Revised Common Lectionary (Semicontinuous)
లామెద్
89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు.
యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి.
యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే,
నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది.
93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి
కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము.
ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు.
అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
96 నీ ధర్మశాస్త్రానికి తప్ప
ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.
11 పుస్తకం నుండి బారూకు చదివిన యెహోవా వర్తమానాలన్నిటినీ మీకాయా అనువాడు విన్నాడు. మీకాయా తండ్రి పేరు గెమర్యా గెమర్యా తండ్రి పేరు షాఫాను. 12 పుస్తకం నుండి చదవబడిన యెహోవా వర్తమానాలను విన్న మీకాయా రాజభవనంలో ఉన్న కార్యాదర్శి గదికి వెళ్లాడు. రాజభవనంలో ఉన్నతాధి కారులంతా కూర్చుని ఉన్నారు. అక్కడ ఉన్నవారిలో కార్యదర్శి ఎలీషామా, షెమాయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా మరియు తదితర రాజోద్యోగులు ఉన్నారు. 13 పుస్తకంలో నుండి బారూకు ప్రజలందరి ముందు చదవగా తాను విన్నదంతా మీకాయా ఆ అధికారులకు తెలియజేశాడు.
14 ఆ అధికారులంతా కలిసి యెహూది యను వానిని బారూకు వద్దకు పంపారు. యెహూది తండ్రి పేరు నెతన్యా. నెతన్యా తండ్రి పేరు షెలెమ్య. షెలెమ్య తండ్రి పేరు కూషి. యెహూది అనేతను బారూకు వద్దకు వెళ్లి, “నీవు చదివిన పుస్తకం తీసికొని నా వెంట రమ్మని” అన్నాడు.
నేరీయా కుమారుడైన బారూకు పుస్తకాన్ని తీసికొని యెహూది వెంట అధికారుల వద్దకు వెళ్లాడు.
15 ఆ అధికారులు బారూకును చూచి, “కూర్చో! మాకు ఆ ప్రతాన్ని చదివి వినిపించు” అని అన్నారు.
అప్పుడు బారూకు ఆ పత్రాన్ని వారికి చదివి వినిపించాడు.
16 గ్రంథస్థం చేయబడిన ఆ వర్తమానాలనన్నిటినీ అధికారులు విన్నారు. వాటిని విని వారంతా భయపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారు బారూకుతో ఇలా అన్నారు, “నీవు గ్రంథస్థం చేసిన వర్తమానాల విషయం మేము రాజైన యెహోయాకీముతో తప్పక చెప్పాలి.” 17 తరువాత ఆ అధికారులు బారూకును ఒక ప్రశ్న అడిగారు. “బారూకూ, నీవు వ్రాసిన ఈ వర్తమానములు నీకెలా లభ్యమైనాయి? యిర్మీయా నీతో మాట్లాడిన విషయాలను నీవు వ్రాసియున్నావా?” అని అడిగారు.
18 అవునని బారూకు చెప్పాడు. “యిర్మీయా మాట్లాడగా, ఆ వర్తమానాలన్నిటినీ నేను సిరాతో ఈ పత్రంపై వ్రాసి ఉంచాను” అని అన్నాడు.
19 అది విన్న రాజ్యాధికారులు బారూకుతో, “నీవు, యిర్మీయా పోయి తప్పక దాగుకోవాలి, మీరెక్కడ దాగియున్నారో ఎవ్వరికీ తెలియనీయవద్దు” అని అన్నారు.
20 పిమ్మట రాజ్యాధికారులు ఆ పత్రాన్ని (పుస్తకం) లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచారు. వారు రాజైన యెహోయాకీము వద్దకు వెళ్లి ఆ పుస్తకం గురించి అంతా చెప్పారు.
