Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు ధ్యాన గీతం.
74 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?
నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా?
2 చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.
నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం.
నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము.
3 దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.
శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము.
4 శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.
యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు.
5 శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను
నరికే మనుష్యుల్లా ఉన్నారు.
6 ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,
నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు.
7 దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.
వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు.
ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది.
8 శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.
దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు.
9 మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.
ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు.
ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు.
10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?
నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా?
11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు?
నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు.
12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు.
నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు.
13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.
14 మకరపు తలను నీవు చితుకగొట్టావు.
దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు.
15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.
మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు.
16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.
సూర్యుని, చంద్రుని నీవే చేశావు.
17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.
వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు.
18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో.
ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు.
19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని[a] తీసుకోనివ్వకుము.
నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము.
20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము.
ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది.
21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.
వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము.
నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
22 దేవా, లేచి పోరాడుము.
ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము.
23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.
ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు.
27 ఆ సమయంలో వంకర సర్పమైన మకరానికి ఆయన తీర్పు తీర్చును.
యెహోవా తన ఖడ్గం ప్రయోగిస్తాడు,
కఠినమైన, తన శక్తిగల ఖడ్గంతో ఆయన మకర సర్పాన్ని ఆ మెలికల సర్పాన్ని శిక్షిస్తాడు.
ఆ పెద్ద ప్రాణిని సముద్రం లోనే యెహోవా చంపేస్తాడు.
2 ఆ సమయంలో సంతోషకరమైన ద్రాక్షతోటను గూర్చి ప్రజలు పాటలు పాడుతారు.
3 “యెహోవాను, నేనే ఆ తోట విషయం శ్రద్ధతీసుకుంటాను.
సరైన సమయంలో తోటకు నీళ్లు పెడతాను.
రాత్రింబవళ్లు ఆ తోటను నేను కాపాడుతాను.
ఆ తోటకు ఎవ్వరూ హాని చేయరు.
4 నేను కోపంగా లేను.
కానీ యుద్ధంలో ఎవరైనా సరే ముళ్ల పొదల కంచె వేస్తే
అప్పుడు నేను దాని మీదికి వెళ్లి దానిని కాల్చివేస్తాను.
5 అయితే ఎవరైనా భద్రత కోసం నా దగ్గరకు వస్తే నాతో సమాధాన పడాలని కోరితే,
అలాంటివాడు వచ్చి నాతో సమాధానపడాలి.
6 ప్రజలు నా దగ్గరకు వస్తారు. మంచి వేరులు గల మొక్కలా యాకోబు బలంగా ఉండేందుకు ఆ ప్రజలు సహాయం చేస్తారు.
వికసించ మొదలు బెట్టిన మొక్కలా ఇశ్రాయేలు ఎదుగునట్లు ఆ ప్రజలు చేస్తారు.
అప్పుడు చెట్ల ఫలాల్లా, ఇశ్రాయేలు పిల్లలతో దేశం నిండిపోతుంది.”
దేవుడు ఇశ్రాయేలును దూరంగా పంపించివేస్తాడు
7 యెహోవా తన ప్రజలను ఎలా శిక్షిస్తాడు? గతంలో శత్రువులు ప్రజలను బాధించారు. యెహోవా కూడా అదే విధంగా బాధిస్తాడా? గతంలో ఎందరెందరో చంపివేయబడ్డారు. యెహోవా కూడా అలాగే చేసి, అనేక మందిని చంపేస్తాడా?
8 యెహోవా తన ప్రజల భయాన్ని వెళ్లగొట్టేసి, వారిలో తనకుగల వివాదాన్ని పరిష్కరిస్తాడు. ఇశ్రాయేలీయులతో యెహోవా కఠినంగా మాట్లాడుతాడు. ఆయన మాటలు ఎడారి వేడి గాడ్పులా మండుతాయి.
9 యాకోబు దోషం ఎలా క్షమించబడుతుంది? అతని పాపాలు తీసివేయబడేట్లుగా ఏం సంభవిస్తుంది? ఈ సంగతులు సంభవిస్తాయి: బలిపీఠం బండలు ధూళిగా చితుకగొట్టబడతాయి. తప్పు దేవుళ్లను పూజించేందుకు ఉపయోగించే విగ్రహాలు, బలిపీఠాలు నాశనం చేయబడతాయి.
10 ఆ సమయంలో మహా పట్టణం ఖాళీగా, ఎడారిలా ఉంటుంది. ప్రజలంతా పారిపోయి ఉంటారు. ఆ పట్టణం పచ్చిక బయలులా ఉంటుంది. అక్కడ దూడలు గడ్డి మేస్తాయి. ద్రాక్ష కొమ్మల ఆకులను పశువులు తింటాయి. 11 ద్రాక్షవల్లులు ఎండిపోతాయి. రెమ్మలు విరిగి పోతాయి. ఆ రెమ్మలను ఆడవాళ్లు పొయ్యిలో కట్టెలుగా ఉపయోగిస్తారు.
ప్రజలు అర్థం చేసుకొనేందుకు నిరాకరిస్తారు. కనుక దేవుడు వారి సృష్టికర్త, వారిని ఆదరించడు. వారి సృష్టికర్త వారి మీద దయ చూపించడు.
12 ఆ సమయంలో యెహోవా తన ప్రజలను ఇతరులనుండి ప్రత్యేకించటం ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది దగ్గర ఆయన ప్రారంభిస్తాడు. యూఫ్రటీసు నది మొదలు ఈజిప్టు నదివరకు గల తన ప్రజలందరినీ యెహోవా సమావేశ పరుస్తాడు.
మీరు ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరుగా, ఒకే చోట చేర్చబడుతారు. 13 నా ప్రజలు అనేకమంది ఇప్పుడు అష్షూరులో నశించారు. నా ప్రజలు కొంతమంది ఈజిప్టుకు పారిపోయారు. అయితే ఆ సమయంలో గొప్పబూర ఊదబడుతుంది. ఆ ప్రజలంతా యెరూషలేముకు తిరిగి వస్తారు. ఆ పరిశుద్ధ పర్వతం మీద యెహోవా యెదుట ఆ ప్రజలు సాష్టాంగపడతారు.
యేసు ఆలయంలోనికి వెళ్ళటం
(మత్తయి 21:12-17; మార్కు 11:15-19; యోహాను 2:13-22)
45 ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం మొదలు పెట్టాడు. 46 వాళ్ళతో, “నా ఆలయం ప్రార్థనా ఆలయం.(A) కాని మీరు దాన్ని ‘దొంగలు దాగుకొనే స్థలంగా’(B) మార్చారు!” అని చెప్పబడిందని అన్నాడు.
47 ఆయన ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజా నాయకులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. 48 కాని ప్రజలు యేసు మాటలు శ్రద్ధతో వింటూ ఉండటంవల్ల ఆయన్ని ఏ విధంగా చంపాలో వాళ్ళకు బోధపడలేదు.
© 1997 Bible League International