Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 81:1

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.

కీర్తనలు. 81:10-16

10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

యిర్మీయా 12:1-13

యిర్మీయా దేవునికి ఫిర్యాదు చేయుట

12 యెహోవా, నేను నీతో వాదించినట్లయితే,
    నీవే ఎల్లప్పుడూ సరైనవాడవుగా ఉంటావు!
కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల గురించి నేను నిన్ను అడగాలనుకొంటున్నాను.
    దుర్మార్గులు ఎందుకు విజయవంతులవుతున్నారు?
    నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం గడుపుతున్నారు?
ఈ దుర్మార్గులను నీవిక్కడ ఉంచినావు. మొక్కలు బాగా వేరూనినట్లు వారు బాగా స్థిరపడి,
    అభివృద్ధిచెంది కాయలు కాసారు.
నీవు వారికి చాలా ప్రియమైన వాడివని వారు నోటితో చెబుతారు.
    కాని వారి హృదయాలలో నీవు లేవు. వారు నీకు చాలా దూరంగా ఉన్నారు.
ఓ ప్రభువా, నా హృదయం నీకు తెలుసు.
    నన్ను నీవు చూస్తూనే ఉన్నావు. నా మనస్సును పరీక్షిస్తూనే ఉన్నావు.
గొర్రెలను నరకటానికి లాగినట్టు, ఆ దుర్మార్గపు మనుష్యులను లాగివేయి.
    సంహారపు రోజునకు వారిని ఎంపిక చేయి.
ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి?
    ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి?
దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి.
    ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం.
పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బ్రతకడు”
    అని ఆ దుర్మార్గులే అంటున్నారు.

యిర్మీయాకు దేవుని సమాధానం

“యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే,
    మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు?
సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే,
    యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు?
ఈ మనుష్యులు నీ స్వంత సోదరులు.
    నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు.
    నీ ఇంటివారే నిన్ను జూచి అరుస్తున్నారు.
వారు నీతో స్నేహితులవలె మాట్లాడినా
    నీవు వారిని నమ్మవద్దు.

యెహోవా యూదాను తిరస్కరించుట

“నేను (యెహోవాను) నా ఇంటిని (యూదాను) వదిలివేశాను.
    నా స్వంత ఆస్తిని[a] నేను వదిలివేశాను.
నేను ప్రేమించే దానిని (యూదా) ఆమె శత్రువులకే అప్పగించాను.
నా ఆస్తే నాకు ఒక భయంకర సింహంలా తయారయ్యింది.
అది నన్ను చూచి గర్జిస్తూవుంది.
    అందుచే దాన్ని నేను అసహ్యించు కుంటున్నాను.
నా ఆస్తి రాబందులచే ఆవరింపబడిన
    చనిపోయే జంతువులా వుంది.
ఆ పక్షులు దాని చుట్టూ ఎగురుతాయి.
    వన్య (అడవి) మృగములారా, రండి.
    రండి, తినటానికి ఆహారం తీసుకోండి.
10 చాలామంది గొర్రెల కాపరులు (నాయకులు) నా ద్రాక్షా తోటను నాశనం చేసారు.
    ఆ కాపరులు నా తోటలోని మొక్కలపై నడిచారు.
    వారు నా అందాల తోటను వట్టి ఎడారిగా మార్చి వేశారు.
11 వారు నా భూమిని ఎడారిలా చేశారు.
    అది ఎండి చచ్చిపోయింది. అక్కడ ఎవ్వరూ నివసించరు.
దేశం యావత్తూ వట్టి ఎడారి అయ్యింది.
    అక్కడ ఆ భూమిని గూర్చి శ్రద్ధ వహించే వారు ఎవ్వరూ లేరు.
12 సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు.
    యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు.
రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు.
    ఏ ఒక్కరికీ రక్షణ లేదు.
13 ప్రజలు గోధుమ పైరు నాటుతారు.
    కాని వారు కోసేది ముండ్లను మాత్రమే.
వారు బాగా అలసిపోయేటంతగా శ్రమిస్తారు.
    కాని వారి శ్రమకు ఫలం శూన్యం.
వారి పంట విషయంలో వారు సిగ్గు చెందుతారు.
    యెహోవా కోపకారణంగా ఇదంతా జరిగింది.”

1 పేతురు 4:7-11

దేవుని వరాలకు మంచి నిర్వాహకులుగా ఉండండి

అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మనిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించ గలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా, “ప్రేమ” పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి. సణగకుండా, పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి. 10 ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి. 11 మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచినవాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవ చెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International