Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 2:4-13

యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి.
    ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి.

యెహోవా ఇలా చెప్పాడు:
“మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా?
    అందుకేనా వారు నాపట్ల విముఖులైనారు?
మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
    తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.
‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి
    తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మాకు ఎడారులలో మార్గదర్శి అయిన
    యెహోవా ఎక్కడ ఉన్నాడు?
మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో
    సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?
ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ,
    ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు.
    ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు.
కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’
    మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”

ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో
    నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను.
మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను.
    కాని మీరు వచ్చి, నా దేశాన్ని అపవిత్ర పర్చారు.
ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను.
    అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు.

“యెహోవా ఎక్కడ అని
    యాజకులు అడగలేదు.
నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.
    ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు.
బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు.
    వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను
    నేను నిందిస్తున్నాను.
10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి[a] వెళ్లి చూడండి.
    ఒకనిని కేదారు[b] రాజ్యానికి పంపి, శ్రద్ధగా పరిశీలించమనండి.
అక్కడ ఎవరైనా ఈ రకంగా
    ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.
11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను
    క్రొత్త దేవుళ్లతో మార్చుకున్నారా?
లేదు! నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు
అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని
    పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.

12 “ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి.
    భయకంపితులుకండి!”
యెహోవా ఇలా చెప్పాడు.
13 “నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు:
వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు
    పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు.
(వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.)
    కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.

కీర్తనలు. 81:1

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.

కీర్తనలు. 81:10-16

10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

హెబ్రీయులకు 13:1-8

చివరి మాటలు

13 పరస్పరం సోదరుల్లా జీవించండి. తెలియనివాళ్ళకు ఆతిథ్యమివ్వండి. కొందరు యిలా చేసి తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు. చెరసాలల్లో ఉన్నవాళ్ళను, మీరు వాళ్ళతో సహా ఉన్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి. అదేవిధంగా కష్టాలనుభవిస్తున్న వాళ్ళను, మీరు వాళ్ళతో సహా కష్టాలనుభవిస్తున్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి.

వివాహాన్ని అందరూ గౌరవించాలి. వివాహపాన్పును నిష్కళంకంగా ఉంచాలి. వ్యభిచారుల్ని, వివాహితులతో లైంగిక సంబంధాలను పెట్టుకొన్నవాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. ధనాశ లేకుండా జీవితాలు గడపండి. మీ దగ్గరున్నదానితో సంతృప్తి చెందండి. ఎందుకంటే దేవుడు ఈ విధంగా అన్నాడు:

“నేను నిన్ను ఎన్నటికీ విడువను
నిన్నెన్నటికీ ఒంటరివాణ్ణి చెయ్యను.”(A)

అందువల్ల మనం దృఢ విశ్వాసంతో,

“ప్రభువు నా రక్షకుడు,
    నాకే భయంలేదు.
మానవుడు నన్నేమి చెయ్యగలడు?”(B)

అని అంటున్నాము.

మీకు దైవసందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని జ్ఞాపకముంచుకోండి. వాళ్ళ జీవిత విధానం వలన కలిగిన మంచిని గమనించండి. వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి. నిన్న, నేడు, నిరంతరం యేసు క్రీస్తు ఒకే విధంగా ఉంటాడు.

హెబ్రీయులకు 13:15-16

15 అందువల్లే మనం యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం. 16 ఇతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్నదాన్ని యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి చాలా యిష్టం.

లూకా 14:1

యేసు ఒక రోగికి నయం చెయ్యటం

14 ఒక విశ్రాంతి రోజు యేసు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు.

లూకా 14:7-14

నిన్ను నీవు గొప్ప చేసికొనవద్దు

విందులకు వచ్చిన అతిథులు గౌరవ స్థానం ఆక్రమించుట గమనించి యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “మీరు పెళ్ళి విందుకు ఆహ్వానింపబడినప్పుడు, మీకన్నా ముఖ్యమైన అతిథులు ఆహ్వానించబడి ఉండవచ్చు. కనుక ముందు స్థానాల్లో కూర్చోకండి. అలాచేస్తే ఆ యింకొక వ్యక్తిని ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘ఈ స్థలం యితనికి యివ్వు’ అని అంటాడు. నీవు అవమానం పొంది చివరన ఉన్న స్థలంలో కూర్చోవలసి వస్తుంది.

10 “అందువల్ల నిన్ను ఆహ్వానించినప్పుడు చివరన ఉన్న స్థలంలో కూర్చో. అలా చేస్తే నిన్ను ఆహ్వానించిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ‘మిత్రమా! ముందుకు వచ్చి మంచి స్థలంలో కూర్చో’ అని అంటాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళలో నీ గౌరవం పెరుగుతుంది. 11 ఎందుకంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమించినవాడు అల్ప స్థానానికి దించబడతాడు. తనంతట తాను అల్ప స్థానాన్ని ఆక్రమించినవాడు ఉన్నత స్థానానికి ఎత్తబడతాడు.”

నీకు ప్రతిఫలము దొరుకుతుంది

12 అప్పుడు యేసు తన అతిథితో, “భోజనానికి లేక విందుకు ఆహ్వానించదలచినప్పుడు మీ స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని కాని ధనికులైన మీ ఇరుగు పొరుగు వాళ్ళను కాని ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది. 13 కనుక మీరు విందు చేసినప్పుడు పేదవాళ్ళను, వికలాంగులను, కుంటివాళ్ళను, గ్రుడ్డివాళ్ళను ఆహ్వానించండి. 14 వాళ్ళు మీ రుణం తీర్చలేరు. కనుక మీరు ధన్యులౌతారు. ఎందుకంటే మంచి వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి బహుమతి నిస్తాడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International