Revised Common Lectionary (Semicontinuous)
గీమెల్
17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
అది నాకు మంచి సలహా ఇస్తుంది.
దాలెత్
25 నేను త్వరలోనే చనిపోతాను.
యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము.
26 నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు.
ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు.
27 యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.
28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను.
ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
29 యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము,
నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము.
30 యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను.
జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను.
31 యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను.
నన్ను నిరాశ పరచవద్దు.
32 నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను.
యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి.
శిక్ష ప్రజలను నాశనం చేస్తుంది
5 నా ప్రభువును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా భూమిని తాకితే,
అది కరిగిపోతుంది.
అప్పుడు భూమిపై నివసించేవారంతా చనిపోయినవారి కొరకు విలపిస్తారు.
ఈజిప్టులో నైలు నదిలా
భూమి పెల్లుబికి పడుతుంది.
6 యెహోవా తన పై అంతస్థు గదులు ఆకాశంపై నిర్మించాడు.
ఆయన తన పరలోకాన్ని భూమికి మీదుగా ఏర్పాటు చేశాడు.
సముద్ర జలాలను ఆయన పిలుస్తాడు.
పిలిచి, వాటిని వర్షంలా బయట భూమి మీద పారబోస్తాడు.
ఆయన పేరు యెహోవా.
ఇశ్రాయేలు వినాశనానికి యెహోవా వాగ్దానం
7 యెహోవా ఇది చెపుతున్నాడు:
“ఇశ్రాయేలూ, మీరు నాకు ఇథియోపియనుల (కూషీయుల) వంటివారు.
ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు దేశంనుండి బయటకు తీసికొని వచ్చాను.
ఫిలిష్తీయులనుకూడ నేను కఫ్తోరునుండి బయటకు రప్పించాను.
మరియు అరామీయులను (సిరియనులను) కీరునుండి బయటకు తీసుకొని వచ్చాను.”
8 నా ప్రభువైన యెహోవా ఈ పాపపు రాజ్యాన్ని (ఇశ్రాయేలును) గమనిస్తున్నాడు.
యెహోవా ఇది చెప్పాడు:
“ఈ భూమి ఉపరితలంనుండి ఇశ్రాయేలును తొలగిస్తాను.
కాని యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.
9 ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ ఇస్తున్నాను.
ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదర గొడతాను.
కాని అది పిండిని జల్లించువాని రీతిగా ఉంటుంది.
ఒక వ్యక్తి జల్లెడలో పిండిని జల్లిస్తాడు.
అప్పుడు మెత్తని పిండి క్రిందికి దిగుతుంది. కాని బరక పిండి జల్లెట్లో మిగిలిపోతుంది. యాకోబు వంశం విషయంలోకూడ ఇదేరీతి జరుగుతుంది.
10 “నా ప్రజలలో పాపులైనవారు,
‘మాకేమీ కీడు జరుగదు!’ అని అంటారు.
కాని ఆ జనులందరూ కత్తులచే చంపబడతారు!”
రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దేవుడు మాట ఇచ్చుట
11 “దావీదు గుడారం పడిపోయింది.
కాని నేను దానిని తిరిగి నిలబెడతాను.
గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను.
దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.
12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు,
మరియు నా పేరుమీద పిలువబడే జనులందరూ సహాయం కొరకు యెహోవావైపు చూస్తారు.”
యెహోవా ఈ మాటలు చెప్పాడు.
అవి జరిగేలా ఆయన చేస్తాడు.
13 యెహోవా చెపుతున్నాడు: “పంటకోయువాని వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి.
ద్రాక్షాపండ్లు తెంచేవాని వెనుకనే, పండ్లను తొక్కేవాడు వచ్చే సమయం రాబోతూవుంది.
కొండల నుంచి, పర్వతాల నుంచి
మధురమైన ద్రాక్షారసం పారుతుంది.
14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి
తిరిగి తీసుకు వస్తాను.
వారు శిథిలమైన నగరాలను తిరిగి కడతారు.
ఆ నగరాలలో వారు మళ్లీ నివసిస్తారు.
వారు ద్రాక్షాతోటలు వేస్తారు.
ఆ తోటలనుంచి వచ్చిన ద్రాక్షారసాన్ని వారు తాగుతారు.
వారు తోటలను ఏర్పాటు చేస్తారు.
వారు ఆ తోటలనుండి వచ్చే ఫలాలను తింటారు.
15 నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను.
నేను వారికిచ్చిన దేశాన్నుండి వారు మళ్లీ లాగి వేయబడరు.”
మీ దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
41 ఆయన, “నేను పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని” అని అనటం విని యూదులు గొణిగారు. 42 “ఇతడు యోసేపు కుమారుడైన యేసు కదా! ఇతని తల్లిదండ్రుల్ని మనం ఎరుగుదుమే! మరి యిప్పుడితడు, ‘నేను పరలోకం నుండి దిగి వచ్చానని’ ఎందుకు అంటున్నాడు?” అని వాళ్ళన్నారు.
43 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీలో మీరు గొణుక్కోవడం చాలించండి. 44 నన్ను పంపిన తండ్రి పంపితే తప్ప, నా దగ్గరకు ఎవ్వడూ రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణి చివరి రోజు నేను బ్రతికిస్తాను. 45 ప్రవక్తల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది: ‘దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు.’(A) తండ్రి మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు. 46 దేవుని నుండి వచ్చినవాడు తప్ప తండ్రినెవ్వరూ చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని చూసాడు.
47 “ఇది నిజం. నమ్మినవానికి అనంత జీవితం లభిస్తుంది. 48 నేను మీ జీవితానికి ఆహారాన్ని. 49 మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు. 50 కాని ఈయన పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం. దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణించడు. 51 పరలోకం నుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”
© 1997 Bible League International