Revised Common Lectionary (Semicontinuous)
యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన సౌలును గూర్చినది ఈ పాట.
7 యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను.
నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము.
2 నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను.
నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.
3 యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు.
4 నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు.
నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు.
5 కాని నేను అలా చేసియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము.
నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద త్రొక్కనిమ్ము.
మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.
6 యెహోవా, లెమ్ము. నీ కోపాన్ని చూపెట్టుము.
నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము.
లేచి న్యాయంకోసం వాదించుము.
7 జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి,
వారి మీద పైనుండి పరిపాలించుము.
8 ప్రజలకు తీర్పు తీర్చుము. యెహోవా, నాకు తీర్పు తీర్చుము.
నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము.
నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
9 చెడ్డవాళ్లను శిక్షించి
మంచివాళ్లకు సహాయం చేయుము.
దేవా, నీవు మంచివాడవు,
మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.
10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు.
కనుక దేవుడు నన్ను కాపాడుతాడు.
11 దేవుడు మంచి న్యాయమూర్తి,
మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.
12 దేవుడు ఒక నిర్ణయం చేస్తే
ఆయన తన మనస్సు మార్చుకోడు.
13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.
14 కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు.
అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు.
15 వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు.
అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు.
16 వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు.
ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు.
అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు.
17 యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను.
మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.
6 “నిన్ను నా వద్దకు వచ్చేలా చేయటానికి నేను చాలా పనులు చేశాను. నేను, మీరు తినటానికి ఏమీ ఆహారం ఇవ్వలేదు. మీ నగరాలలో దేనిలోనూ ఆహారం ఇవ్వలేదు. అయినా నీవు నా వద్దకు తిరిగి రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.
7 “నేను వర్షాన్ని కూడా నిలుపు చేశాను. పైగా అది పంట కోతకు మూడు నెలల ముందు సమయం. అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయింది. 8 కావున రెండు మూడు నగరాల ప్రజలు తడబడుతూ నీళ్లకోసం మరొక నగరానికి వెళ్లారు. కాని అక్కడ ప్రతి ఒక్కరికీ సరిపోయేటంత నీరు లేదు. అయినా మీరు సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.
9 “ఎండ వేడిమివల్ల, తెగుళ్లవల్ల మీ పంటలు పాడైపోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోటలను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.
10 “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితమయ్యేలా చేశాను. కాని, మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
11 “సొదొమ, గొమొర్రా నగరాలను నేను నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేశాను. ఆ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో నుండి లాగబడి కాలిన కట్టెలా మీరున్నారు. కాని, మీరు సహాయంకొరకు నా వద్దకు రాలేదు” అని యెహోవా చెపుతున్నాడు.
12 “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.”
13 నేనెవరిని? పర్వతాలను ఏర్పాటు చేసింది నేనే.
మీ మనస్సులను[a] సృష్టించింది నేనే.
ఎలా మాట్లాడాలో ప్రజలకు నేర్పింది నేనే.
సంధ్యవేళను చీకటిగా మార్చేదీ నేనే. భూమిపైగల పర్వతాలపై నేను నడుస్తాను.
ఇట్టి నేను ఎవరిని?
సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు యెహోవా.
పరస్పరం ప్రేమతో ఉండండి
11 “పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని మీరు మొదటినుండి విన్నారు. 12 సాతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను తన సోదరుణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్గుడు.
13 ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 14 మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక మరణంనుండి బ్రతికింపబడ్డాము. ఈ విషయం మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు. 15 సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో సమానము. అలాంటివానికి నిత్యజీవం లభించదని మీకు తెలుసు.
16 యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణాలర్పించాడు. మనం మన సోదరుల కోసం ప్రాణాల్ని ధారపోయాలి. అప్పుడే “ప్రేమ” అంటే ఏమిటో మనం తెలుసుకోగలము. 17 ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల దేవుని దయ ఎందుకు ఉంటుంది?
© 1997 Bible League International