Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 58

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం.

58 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు.
    మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.
లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు.
    ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు.
    పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు.
    వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.
త్రాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు.
    ఆ దుర్మార్గులు అలా ఉన్నారు.

యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు.
    కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.
ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక.
    బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.
మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక.
    చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.
కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా
    కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.

10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం
    వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు.
ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది.
    లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”

యిర్మీయా 2:23-37

23 “యూదా, ‘నేను దోషినికానని, బయలు విగ్రహాలను ఆరాధించలేదని’
    నీవెలా నాకు చెప్పగలవు?
లోయలో నీవు చేసిన పనులు గూర్చి ఒకసారి ఆలోచించుకో.
    నీవు ఏమిచేశావో గుర్తుకు తెచ్చుకో.
నీవొక వడిగల ఆడ ఒంటివలె
    ఒక చోటినుండి మరో చోటికి పరుగెత్తావు.
24 ఎడారిలో తిరిగే ఒక అడవి గాడిదలా నీవున్నావు.
    సంగమ సమయంలో అది గాలిని వాసనచూస్తూ తిరుగుతుంది.
    మిక్కిలి ఎదగొన్నప్పుడు దానిని ఎవ్వరూ వెనుకకు మరల్చలేరు.
ఎదకాలంలో దానిని కోరే ప్రతీ మగజంతువూ దానిని పొందగలదు.
    అప్పుడు దానిని కనుగొనటం తేలిక.
25 యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి.
    ఇతర దేవుళ్ల కొరకు దాహాన్ని వదిలి పెట్టు.
కానీ, ‘లాభం లేదు! నేను వదల్లేను!
    నేను పరదేవుళ్లనే ప్రేమిస్తాను.
    నేను వాటినే ఆరాధిస్తాను’ అని నీవంటావు.

26 “ప్రజలు పట్టుకున్నప్పుడు
    దొంగ సిగ్గుపడతాడు
అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలు అవమానం పాలవుతారు.
    ఇశ్రాయేలు రాజులు, ప్రజానాయకులు, యాజకులు, ప్రవక్తలు అందరూ సిగ్గుతో తలవంచుకుంటారు.
27 ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు!
    దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు.
ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు.
    దానితో, ‘నీవే మాకు జన్మనిచ్చావు’ అంటారు.
ఆ ప్రజలంతా అవమానం పొందుతారు.
ఆ ప్రజలు నావైపుకు చూడరు.
    వారు విముఖులై నాకు వెన్ను చూపుతారు.
కాని యూదాప్రజలు కష్టాల పాలైనప్పుడు,
    ‘వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.
28 ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి?
    మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము.
యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి!

29 “మీరు నాతో ఎందుకు వాదిస్తారు?
    మీరంతా నాకు వ్యతిరేకులయ్యారు.”
ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినది.
30 “యూదా ప్రజలారా, నేను మిమ్మును శిక్షించాను.
    కాని అది పనిచేయలేదు.
మిమ్మల్ని శిక్షించినప్పుడు కూడా
    మీరు వెనక్కి మరలలేదు.
మీ వద్దకు వచ్చిన ప్రవక్తలను మీరు మీకత్తులతో చంపారు.
మీరొక భయంకర సింహంలా ప్రవర్తించి వారిని సంహరించారు.”
31 ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి.

“ఇశ్రాయేలు ప్రజలకు నేనొక ఎడారిలా ఉన్నానా?
    వారికి నేనొక అంధకారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా ఉన్నానా?
‘మేము మా యిష్టానుసారంగా నడవటానికి మాకు స్వేచ్ఛ ఉంది.
    యెహోవా, మేము తిరిగి నీ చెంతకు రాము,’ అని నా ప్రజలు అంటారు.
కానీ, వారలా ఎందుకు మాట్లాడతారు?
32 ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు!
    ఏ పెండ్లి కుమార్తెగాని తన దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు!
కాని నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు.

