Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:17-32

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

దాలెత్

25 నేను త్వరలోనే చనిపోతాను.
    యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము.
26 నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు.
    ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు.
27 యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.
28 నేను అలసిపోయి విచారంగా ఉన్నాను.
    ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
29 యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకుము,
    నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము.
30 యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను.
    జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను.
31 యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను.
    నన్ను నిరాశ పరచవద్దు.
32 నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను.
    యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి.

ఆమోసు 7:1-6

మిడుతలను గూర్చిన దర్శనం

యెహోవా నాకిది చూపించాడు: రెండవ పంట పెరగటం ప్రారంభమైనప్పుడు ఆయన మిడుతలను పుట్టిస్తున్నాడు. రాజు మొదటి పంట కోసాక పెరిగే రెండవ పంట ఇది. మిడుతలు దేశంలో వున్న గడ్డినంతా తినివేశాయి. దాని తరువాత నేనిలా అన్నాను: “నా ప్రభువైన యెహోవా, మమ్మల్ని క్షమించుమని నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు చాలా చిన్నవాడు!”

అప్పుడు యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది జరగదు” అని అన్నాడు.

అగ్నిని గూర్చిన దర్శనం

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు నాకు చూపించాడు: దేవుడైన యెహోవా అగ్నిచేత తీర్పు తీర్చటానికి పిలవటం నేను చూశాను. ఆ అగ్ని గొప్ప అగాధ జలాన్ని నశింపజేసింది. ఆ అగ్ని భూమిని తినివేయటం ప్రారంభించింది. కాని నేనిలా అన్నాను, “దేవుడవైన ఓ యెహోవా, ఇది ఆపివేయి. నిన్ను నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు మిక్కిలి చిన్నవాడు!”

పిమ్మట యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది కూడా జరగదు” అని అన్నాడు!

కొలొస్సయులకు 1:27-2:7

27 భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులు కానివాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది. 28 ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందినవాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము. 29 దీన్ని సాధించటానికి నేను నా శక్తినంతా ఉపయోగించి కష్టపడి పని చేస్తున్నాను. నాలో ఉన్న ఈ బలవత్తరమైన శక్తి క్రీస్తు నాలో ఉండి పని చేయటం వల్ల కలుగుతోంది.

మీకోసం, లవొదికయలో ఉన్నవాళ్ళకోసం, నన్ను ఇంతవరకూ కలుసుకోకుండా ఉన్నవాళ్ళకోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక. మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలనీ, ప్రేమతో మీరు ఐక్యము కావాలనీ నా అభిలాష. అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుణ్ణి గురించి, అంటే క్రీస్తును గురించి రహస్య జ్ఞానం పొందుతారు. క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి.

తియ్యటి మాటలతో మిమ్మల్నెవ్వరూ మోసం చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబుతున్నాను. నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేకపోయినా నా ఆత్మ మీ దగ్గరే ఉంది. మీ క్రమశిక్షణను, క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా ఆత్మ ఆనందిస్తోంది.

క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం

మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి. మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International