Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 58

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం.

58 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు.
    మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.
లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు.
    ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు.
    పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు.
    వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.
త్రాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు.
    ఆ దుర్మార్గులు అలా ఉన్నారు.

యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు.
    కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.
ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక.
    బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.
మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక.
    చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.
కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా
    కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.

10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం
    వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు.
ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది.
    లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”

యిర్మీయా 3:1-14

“ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిస్తే, ఆమె అతన్ని వదిలి వెళ్లి మరో వివాహం చేసికొంటే,
    ఆ వ్యక్తి మళ్లీ ఆమెవద్దకు తిరిగి రాగలడా? లేదు. రాలేడు!
    ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు[a] తిరిగి వెళితే ఆ రాజ్యం పూర్తిగా ‘మాలిన్య’ మైపోతుంది.
యూదా, నీవు అనేకమంది విటులతో (అబద్ధపు దేవుళ్లు) వట్టి వేశ్యవలె ప్రవర్తించావు.
    మరల నీవిప్పుడు నా వద్దకు రావాలని కోరుతున్నావా?”
అని యెహోవా పలికాడు.
“యూదా, దిశగా ఉన్న కొండ శిఖరాలను చూడు.
    నీవక్కడ తిరుగని చోటు ఉందా? నీవు బాట ప్రక్కన విటుల (అబద్ధపు దేవుళ్ల) కోసం వేచివున్నావు.
ఎడారిలో కూర్చున్న అరబీయునివలె
    నీవక్కడ కూర్చున్నావు.
నీవు దేశాన్ని ‘అపవిత్రం’ చేశావు! ఏమైనంటావా?
    నీవు చాలా దుష్కార్యాలు చేశావు.
    నీవు నాకు విశ్వాసపాత్రంగా లేవు.
నీవు పాపం చేశావు. అందుచే వర్షాలు లేవు.
    వసంత కాలపు వానలూ లేవు.
అయినా నీ ముఖ లక్షణాలు వేశ్యాలక్షణాల్లా ఉన్నాయి.
    నీ అకృత్యాలకు సిగ్గుపడటంకూడా మానివేశావు.
కాని నీవు నన్నిప్పుడు పిలుస్తున్నావు.
‘నా తండ్రీ’ నా బాల్యంనుండి
    ‘నీవు నాకు ప్రియ మిత్రునిలా ఉన్నావు.’
‘దేవుడు నా పట్ల ఎల్లప్పుడూ కోపంగా ఉండడు.
    దేవుని కోపం అల్పమైనది.
    అది శాశ్వతంగా ఉండదు’ అని అంటున్నావు.

“యూదా, నీవీ విషయాలు అంటూనే
    నీవు ఎంత చెడు చేయగలవో అంతా చేస్తున్నావు.”

చెడ్డ తోబుట్టువులు: ఇశ్రాయేలు మరియు యూదా

రాజైన యోషీయా యూదా రాజ్యాన్ని పాలించే కాలంలో యెహోవా నాతో మాట్లాడినాడు. ఆయన ఇలా అన్నాడు: “యిర్మీయా, ఇశ్రాయేలు[b] చేసిన చెడ్డపనులు నీవు చూశావు. నా పట్ల ఆమె ఎలా విశ్వాసరహితంగా ఉన్నదో నీవు చూశావు! ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద విగ్రహాలతో వ్యభిచరించిన పాపానికి ఇశ్రాయేలు పాల్పడింది. ‘ఈ చెడు కార్యాలన్నీ చేయటం పూర్తయిన పిమ్మట ఇశ్రాయేలు తప్పక నావద్దకు తిరిగి వస్తుంది’ అని నేననుకున్నాను. కాని ఆమె నా వద్దకు రాలేదు. విశ్వాస ఘాతకురాలైన ఇశ్రాయేలు సోదరియగు యూదా ఆమె ఏమి చేసిందో చూసింది. ఇశ్రాయేలు విశ్వాసపాత్రంగా లేదు. ఆమెను నేనెందుకు పంపి వేశానో ఇశ్రాయేలుకు తెలుసు. ఆమె వ్యభిచార దోషానికి పాల్పడినందుకే నేనామెకు విడాకులిచ్చానని ఇశ్రాయేలుకు తెలుసు. కాని అది విశ్యాస ఘాతకురాలైన ఆమె సోదరిని భయపెట్టలేదు. యూదా భయపడలేదు. యూదా కూడా తెగించి వ్యభిచారిణిలా ప్రవర్తించింది. తానొక మరుగులేని వ్యభిచారిణిలా ప్రవర్తిస్తున్నాననే చింతన చేయలేదు. అలా ఆమె తన దేశాన్ని ‘మలిన’ (అపవిత్ర) పర్చింది. రాతితోను, చెక్కలతోను చేసిన విగ్రహాలను ఆరాధించి, వ్యభిచార పాపానికి ఒడిగట్టుకుంది. 10 ఇశ్రాయేలు యొక్క విశ్వాస ఘాతకురాలైన సోదరి (యూదా) హృదయ పూర్వకంగా నావద్దకు తిరిగి రాలేదు. నావద్దకు తిరిగి వచ్చినట్లు ఆమె నటించింది.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.

11 యెహోవా నాతో ఇలా చెప్పినాడు “ఇశ్రాయేలు నాకు విశ్వాసపాత్రంగా లేదు. విశ్వాసం లేని యూదా కంటె ఇశ్రాయేలుకు చెప్పుకొనేందుకు ఒక మంచి సాకువుంది. 12 యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఉత్తర దేశంలో చెప్పు:

“‘విశ్వాసంలేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి.’
ఇది యెహోవా వాక్కు.
‘నిన్ను చూచి ముఖం తిప్పుకోను.
    నేను నిండు దయతో ఉన్నాను.’
ఈ వాక్కు యెహోవాది.
‘నీ పట్ల నేను శాశ్వతమైన కోపంతో ఉండను.
13 నీవు నీ పాపాన్ని గుర్తించాలి.
    నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు
    నీ పాపం అదే.
ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు
    నీవు ప్రతి పచ్చని చెట్టు క్రిందా విగ్రహారాధన చేశావు
    నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.’”
ఇదే యోహోవా వాక్కు.

14 “విశ్వాసంలేని ప్రజలారా, నావద్దకు రండి” అని యెహోవా అంటున్నాడు “నేను మీ యజమానిని. ప్రతి నగరంనుంచీ ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి కుటుంబంనుంచీ ఇద్దరు మనుష్యులను తీసుకొని మిమ్మల్ని సీయోనుకు తీసుకొని వస్తాను.

తీతుకు 1:1-9

దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడును అయినటువంటి పౌలు వ్రాయుచున్న పత్రిక. దేవుడు తానెన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని దృఢపరచడానికి, వాళ్ళను భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను ఎన్నుకొన్నాడు. ఈ సత్యం, అనంత జీవితం లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే వాగ్దానం చేసాడు. సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింపబడింది. మన రక్షకుడైనటువంటి దేవుడు దాన్ని మీకు ప్రకటించమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు ప్రకటిస్తున్నాను.

మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయటమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక!

క్రేతులో తీతు చేయవలసిన పని

అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను. క్రీస్తు సంఘంలోనున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక, అవినీతిగా ఉండక, చెడ్డపేరు లేకుండా, విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి. సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు. అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించనివాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International