Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
11 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు?
“పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!
2 వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు.
వారి బాణాలను వారు గురి చూస్తారు.
మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
3 నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది?
అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?
4 యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు.
యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు.
మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు.
మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశితంగా చూస్తాయి.
5 యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు.
కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
6 వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు.
ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
7 అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు.
మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.
యూదా, యెరూషలేముకు దేవుని సందేశం
2 యెరూషలేము, యూదాలను గూర్చి ఆమోజు కూమారుడు యెషయా ఈ సందేశం చూశాడు.
2 యెహోవా ఆలయం ఒక కొండమీద ఉంది.
చివరి రోజుల్లో ఆ కొండ, పర్వతాలన్నింటిలో ఎత్తయినదిగా చేయబడుతుంది.
ఆ పర్వతం కొండల శిఖరాలన్నింటికంటె ఎత్తు చేయబడుతుంది.
అన్ని రాజ్యాల ప్రజలూ అక్కడికి వెళ్తారు.
3 అనేకమంది ప్రజలు అక్కడికి వెళ్తారు.
“మనం యెహోవా పర్వతానికి వెళ్దాం. యాకోబు దేవుని మందిరానికి మనం వెళ్లాలి.
అప్పుడు యెహోవా తన జీవన విధానం మనకు ఉపదేశిస్తాడు.
మనం ఆయనను వెంబడిస్తాం” అని వాళ్లు చెబుతారు.
దేవుని ఉపదేశాలు, యెహోవా సందేశం యెరూషలేములో, సీయోను కొండమీద ప్రారంభమై,
ప్రపంచం అంతటికీ వ్యాపిస్తుంది.
4 అప్పుడు అన్ని రాజ్యాల ప్రజలకూ యెహోవా న్యాయాధిపతిగా ఉంటాడు.
అనేకుల వాదాలను దేవుడు అంతం చేస్తాడు.
ఆ మనుష్యులు తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం మానివేస్తారు.
వారు తమ ఖడ్గాలతో నాగటి నక్కులు చేస్తారు.
వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే పరికరాలుగా ప్రయోగిస్తారు.
ప్రజలు ప్రజలతో పోరాటం మానివేస్తారు.
ప్రజలు యుద్ధానికి మళ్లీ ఎన్నడూ శిక్షిణ పొందరు.
విశ్వాసము
11 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం. 2 మన పూర్వికుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.
3 దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే, కనిపించనివాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.
4 హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే అతడు కయీను అర్పించిన బలికన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబెలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా యింకా మాట్లాడుతునే ఉన్నాడు.
5 హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతణ్ణి సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు అతణ్ణి మెచ్చుకొన్నాడు. 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకొన్నవాడు ఆయనున్నాడని, అడిగినవాళ్ళకు ప్రతిఫలం యిస్తాడని విశ్వసించాలి.
7 నోవహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడతనికి, “ప్రళయం రాబోతున్నది” అని ముందే చెప్పాడు. అతనిలో భయభక్తులుండటం వల్ల అతడు దేవుని మాట విని, తన కుటుంబాన్ని రక్షించటానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు.
© 1997 Bible League International