Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు స్తుతి కీర్తన.
82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
2 ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.
3 “అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
4 పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.
5 “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
6 నేను (దేవుడు) మీతో చెప్పాను,
“మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
7 కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”
8 దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.
ఉపోద్ఘాతం
1 ఇది ఆమోసు వర్తమానం. ఆమోసు తెకోవ నగరానికి చెందిన ఒక పశువుల కాపరి. ఉజ్జియా యూదాకు రాజుగాను, యెహోయాషు కుమారుడు యరొబాము ఇశ్రాయేలుకు రాజుగాను ఉన్న కాలంలో ఆమోసు ఇశ్రాయేలునుగూర్చి దర్శనాలు చూశాడు. ఇది భూకంపం రావటానికి రెండు సంవత్సరాల ముందటి విషయం.
సిరియాకు శిక్ష
2 ఆమోసు ఇలా అన్నాడు:
“యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు.
ఆయన గంభీర స్వరం యెరూషలేమునుండి గర్జిస్తుంది.
గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండిపోతాయి.
కర్మెలు పర్వతం[a] సహితం ఎండిపోతుంది.”
3 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “దమస్కు[b] ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, వారు గిలాదును[c] ధాన్యం రాలగొట్టే ఇనుప కడ్డీలతో నలుగగొట్టారు. 4 కావున హజాయేలు[d] ఇంటిలో (సిరియా) నేను అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని బెన్హదదు[e] ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.
5 “దమస్కు ద్వారాలమీద ఉన్న బలమైన కడ్డీలను విరుగగొడతాను. ఆవెను లోయలో సింహాసనంపై కూర్చున్నవానిని నేను నాశనం చేస్తాను. బెతేదేనులో రాజదండం పట్టిన రాజును నేను నాశనం చేస్తాను. సిరియా ప్రజలు ఓడింపబడతారు. ప్రజలు వారిని కీరు దేశానికి తీసుకుపోతారు అని యెహోవా చెపుతున్నాడు.”
ఫిలిష్తీయులకు శిక్ష
6 యెహోవా ఇది చెపుతున్నాడు: “గాజా[f] ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలందరినీ చెరబట్టి, వారినిఎదోముకు[g] బానిసలుగా పంపారు. 7 కావున గాజా ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది. 8 మరియు నేను అష్టోదులో[h] సింహాసనంపై కూర్చున్నవానిని నాశనం చేస్తాను. అష్కెలోనులో[i] రాజదండం ధరించిన రాజును నేను నాశనం చేస్తాను. నేను ఎక్రోను[j] ప్రజలను నాశనం చేస్తాను. ఇంకా బతికివున్న ఫిలిష్తీయులు అప్పుడు మరణిస్తారు అని దేవుడైన యెహోవా చెపుతున్నాడు.”
ఫెనీషియా (ఫెనీకే)కు శిక్ష
9 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు[k] ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలనందరినీ చెరబట్టి, వారిని బానిసలుగా ఎదోముకు పంపారు. తమ సోదరులతో (ఇశ్రాయేలుతో) చేసుకొన్న ఒడంబడికను వారు గుర్తు పెట్టుకోలేదు. 10 అందువల్ల తూరు గోడల మీద నేను అగ్నిని రగుల్చుతాను. తూరులో ఎత్తయిన బురుజులను ఆ అగ్ని నాశనం చేస్తుంది.”
ఎదోమీయులకు శిక్ష
11 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఎదోము ప్రజలు చేసిన అనేక నేరాలకు వారిని నేను నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే ఎదోము కత్తి పట్టి, తన సోదరుని (ఇశ్రాయేలును) వెంటాడాడు. ఎదోము దయ చూపలేదు. ఎదోము కోపం శాశ్వతంగా కొనసాగింది. అతడు ఒక క్రూర జంతువులా ఇశ్రాయేలును చీల్చి చెండాడాడు. 12 కావున తేమానులో[l] నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని బొస్రాలో[m] ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది.”
అమ్మోనీయులకు శిక్ష
13 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అమ్మోను ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు గిలాదులో గర్భిణీ స్త్రీలను చంపారు. ఆ ప్రాంతాన్ని కలుపుకొని తమ రాజ్యాన్ని విస్తరింపజేయటానికి అమ్మోను ప్రజలు ఈ పని చేశారు. 14 కావున రబ్బా[n] గోడమీద నేను అగ్ని రగుల్చుతాను. అది రబ్బాలోని ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది. వారి దేశంలోకి సుడిగాలి వచ్చినట్లు వారికి కష్టాలు వస్తాయి. 15 అప్పుడు వారి రాజులు, నాయకులు పట్టుబడతారు. వారంతా కలిసి చెరపట్టబడతారు అని యెహోవా చెపుతున్నాడు.”
మోయాబుకు శిక్ష
2 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, ఎదోము రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలా మోయాబువారు కాల్చివేశారు. 2 కావున మోయాబులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని కెరీయోతు[o] ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. భయంకరమైన అరుపులు, బూర నాదాలు వినబడతాయి. మోయాబు చనిపోతాడు. 3 అలా నేను మోయాబు రాజులను నిర్మూలిస్తాను. మరియు మోయాబు నాయకులందరినీ నేను చంపివేస్తాను అని యెహోవా చెపుతున్నాడు.”
విశ్వాసము, క్రియ
14 నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? 15 ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి. 16 అప్పుడు మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని, ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి? 17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది.
18 కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. 19 ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.
20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న[a] దానికి నీకు ఋజువు కావాలా? 21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా? 22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”(A) అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు. 24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు.
25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?
26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.
© 1997 Bible League International