Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన
85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
వారి పాపాలు తుడిచివేయుము.
3 యెహోవా, కోపంగాను,
ఆవేశంగాను ఉండవద్దు.
4 మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,
మమ్మల్ని మరల స్వీకరించు.
5 నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
6 దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!
నీ ప్రజలను సంతోషింపజేయుము.
7 యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.
మమ్మల్ని రక్షించుము.
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
ఇశ్రాయేలును, యూదాను వారి నాయకులే పాపం చేయించారు
5 “యాజకులారా, ఇశ్రాయేలు రాజ్యమా, రాజవంశ ప్రజలారా, తీర్పు మీకోసమే ఉంది. నా మాట వినండి.
“మిస్పాలో మీరు ఒక ఉచ్చువలే ఉన్నారు. తాబోరులో నేలమీద పరచిన ఒక వలవలె మీరు ఉన్నారు. 2 మీరు ఎన్నెన్నో చెడ్డ పనులు చేశారు. కనుక మిమ్మల్నందర్నీ నేను శిక్షిస్తాను! 3 ఎఫ్రాయిము నాకు తెలుసు. ఇశ్రాయేలు చేసినవి నాకు తెలుసు. ఎఫ్రాయిమూ, ఇప్పటికిప్పుడు ఒక వేశ్యలాగ నీవు ప్రవర్తిస్తావు. ఇశ్రాయేలు తన పాపాలతో అశుద్ధమయింది. 4 ఇశ్రాయేలు ప్రజలు చెడ్డపనులు అనేకం చేశారు. వారు తిరిగి వారి దేవుని దగ్గరకు రాకుండా ఆ చెడ్డ పనులే వారిని అడ్డగిస్తాయి. ఇతర దేవతలను వెంటాడే మార్గాలను గూర్చి వారు ఎల్లప్పుడూ తలుస్తున్నారు. వారు యెహోవాను ఎరుగరు. 5 ఇశ్రాయేలీయుల గర్వమే వారికి విరోధంగా ఒక సాక్ష్యం అవుతుంది. కనుక ఇశ్రాయేలు, ఎఫ్రాయిము వారి పాపంలో కాలు జారిపడతారు. కాని యూదా కూడ వారితోపాటే కాలు తప్పి పడిపోతుంది.
6 “ప్రజా నాయకులు యెహోవా కోసం వెదకుటకు వెళ్లారు. వారు, వారి ‘గొర్రెలను’ మరియు ‘ఆవులను’ వారితో కూడ తీసుకొని వెళ్లారు. కాని యెహోవాను వారు కనుగొనలేదు. ఎందుచేతనంటే ఆయన వారిని విడిచిపెట్టాడు. 7 వారు యెహోవాకు విశ్వాస పాత్రులుగా ఉండలేదు. వారి పిల్లలు పరాయి వాని పిల్లలుగా పుట్టారు. కాని ఇప్పుడు వారు, వారి పొలాలతో పాటు అమావాస్యనాటికి నాశన మవుతారు.”
ఇశ్రాయేలీయుల నాశనంగూర్చి ఒక ప్రవచనం
8 “గిబియాలో కొమ్ము ఊదండి.
రామాలో బాకా ఊదండి.
బేతావెను వద్ద హెచ్చరిక చేయండి.
బెన్యామీనూ, శత్రువు నీ వెనుక ఉన్నాడు.
9 శిక్షా సమయంలో
ఎఫ్రాయిము పాడై పోతాడు.
ఆ విషయాలు తప్పక జరుగుతాయి అని నేను (దేవుడు)
ఇశ్రాయేలు గోత్రాల వారిని హెచ్చరిస్తున్నాను.
10 యూదా నాయకులు మరొక మనిషి ఆస్తిని దొంగిలించుటకు ప్రయత్నించే దొంగల్లాగ తయారయ్యారు.
కనుక నేను (దేవుడు) వారి మీద నా కోపాన్ని నీళ్లలాగ పోస్తాను.
11 ఎఫ్రాయిము శిక్షించబడతాడు.
అతడు ద్రాక్షాపళ్లలాగ చితుకగొట్టబడి అణగదొక్కబడతాడు.
ఎందుచేతనంటే, అతడు దుష్టత్వాన్ని చెయ్యాలని కోరుకున్నాడు.
12 చిమ్మెట బట్టను పాడుచేసినట్టు ఎఫ్రాయిమును నేను నాశనం చేస్తాను.
చెక్కముక్కను చెదలపురుగు పాడుచేసినట్టు నేను యూదాను పాడుచేస్తాను.
13 ఎఫ్రాయిము తన రోగాన్ని చూశాడు, యూదా తన గాయాన్ని చూశాడు.
కనుక వారు సహాయంకోసం అష్షూరు వెళ్లారు.
తమ సమస్యలనుగూర్చి తాము ఆ మహారాజుతో చెప్పారు.
కాని ఆ రాజు మిమ్మల్ని స్వస్థపరచలేడు. అతడు మీ గాయాన్ని బాగుచేయలేడు.
14 ఎఫ్రాయిముకు నేను ఒక సింహంవలె ఉంటాను.
యూదా రాజ్యానికి నేను ఒక కొదమ సింహంలాగ ఉంటాను.
గనుక నేను, అవును, యెహోవానైన నేనే వారిని ముక్కలుగా చీల్చివేస్తాను.
నేను వారిని తీసుకొని వెళ్ళిపోతాను.
నానుండి వారిని ఎవ్వరూ రక్షించలేరు.
15 ప్రజలు తాము దోషులమని ఒప్పుకొనేంత వరకు
నాకోసం వారు వెదుకుతూ వచ్చేంత వరకు
నేను నా స్థలానికి వెళ్లిపోతాను.
అవును, తమ కష్టంలో నన్ను కనుక్కొనేందుకు వారు కష్టపడి ప్రయత్నిస్తారు.”
22 “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహత్యాలు, అద్భుతాలు మీకోసం చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహత్యాలు, అద్భుతాలు చేసినట్లు, సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు. 23 దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు. 24 కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణవేదననుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు. 25 దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు:
‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను.
నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు!
26 అందుకే నా మాటల్లో
ఆనందం నిండియున్నది.
అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది.
27 ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు
నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు.
28 నాకు జీవపు దారుల్ని చూపావు!
నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’(A)
29 “సోదరులారా! మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపొయ్యాడు. అతణ్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ నాటికీ ఉంది. 30 దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చోబెడ్తానని దేవుడు అతనికి ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. ఇది దావీదుకు తెలుసు. 31 ఈ జరుగనున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు:
‘దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయ లేదు.
ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు.’
క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలాడుచూ ఉన్నాడు. 32 కావున దేవుడు ఈ యేసునే మృత్యువునుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము. 33 యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడిప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మయే. యేసు ఇప్పుడాయాత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నది. 34-35 యేసులా దావీదు పరలోకానికి వెళ్ళలేదు. అయినా, అతడీవిధంగా అన్నాడు:
‘ప్రభువు నా ప్రభువుతో,
నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు
నీవు నా కుడివైపు కూర్చో!’(B)
36 “అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.”
© 1997 Bible League International