Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
11 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు?
“పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!
2 వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు.
వారి బాణాలను వారు గురి చూస్తారు.
మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
3 నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది?
అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?
4 యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు.
యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు.
మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు.
మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశితంగా చూస్తాయి.
5 యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు.
కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
6 వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు.
ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
7 అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు.
మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.
14 విడిచి పెట్టబడిన ప్రజలు కేకలు వేయటం మొదలు పెడ్తారు. ప్రజలు సముద్ర ఘోషకంటె గట్టిగా కేకలు వేస్తారు
యెహోవా గొప్పతనంవల్ల ప్రజలు సంతోషిస్తారు.
15 ఆ ప్రజలు అంటారు: “తూర్పు దిశనున్న ప్రజలారా యెహోవాను స్తుతించండి!
దూర దేశాల ప్రజలారా, యెహోవాను స్తుతించండి!
యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు.”
16 భూలోకంలో ప్రతి చోటనుండి యెహోవాకు స్తుతి కీర్తనలు మనం వింటాము.
ఈ కీర్తనలు మంచి దేవుణ్ణి స్తుతిస్తాయి.
కానీ నేనంటాను: “చాలు,
నాకు సరిపోయింది!
నేను చూస్తున్న సంగతులు భయంకరం.
దేశ ద్రోహులు ప్రజలమీద తిరుగబడి వారిని బాధిస్తున్నారు.”
17 దేశంలో నివసిస్తున్న ప్రజలకు ప్రమాదం నాకు కనబడుతోంది.
వారికి భయం, గుంటలు, ఉచ్చులు నాకు కనబడుతున్నాయి.
18 ప్రమాదాన్ని గూర్చి ప్రజలు వింటారు.
వారు భయపడిపోతారు.
కొంతమంది ప్రజలు పారిపోతారు.
కానీ వారు గుంటల్లో, ఉచ్చుల్లో పడిపోతారు
వాళ్లలో కొంతమంది ఆ గుంటల్లో నుండి ఎక్కి బయటపడ్తారు.
కానీ వారు మరోఉచ్చులో పట్టుబడతారు.
పైన ఆకాశంలో తూములు తెరచుకొంటాయి.
వరదలు మొదలవుతాయి.
భూమి పునాదులు వణకటం ప్రారంభం అవుతుంది.
19 భూకంపాలు వస్తాయి.
భూమి పగిలి తెరచుకొంటుంది.
20 లోకంలో పాపాలు చాలా భారంగా ఉన్నాయి.
అందుచేత భూమి ఆ భారం క్రింద పడిపోతుంది.
ప్రాచీన గృహంలా భూమి వణుకుతుంది
త్రాగుబోతు వాడిలా భూమి పడిపోతుంది.
భూమి ఇక కొనసాగలేదు.
21 ఆ సమయంలో, పరలోక సైన్యాలకు
పరలోకంలోను భూరాజులకు భూలోకంలోను
యెహోవా తీర్పు తీరుస్తాడు.
22 ఎందరెందరో ప్రజలు ఒకటిగా సమావేశం చేయబడతారు.
కొంతమంది ప్రజలు గోతిలో బంధించబడ్డారు.
వీరిలో కొంతమంది చెరలో ఉన్నారు.
కానీ చివరికి, చాలా కాలం తర్వాత వీరికి తీర్పు తీర్చబడుతుంది.
23 యెహోవా యెరూషలేములో సీయోను కొండమీద రాజుగా పాలిస్తాడు.
పెద్దల యెదుట ఆయన మహిమ ఉంటుంది.
చంద్రుడు సిగ్గుపడి, సూర్యుడు అవమానం పొందే అంత ప్రకాశమానంగా ఉంటుంది ఆయన మహిమ.
నమ్మదగిన సేవకుడు ఎవరు
(మత్తయి 24:45-51)
41 పేతురు, “ప్రభూ! మీరీ ఉపమానం మాకోసం చెబుతున్నారా లేక అందరి కోసమా?” అని అడిగాడు.
42 ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల వాణ్ణి, తెలివి గలవాణ్ణి తన యితర సేవకులకు సరియైన ఆహారం ఇవ్వటానికి వాళ్ళపై అధికారిగా నియమిస్తాడు. 43 ఆ యజమాని వచ్చినప్పుడు, అతడు చెప్పిన విధంగా నడుచుకొన్న సేవకుడు ధన్యుడు. 44 ఇది నిజం. ఆ యజమాని అతణ్ణి తన ఆస్థికంతటికి అధికారిగా నియమిస్తాడు.
45 “కాని ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను, ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని తన క్రింద పనిచేసేవాళ్ళను ఆడా మగా అనే భేదం లేకుండా కొట్టి, తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి. 46 యజమాని ఆ సేవకుడు ఎదురుచూడని రోజున అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకుణ్ణి నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు.
47 “తన యజమాని మనస్సు తెలిసి కూడా, అతని యిష్టానుసారం పని చెయ్యని సేవకుడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. 48 కాని తెలియక శిక్షార్హమైన పనులు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుడు తాను ఎక్కువగా యిచ్చిన వాళ్ళనుండి ఎక్కువ కోరుతాడు. ఎక్కువ అప్పగించినవాళ్ళ నుండి యిచ్చిన దానికన్నా ఎక్కువ ఆశిస్తాడు.
© 1997 Bible League International