Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 80:1-2

సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
    యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
    వచ్చి మమ్మల్ని రక్షించుము.

కీర్తనలు. 80:8-19

గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
    ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
    నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
“ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
    దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
    దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11     దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
    ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
    అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
    పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
    నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
    నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
    నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
    అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
    నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

యెషయా 3:1-17

నేను మీకు చెబుతున్న ఈ విషయాలు గ్రహించండి. యెరూషలేము, యూదాలు ఆధారపడే వాటన్నింటిని, ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా తొలగించి వేస్తాడు. భోజనం, నీళ్లు మొత్తం దేవుడు తీసివేస్తాడు. వీరులందరిని, శూర సైనికులందరిని దేవుడు తొలగించి వేస్తాడు. న్యాయమూర్తులను, మాంత్రికులను, పెద్దలను అందరిని దేవుడు తొలగించి వేస్తాడు. సైనిక అధికారులను, ప్రభుత్వ అధికారులను దేవుడు తొలగించివేస్తాడు. నైపుణ్యంగల సలహాదార్లను, మంత్రాలు వేస్తూ, జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించే తెలివిగల వాళ్లందరిని దేవుడు తొలగించి వేస్తాడు.

దేవుడు చెబుతున్నాడు: “యువకులు మీకు నాయకులయ్యేట్టు నేను చేస్తాను. ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు విరోధం అవుతారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించరు. సామాన్యులు ప్రముఖులను లెక్కచేయరు.”

ఆ సమయంలో ఒకడు తన స్వంత కుటుంబంలోంచి తన సోదరుణ్ణి ఒకణ్ణి పట్టుకొచ్చి, “నీకు రాజ వస్త్రము ఉంది గనుక నీవే మాకు నాయకుడివి. ఈ శిథిలాలు అన్నింటి మీద నీవే నాయకుడివి” అని అతనితో చెబుతాడు.

అయితే ఆ సోదరుడు లేచి, “నేను నీకు సహాయం చేయలేను. సరిపడినంత ఆహారంగాని బట్టలుగాని నా ఇంట్లో లేవు. నన్ను మీ నాయకుడిని చేయవద్దు” అని చెబుతాడు.

యెరూషలేము తొట్రిల్లి, తప్పు చేసింది గనుక ఇలా జరుగుతుంది. యూదా పతనమై, యెహోవాను వెంబడించటం మానివేసింది. వారు చెప్పేవి, చేసేవి యెహోవాకు విరుద్ధం. యెహోవా మహిమ నేత్రాలు వీటన్నింటిని తేటగా చూస్తాయి.

మనుష్యులు తప్పు చేసిన దోషులని వారి ముఖాలు చెబుతున్నాయి. పైగా వారు వారి పాపము గూర్చి అతిశయిస్తున్నారు. వారు సొదొమ పట్టణ ప్రజల్లా ఉన్నారు. వారి పాపాన్ని ఎవరు చూసినా లెక్క చేయరు. అది వారికి ఎంతో కీడు. వాళ్లకు వాళ్లే చాలా కష్టం తెచ్చుకొన్నారు.

10 మంచి వారికి మంచి సంగతులు జరుగుతాయని మంచి వారితో చెప్పుము. వారు చేసే మంచి పనులకు వారికి బహుమానం లభిస్తుంది. 11 కానీ చెడ్డ వాళ్లకు అది చాలా చెడుగా ఉంటుంది. వారికి చాలా కష్టం వస్తుంది. వారు చేసిన చెడు పనులన్నింటి కోసం వారు శిక్షించబడతారు. 12 చిన్న పిల్లలు నా ప్రజలను ఓడించేస్తారు. స్త్రీలు నా ప్రజల మీద ఏలుబడి చేస్తారు.

నా ప్రజలారా మీ మార్గ దర్శకులు మిమ్మల్ని తప్పు దారిలో నడిపిస్తున్నారు. సరియైన దారినుండి వారు మిమ్మల్ని తప్పించేస్తున్నారు.

తన ప్రజల గురించి దేవుని నిర్ణయం

13 ప్రజలకు తీర్పు తీర్చేందుకు యెహోవా నిలుస్తాడు. 14 పెద్దలు, నాయకులు చేసిన పనుల మూలంగా యెహోవా వారికి తీర్పు తీరుస్తాడు.

యెహోవా చెబుతున్నాడు, “మీరు ద్రాక్ష తోటలను తగులబెట్టేశారు (యూదా) పేద ప్రజల దగ్గర్నుండి మీరు తీసుకొన్న వస్తువులు ఇంకా మీ ఇండ్లలో ఉన్నాయి. 15 నా ప్రజలను బాధించుటకు మీకు హక్కు ఎక్కడిది? పేద ప్రజల ముఖాలను కృంగదీయుటకు మీకు హక్కు ఎక్కడిది?” నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

16 యెహోవా అంటున్నాడు: “సీయోను స్త్రీలు చాలా గర్విష్ఠులయ్యారు. వారు ఇతరుల కంటె మంచి వాళ్లము అన్నట్టు తలలు పైకెత్తి నడుస్తున్నారు. ఆ స్త్రీలు ఓర చూపులు చూస్తారు. కాళ్ల గజ్జెలు మోగిస్తూ వయ్యారంగా కులుకుతూ నడుస్తారు.”

17 సీయోనులో ఆ స్త్రీల తలలమీద నా ప్రభువు పుండ్లు పుట్టిస్తాడు. ఆ స్త్రీలు వారి తలలు విరబోసుకొనేట్టుగా యెహోవా చేస్తాడు.

హెబ్రీయులకు 10:32-39

మీకు కలిగిన ధైర్యసహనాల్ని కాపాడుకోండి

32 మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు. 33 కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించేవాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. 34 అంతేకాక, చెరసాలల్లో ఉన్నవాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా “మీ ఆస్తుల్ని” దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు.

35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. 36 మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్ఛ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసినదాన్ని ప్రసాదిస్తాడు. 37 ఎందుకంటే,

“త్వరలోనే వస్తున్నాడు, వస్తాడు,
    ఆలస్యం చెయ్యడు!
38 నీతిమంతులైన నా ప్రజలు
    నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు.
కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే
    నా ఆత్మకు ఆనందం కలుగదు.”(A)

39 కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయేవాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడేవాళ్ళ లాంటివారం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International