కప్పివేయనీయండి.
మన యెహోవా దేవునిపట్ల మనం తీవ్రమైన పాపం చేశాం.
మనం, మన తండ్రులు కూడా పాపానికి ఒడిగట్టాము.
మన చిన్నతనం నుండి ఇప్పటివరకు
యెహోవా దేవుని ఆజ్ఞను మనం పాటించలేదు” అని చెప్పాలి.
పెద్ద విందు ఉపమానం
(మత్తయి 22:1-10)
15 భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఒకడు యిది విని యేసుతో, “దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొన్నవాడు ధన్యుడు” అని అన్నాడు.
16 యేసు యిలా చెప్పాడు: “ఒకడు పెద్ద విందు చేయదలచి చాలా మందిని ఆహ్వానించాడు. 17 వంటలు సిద్ధమయ్యాక తాను ఆహ్వానించిన వాళ్ళ దగ్గరకు తన సేవకుణ్ణి పంపి ‘రండి! అంతా సిద్ధం’ అని చెప్పమన్నాడు. 18 కాని అందరూ ఒకే రీతిగా సాకులు చెప్పారు. మొదటివాడు ‘నేను పొలం కొన్నాను, వెళ్ళి తప్పకుండా దాన్ని చూడాలి; నన్ను క్షమించు’ అని అన్నాడు. 19 ఇంకొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. వెళ్ళి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి, నన్ను క్షమించుము’ అని అన్నాడు. 20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు.
21 “ఆ సేవకుడు తిరిగి వచ్చి జరిగినదంతా తన యజమానితో చెప్పాడు. అతనికి కోపం వచ్చి తన సేవకునితో, ‘వెంటనే పట్టణంలో ఉన్న అన్ని వీధుల్లోకి వెళ్ళి పేదవాళ్ళను, వికలాంగులను, గ్రుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను పిలిచుకురా!’ అని అన్నాడు.
22 “ఆ సేవకుడు మళ్ళీవచ్చి, ‘అయ్యా! మీరు చెప్పినట్లు చేసాను. కాని భోజనశాలలు ఇంకా నిండలేదు’ అని అన్నాడు. 23 అప్పుడు ఆ యజమాని తన సేవకునితో ‘ఊరి బయటనున్న రహదారులకు, పొలాలకు వెళ్ళి అక్కడి వాళ్ళను తప్పక రమ్మనమని చెప్పు. వాళ్ళతో నా యిల్లంతా నిండి పోవాలి. 24 నేను చెప్పేదేమిటంటే నేనిదివరకు పిలిచిన వాళ్ళలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’ అని అన్నాడు.”
© 1997 Bible League International