Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన
6 యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
కోపగించి నన్ను శిక్షించవద్దు.
2 యెహోవా, నా మీద దయ ఉంచుము.
నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
3 నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.
6 యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
7 నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.
8 చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.
19 “నెమ్మదికలిగి వెళ్లుము” అని ఎలీషా నయమానుకు చెప్పాడు.
అందువల్ల నయమాను ఎలీషాని విడిచి కొంతదూరం వెళ్లాడు. 20 కాని దైవజనుడు అయిన ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని (ఎలీషా) సిరియనుడయిన నయమానుని వెళ్లనిచ్చాడు. కాని అతడు తెచ్చిన కానుకను స్వీకరించలేదు. యెహోవా జీవము తోడుగా వెనుకనే నేను పరిగెత్తుకుపోయి, అతని వద్దనుంచి ఏదైనా తీసుకువస్తాను” అని అనుకున్నాడు. 21 అందువల్ల గేహజీ నయమాను వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు.
తన వెనుక ఎవరో పరిగెత్తుకుని వస్తున్నట్లు నయమాను గ్రహించి. అతను తన రథం దిగి గేహజీని కలుసుకుని, “అంతా సవ్యంగా వుందిగదా” అని నయమాను అడిగాడు.
22 “అవును. అంతా సవ్యంగానే వుంది. నా యజమాని (ఎలీషా) నన్ను పంపాడు. ఇద్దరు యువకులు నావద్దకు వచ్చారనీ, కొండ దేశమైన ఎఫ్రాయిము నుంచి ప్రవక్తల బృందానికి వారు చెందిన వారనీ, వారికి డెభైఐదు పౌన్లు వెండి మరియు రెండురకాల దుస్తులు ఇమ్మని ఆయన చెప్పాడు” అని గేహజీ చెప్పాడు.
23 “అయ్యా, నూట ఏభై పౌన్లు తీసుకోండి” అని నయమాను చెప్పాడు. గేహజీ ఆ వెండిని తీసుకునేందుకు నయమాను అతనిని ఒప్పించాడు. నయమాను నూట ఏభై పౌన్లు వెండిని రెండు సంచులలో వేసి, రెండు రకాల దుస్తులు కూడా తీసుకున్నాడు. తర్వాత ఆ వస్తువుల్ని నయమాను తన సేవకులిద్దిరకి ఇచ్చాడు. గేహజీ కొరకు వారు ఆ వస్తువులను మోసుకు వెళ్లారు. 24 గేహజీ కొండ వద్దకు రాగానే, ఆ వస్తువులను అతని సేవకుల వద్దనుంచి తీసుకుని, ఆ సేవకులను పంపివేశాడు. వారు వెళ్లిపోయారు. తర్వాత గేహజీ ఆ వస్తువులను ఇంట్లో దాచాడు.
25 గేహజీ తన యజమాని అయిన ఎలీషా యెదుట నిలబడ్డాడు. గేహజీతో ఎలీషా, “గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు.
“నేనెక్కడికీ వెళ్లలేదు” అని గేహజీ చెప్పాడు.
26 “ఇది నిజం కాదు నిన్ను కలుసుకునేందుకు నయమాను తన రథంనుంచి క్రిందికి దిగినప్పుడు నా హృదయం నీతో వున్నది. పైకం, వస్త్రాలు, ఒలివలు, ద్రాక్షలు, గొర్రెలు, ఆవులు లేక స్త్రీ పురుష సేవకులు మొదలైనవి తీసుకునేందుకు ఇది సమయం కాదు. 27 ఇప్పుడు నీకు, నీ వంశానికి నయమాను వ్యాధి సంక్రమిస్తుంది. ఎల్లప్పుడూ నీకు కుష్ఠువ్యాధి వుంటుంది” అని ఎలీషా గేహజీతో చెప్పాడు.
