Revised Common Lectionary (Semicontinuous)
10 యెహోవా, నీవెందుకు అంత దూరంగా ఉంటావు?
కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు.
2 గర్విష్ఠులు, దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు.
మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు.
3 దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయపడతారు.
లోభులు యెహోవాను దూషిస్తారు. ఈ విధంగా దుష్టులు యెహోవాను ద్వేషిస్తున్నట్టు వ్యక్తం చేస్తారు.
4 ఆ దుర్మార్గులు చాలా గర్విష్ఠులు కనుక దేవున్ని అనుసరించరు.
వాళ్లు తమ పాపిష్టి పథకాలన్నీ తయారు చేస్తారు. పైగా దేవుడే లేడు అన్నట్టు వారు ప్రవర్తిస్తారు.
5 ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు.
కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు.
దేవుని శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు.
6 వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు తలుస్తారు.
“మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు” అని వారు అంటారు.
7 ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు.
దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు.
8 ఆ మనుష్యులు రహస్య స్థలాల్లో దాగుకొని ప్రజలను పట్టుకొనేందుకు కనిపెడతారు.
ప్రజలను బాధించుటకు వారికోసం చూస్తూ దాగుకుంటారు.
నిర్దోషులను వారు చంపుతారు.
9 తినవలసిన జంతువులను పట్టుకోవటానికి ప్రయత్నించే సింహాలవలె వారుంటారు.
ఆ దుర్మార్గులు, పేదల మీద దాడిచేస్తారు. దుష్టులు వేసే ఉచ్చులలో పేదలు చిక్కుకొంటారు.
10 పేదలను, బాధపడేవారిని,
ఆ దుష్టులు మరల, మరల బాధిస్తారు.
11 అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా ఆలోచించటం మొదలు పెడ్తారు: “దేవుడు మమ్ముల్ని మరచిపోయాడు!
దేవుడు మానుండి శాశ్వతంగా విముఖుడయ్యాడు!
మాకు ఏమి జరుగుతుందో దేవుడు చూడటం లేదు!”
12 యెహోవా, లేచి ఏదైనా చేయుము!
దేవా, దుష్టులను శిక్షించుము!
పేదలను మాత్రం మరువకుము!
13 దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు?
ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అనుకొంటారు గనుక.
14 యెహోవా, దుర్మార్గులు చేసే కృ-రమైన చెడ్డ సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు.
నీవు వాటిని చూచి వాటి విషయమై ఏదో ఒకటి చేయుము.
ఎన్నో కష్టాలతో ప్రజలు నీ దగ్గరకు సహాయం కోసం వస్తారు.
యెహోవా, తల్లి దండ్రులు లేని పిల్లలకు సహాయం చేసే వాడివి నీవే. కనుక వారికి సహాయం చేయుము.
15 యెహోవా, దుర్మార్గులను నాశనం చేయుము.
16 యెహోవా నిరంతరం రాజైయున్నాడు.
ఆ ప్రజలు ఆయన దేశంలోనుండి నశించెదరు గాక!
17 యెహోవా, పేదలు కోరుకొనే వాటిని గూర్చి నీవు విన్నావు.
నీవు వారిని ప్రోత్సాహ పరచెదవు. వారి ప్రార్థనలు ఆలకించెదవు.
18 యెహోవా, అనాథ పిల్లలను కాపాడుము. దుఃఖంలో ఉన్న వారిని ఇంకా ఎక్కువ కష్టాలు పడనీయకుము.
దుర్మార్గులు ఇక్కడ ఉండకుండుటకు చాలా భయపడేటట్టుగా చేయుము.
యిర్మీయా దేవాలయ ప్రసంగం
7 యిర్మీయాకు యెహోవా నుండి ఇలా వర్తమానం వచ్చింది: 2 “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించుము:
“‘ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవాను ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా ఈ వర్తమానం వినండి! 3 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడు, మీ జీవన విధానం మార్చుకోండి. సత్కార్యములు చేయండి! మీరలా చేస్తే, ఈ స్థలంలో మిమ్మల్ని నివసించేలాగు చేస్తాను[a] 4 కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం;[b] ఇదే దేవాలయం ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు. 5 మీరు మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, మిమ్మల్ని ఈ ప్రదేశంలో నివసించేలా చేస్తాను. మీరు ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి. 6 క్రొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. 7 మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను.