33 “యూదా, ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) వెంబడించటం నీకు బాగా తెలుసు.
    కావున దుష్టకార్యాలు చేయుట నీకై నీవే నేర్చుకున్నావు.
34 మీ చేతులు రక్తసిక్తమైనాయి![a]
    అది పేదవాళ్ల, అమాయకుల రక్తం. నిష్కారణముగా నీవు ప్రజలను చంపావు. కనీసం వారు నీవు పట్టుకున్న దొంగలైనా కారు. నీవటువంటి చెడ్డ పనులు చేస్తావు.
35 కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’
    అని నీవు చెప్పుకుంటూ ఉంటావు.
అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను,
    ఎందుకంటే ‘నేనేమీ పాపం చేయలేదు’ అని నీవంటున్నావు.
36 నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని!
    అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది.
అందుచేత అష్షూరును[b] వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు.
    ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.
37 చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు.
    అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టుకుంటావు. నీవు ఆ రాజ్యాలను నమ్మినావు.
కాని ఆ రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించలేవు.
    ఎందువల్లనంటే యెహోవా ఆ రాజ్యాలను తిరస్కరించాడు.

హెబ్రీయులకు 13:7-21

మీకు దైవసందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని జ్ఞాపకముంచుకోండి. వాళ్ళ జీవిత విధానం వలన కలిగిన మంచిని గమనించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. నిన్న, నేడు, నిరంతరం యేసు క్రీస్తు ఒకే విధంగా ఉంటాడు. ఎన్నో రకాల విచిత్రమైన బోధలు ఉన్నాయి. వాటివల్ల మోసపోకండి. దైవానుగ్రహంతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారంతో కాదు. ఆహార నియమాలవల్ల వాళ్ళకు లాభం కలుగదు.

10 యూదుల గుడారంలో సేవచేసే యాజకులకు మన బలిపీఠం మీద బలి ఇచ్చినదాన్ని తినే అధికారంలేదు. 11 పాపాలకు ప్రాయశ్చిత్తంగా అర్పించటానికి ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్రస్థానంలోకి తీసుకు వెళ్ళేవాడు. ఆ జంతువుల దేహాల్ని శిబిరానికి ఆవలి వైపు కాల్చేవాడు. 12 మనుష్యుల్ని తన రక్తంతో పవిత్రం చెయ్యాలని యేసు నగరపు సింహద్వారానికి ఆవల మరణించాడు. 13 అందువల్ల శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన అవమానాన్ని పంచుకుందాం. 14 మనకు స్థిరమైన పట్టణం లేదు. కాని మున్ముందు రానున్న పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము. 15 అందువల్లే మనం యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం. 16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.

17 మీ నాయకుల పట్ల విధేయతగా ఉంటూ, వాళ్ళు చెప్పినట్లు చెయ్యండి. మీ ఆత్మల్ని కాపాడవలసిన పని వాళ్ళది. వాళ్ళు దేవుని ముందు లెక్క చెప్పవలసివుంటుంది. వాళ్ళకు మీరు విధేయులైవుంటే, వాళ్ళు తాము చేయవలసిన పనిని ఆనందంగా చేయగలుగుతారు. అది వాళ్ళకు భారంగా వుండదు. వాళ్ళకు భారం కలగటం మీకు మంచిది కాదు.

18 మా కోసం ప్రార్థించండి. మా అంతరాత్మలు నిర్మలమైనవనే విశ్వాసం మాకు ఉంది. మేము అన్ని విధాలా గౌరవప్రదంగా జీవించాలనుకొంటున్నాము. 19 నేను ముఖ్యంగా వేడుకునేదేమిటంటే, నేను త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్థించండి.

20 శాంతిని స్థాపించే దేవుడు, గొఱ్ఱెల గొప్ప కాపరి అయిన మన యేసు ప్రభువును తిరిగి బ్రతికించాడు. ఈ కార్యాన్ని దేవుడు శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా జరిగించాడు. 21 ఆ దేవుడు మీరు ఆయన యిష్టానుసారం నడుచుకునేటట్లు మీకు కావలసినవి సమకూర్చు గాక! ఆయన మనలో ఉండి, యేసు క్రీస్తు ద్వారా తన యిష్టాన్ని నెరవేర్చుగాక! ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International