ఎలీషాని విడిచి గేహజీ వెళ్లగానే, గేహజీ శరీరం మంచువలె తెల్లగా కనిపించింది. గేహజీకి కుష్ఠువ్యాధి కలిగింది.
28 ఈ మాటలు విన్న వాళ్ళకు చాలా ఉద్రేకం కలిగింది. వాళ్ళు బిగ్గరగా, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత గొప్పది!” అని నినాదం చెయ్యటం మొదలు పెట్టారు. 29 ఈ అలజడి ఆ పట్టణమంతా వ్యాపించి పోయింది. మాసిదోనియకు చెందిన “గాయి, అరిస్తర్కు” అనే యిద్దరు వ్యక్తులు పౌలు వెంట ఉన్నారు. ప్రజలు వీళ్ళను బంధించి త్రోసుకొంటూ ఒక్క గుంపుగా పెద్ద నాటక శాలలోకి ప్రవేశించారు. 30 పౌలు ప్రజల ముందుకు రావాలనుకొన్నాడు. కాని అనుచరులతన్ని వెళ్ళనివ్వలేదు. 31 పౌలు స్నేహితులు కొందరు ఆ ప్రాంతాలకు పాలకులుగా ఉండేవాళ్ళు. నాటక శాలలోకి వెళ్ళవద్దని వేడుకుంటూ వీళ్ళు పౌలుకు ఒక ఉత్తరం పంపారు.
32 ఆ సభ అంతా గందరగోళంగా ఉంది. కొందరు యిదని, కొందరు అదని బిగ్గరగా కేకలు వేసారు. కొందరికి తప్ప మిగతా వాళ్ళకెవ్వరికి తామక్కడికి ఎందుకు వచ్చింది తెలియదు. 33 యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోసారు. కొందరు కేకలు వేస్తూ అతనికి ఏదో సలహా యిచ్చారు. అతడందర్నీ శాంతంగా ఉండమని సంజ్ఞ చేసి సమాధానంగా ఏదో చెప్పబోయాడు. 34 అతడు కూడా ఒక యూదుడని తెలుసుకొన్నాక వాళ్ళంతా రెండు గంటల సేపు ఒకే గొంతుతో, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత చాలా గొప్పది” అని నినాదం చేసారు.
35 ఆ గ్రామాధికారి ప్రజల్ని శాంతపరుస్తూ యిలా అన్నాడు: “ఎఫెసు ప్రజలారా! మహా దేవత అర్తెమి యొక్క మందిరాన్ని, స్వర్గంనుండి పడిన శిలా విగ్రహాన్ని చూసుకొనే బాధ్యత ఎఫెసు పట్టణంపై ఉంది. ఇది ప్రపంచానికంతా తెలుసు. 36 దీన్ని ఎవరూ కాదనలేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందర పడి ఏదీ చెయ్యకండి. శాంతంగా ఉండండి!
37 “వీళ్ళు మన మందిరాన్ని దోచుకోలేదు. మన దేవతను దూషించ లేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకొని వచ్చారు. 38 దేమేత్రికి లేక అతనితో కలిసి పని చేసేవాళ్ళకు వాళ్ళపై నేరం మోపాలని ఉంటే న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి. వాళ్ళ వాద వివాదాలు వినటానికి న్యాయాధిపతులున్నారు.
39 “మీరింకేదైనా చెప్పుకోవాలనుకొంటే చట్ట ప్రకారం జరిగే ప్రజా సమావేశాల్లో చెప్పుకోండి. 40 ఈనాడు జరిగిన సంఘటనవల్ల మనం తిరుగుబాటు చేసామని అధికారులు మనపై నేరం మోపే ప్రమాదం వుంది. అది జరిగితే ఈ అలజడికి ఏ కారణం లేదు కనుక మనం ఏ సమాధానమూ చెప్పలేము.” 41 ఇలా చెప్పి అందర్నీ అక్కడినుండి వెళ్ళమన్నాడు.
© 1997 Bible League International