8 “‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు అప్రయోజనకరమైనవి. 9 మీరు దొంగతనాలు, హత్యలు చేస్తారా? వ్యభిచార పాపానికి ఒడిగడతారా? మీరు ఇతరులపై అకారణంగా నేరారోపణ చేస్తారా? బూటకపు బయలు దేవుణ్ణి ఆరాధిస్తారా? మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరిస్తారా? 10 మీరీ పాపాలు చేసి, నా పేరుతో పిలవబడే ఈ ఆలయంలో నా ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? ఈ చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటానికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా? 11 ఈ ఆలయం నా పేరుతో పిలవబడుతూ ఉంది! అయితే మీకు ఈ స్థలం ఒక దొంగల గుడారముకంటె భిన్నంగా కన్పించటం లేదా? నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!’” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది!
12 “‘యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు షిలోహు నగరానికి వెళ్లండి. అక్కడ నేను మొదటిసారిగా ఎక్కడైతే నా నామం కోసం ఒక ఇంటిని నిర్మించానో ఆ చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయులు కూడ దుష్టకార్యాలు చేశారు. వారు చేసిన పాపకార్యాలకు ప్రతిగా ఆ స్థలానికి నేను ఏమి చేసియున్నానో వెళ్లి చూడండి[c] 13 ఇశ్రాయేలీయులారా, మీరీ చెడుకార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది! నేను మీతో అనేక పర్యాయాలు మాట్లాడి యున్నాను. కాని మీరు వినటానికి నిరాకరించారు. నేను మిమ్మల్ని పిలిచాను. అయినా మీరు పలకలేదు. 14 అందుచే యెరూషలేములో నాపేరు మీద పిలవబడే ఈ ఆలయాన్ని నాశనం చేస్తాను. షిలోహును నాశనం చేసినట్లు ఆ ఆలయాన్ని నాశనం చేస్తాను! ఆ ఆలయంలో మీరు విశ్వాసముంచారు. నేనా స్థలాన్ని మీకు, మీ పూర్వీకులకు ఇచ్చియున్నాను. 15 మీ సోదరులనందరినీ నేను ఎఫ్రాయిమునుండి వెడల గొట్టినట్లు, నానుండి మిమ్మల్ని దూరంగా వెడలగొడతాను.’
దేవుని ప్రజలకు విశ్రాంతి
7-8 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు:
“ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు.
ఆయన సహనాన్ని పరీక్షించారు.
కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.
9 నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా
మీ పూర్వికులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.
10 ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది,
‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి,
నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.
11 అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని
కోపంతో ప్రమాణం చేశాను.’”(A)
12 సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. 13 ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు. 14 మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం. 15 ఇంతకు ముందు చెప్పబడినట్లు:
“ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు
కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”(B)
16 వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా! 17 నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయినవాళ్ళమీదనే కదా! 18 “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించినవాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.
4 దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం. 2 ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింపబడినట్లే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక అది వాళ్ళకు నిష్ర్పయోజనమైపోయింది. 3 సువార్తను విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము.
“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పుచున్నాను:
‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను’”(C)
అని దేవుడు అన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఆయన కార్యం ముగిసింది. 4 కాని, “దేవుడు ప్రపంచాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకొనెను”(D) అని ఏడవ రోజును గురించి ఒక చోట వ్రాయబడి ఉంది. 5 దేవుడు ఈ విషయాన్ని గురించి మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని అన్నాడు.
6 ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకావుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్నవాళ్ళు, వాళ్ళ అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేకపొయ్యారు. 7 అందువల్ల దేవుడు మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని “ఈ రోజు” అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా మాట్లాడాడు:
“ఈ రోజు మీరాయన స్వరం వింటే,
మూర్ఖంగా ప్రవర్తించకండి.”(E)
8 యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. 9 అందువల్ల, దేవుని ప్రజల కోసం “విశ్రాంతి” కాచుకొని ఉంది. 10 దేవుడు తన పని ముగించి విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు. 11 అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవర్తించి క్రింద పడకుండా జాగ్రత్తపడదాం.
© 1997 Bible League International