Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవ ధ్యానం.
44 దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము.
మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి మా తండ్రులు మాతో చెప్పారు.
చాలా కాలం క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో చెప్పారు.
2 దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు.
మరియు మా తండ్రులను ఇక్కడ ఉంచావు.
ఆ విదేశీ ప్రజలను నీవు చితుకగొట్టావు.
వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చేశావు.
3 ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసికోలేదు.
వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు.
నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది.
దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే!
4 నా దేవా, నీవు నా రాజువు.
నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి.
5 నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు త్రోసివేసాము.
నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము.
6 నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను.
నా ఖడ్గం నన్ను రక్షించజాలదు.
7 దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు.
మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు.
8 మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము!
నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము!
9 కాని, దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు.
నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.
10 మా శత్రువులు మమ్మల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు.
మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు.
11 గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్మల్నిచ్చి వేశావు.
రాజ్యాల మధ్య నీవు మమ్మల్ని చెదరగొట్టావు.
12 దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మివేశావు.
ధర విషయం నీవేమీ వాదించలేదు.
13 మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్మల్ని హాస్యాస్పదం చేశావు.
మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు.
14 మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము.
ప్రజలు మమ్మల్ని చూచి నవ్వుతూ వారి తలలు ఊపుతారు.
15 నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను.
రోజంతా నా అవమానాన్ని నేను చూస్తున్నాను.
16 నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు.
నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు.
17 దేవా, మేము నిన్ను మరచిపోలేదు.
అయినప్పటికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు.
మేము నీతో మా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు మేము అబద్ధమాడలేదు!
18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు.
నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు.
19 కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్మల్ని చితుక గొట్టావు.
మరణం అంత చీకటిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్మల్ని కప్పివేశావు.
20 మా దేవుని పేరు మేము మరచిపోయామా?
అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదు!
21 నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు.
లోతైన రహస్యాలు సహితం ఆయనకు తెలుసు.
22 దేవా, నీకోసం ప్రతి రోజూ చంపబడుతున్నాము!
చంపటానికి నడిపించబడే గొర్రెల్లా ఉన్నాము మేము.
23 నా ప్రభువా, లెమ్ము!
నీవేల నిద్రపోతున్నావు?
లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము!
24 దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు?
మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు?
25 బురదలోకి మేము త్రోసివేయబడ్డాము.
మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము.
26 దేవా, లేచి మాకు సహాయం చేయుము!
నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము.
14 “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి, ఆమెతో నేను మృదువుగా మాట్లాడతాను. 15 అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు (శ్రమగల)లోయను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది. 16 యెహోవా ఇలాగున చెపుతున్నాడు.
“ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు. 17 ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు.
18 “ఆ సమయంలో పొలంలోని పశువులతోను, ఆకాశంలోని పక్షులతోను, నేలమీద ప్రాకే ప్రాణులతోను ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గునట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను. 19 మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను. 20 నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలుసుకొంటావు. 21 ఆ సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను. యెహోవా ఇలాగున చెపుతున్నాడు.
“నేను ఆకాశాలతో మాట్లాడుతాను.
అవి భూమికి వర్షాన్ని ఇస్తాయి.
22 ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి ఇస్తుంది.
అవి యెజ్రెయేలు అవసరాలను తీరుస్తాయి.
23 భూమిమీద ఆమెను నేను నాటుతాను.
లో-రూహామాకు నేను దయచూపిస్తాను.
లో-అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను.
‘నీవు మా దేవుడవు’అని వారు నాతో చెపుతారు.”
గోమెరును బానిసత్వంనుండి హోషేయ తిరిగి కొనుట
3 అప్పుడు యెహోవా నాతో, “గోమెరుకు చాలా మంది విటులు ఉన్నారు. కాని నీవు ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే అది యెహోవా చేసినట్టుగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాని వారు ఇతర దేవతలను పూజిస్తూనే ఉన్నారు. మరియు ఎండుద్రాక్షల అడలు తినటం వారికి ఇష్టం” అని మరల చెప్పాడు.
2 కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను. 3 కాబట్టి నేను ఆమెతో, “చాలా రోజులు నీవు నాతో కలసి ఇంటి వద్దనే ఉండాలి. నీవు వేశ్యలా ఉండకూడదు. నీవు మరో పురుషునితో పడుకో కూడదు. నేను నీకు భర్తగా ఉంటాను” అని చెప్పాను.
4 అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజుగాని, లేక ఒక నాయకుడు గాని లేకుండా అనేక రోజులు కొనసాగుతారు. ఒక బలి అర్పణగాని, లేక ఒక స్మారకశిలగాని లేకుండా ఉంటారు. వారికి ఏఫోదుగాని, లేక, గృహ దేవతలు గాని ఉండవు. 5 దీని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి దేవుడైన యెహోవా కోసం, వారి రాజైన దావీదు కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహోవాను, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు.
మానవకల్పిత నియమాలు పాటించకు
16 అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి. 17 ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది. 18 కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్తపడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూ ఉంటారు. 19 శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు.
20 మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ఈ ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి చెందినవాళ్ళైనట్లు, ఆ ప్రాథమిక నియమాలను ఎందుకు పాటిస్తున్నారు? 21 “ఇది వాడకు, దాన్ని రుచి చూడకు, ఇది ముట్టుకోకు.” 22 ఈ నియమాలు మానవుల ఆజ్ఞలతో, బోధలతో సృష్టింపబడినవి కనుక అవి వాడుక వల్ల నశించిపోయే వస్తువుల్లాంటివి. 23 ఇలాంటి నియమాలు పైకి తెలివైనవిగా కనిపిస్తాయి. అవి దొంగపూజలకు, దొంగవినయం చూపటానికి, దేహాన్ని అనవసరంగా, కఠినంగా శిక్షించటానికి ఉపయోగపడవచ్చు. కాని శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకోవటానికి పనికి రావు.
క్రొత్త జీవితం
3 మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి.
© 1997 Bible League International