21 అప్పుడు రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని[a] తేవటానికి యెహూదిని పంపించాడు. లేఖకుడైన ఎలీషామా గదినుండి యెహూది ఆ పుస్తకాన్ని తెచ్చాడు. రాజుకు, ఆయన వద్ద నిలబడి ఉన్న సిబ్బందికి యెహూది ఆ పుస్తకాన్ని చదివి వినిపించాడు. 22 ఇది జరిగే నాటికి సంవత్సరంలో తొమ్మిదవ నెల[b] కావటంతో, రాజైన యెహోయాకీము శీతకాలపు గదిలో (వెచ్చని గది) కూర్చుని ఉన్నాడు. రాజుముందు ఒక చిన్న నిప్పుగూటిలో మంట రగులుతూ వుంది. 23 చుట్టబడిన పత్ర రూపంలో ఉన్న ఆ గ్రంథాన్ని యెహూది చదవటం మొదలు పెట్టాడు. అతడు రెండు మూడు పుటల విషయాలు చదవగానే రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని గుంజుకుని, ఒక చిన్న కత్తితో చదివిన భాగాన్ని కోసి మండే నిప్పులో వేయసాగాడు. ఆ విధంగా మొత్తం పుస్తకమంతా తగులబెట్టాడు. 24 పైగా రాజైన యెహోయాకీము, అతని సిబ్బంది ఆ వర్తమానాన్ని విని భయపడలేదు. వారి పాపాలకు చింతిస్తున్న సూచనగా వారు తమ బట్టలను చించుకొనలేదు.
25 ఎల్నాతాను, దెలాయ్యా మరియు గెమర్యా అనేవారు రాజుతో మాట్లాడి గ్రంథాన్ని తగులబెట్టకుండా చేయాలని ప్రయత్నించారు గాని రాజు వినలేదు. 26 రాజైన యెహోయాకీము లేఖకుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను నిర్బంధించు మని కొందరు మనుష్యులను ఆదేశించాడు. అలా ఆదేశించబడిన మనుష్యులు రాజకుమారుడు యెరహ్మెయేలు, అజీ్రయేలు కుమారుడైన శెరాయా, మరియు అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యా అనువారు. అయితే యెహోవా బారూకును, యిర్మీయాను దాచివేసిన కారణంగా ఆ మనుష్యులు వారిని కనుక్కోలేకపోయారు.
పౌలు యొక్క సంతోషం
2 మీ హృదయాల్లో మాకు స్థానం ఇవ్వండి. మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. ఎవ్వరినీ తప్పుదారి పట్టించలేదు. మా స్వలాభానికి ఎవ్వరినీ దోచుకోలేదు. 3 మిమ్మల్ని నిందించాలని ఇలా అనటం లేదు. మా హృదయాల్లో మీకు ఎలాంటి స్థానం ఉందో మీకు ముందే చెప్పాను. మేము మీతో కలిసి జీవించటానికి, మరణించటానికి కూడా సిద్ధంగా ఉన్నాము. 4 మీ పట్ల నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. మీ విషయంలో నేను గర్విస్తూంటాను. మీ ప్రోత్సాహం వల్ల మేము మా కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది.
5 మేము మాసిదోనియ దేశానికి వచ్చినప్పటినుండి మా ఈ దేహాలకు విశ్రాంతి లేదు. ప్రతిచోటా మమ్మల్ని కష్టపెట్టారు. బయట ఆందోళనలు, లోపల భయాలు. 6 కాని క్రుంగిన మనస్సులకు శాంతిని కలిగించే దేవుడు తీతును పంపి మాకు సహాయం చేసాడు. 7 అతడు రావటం వల్ల మాత్రమే కాకుండా మీరతనికి చేసిన సహాయాన్ని గురించి, ఆదరణను గురించి, అతడు చెప్పటం వల్ల మాకు ఆనందం కలిగింది. అతడు మీ కోరికను గురించి, మీ దుఃఖాన్ని గురించి, మీరు నా పట్ల చూపిన అభిమానాన్ని గురించి చెప్పాడు. దానివల్ల ఇంకా ఎక్కువ ఆనందపడ్డాను.
8 నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది వ్రాసినందుకు నేను బాధ చెందటం లేదు. అది మీకు కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది నాకు కూడా కొంత దుఃఖం కలిగించింది. అయినా అది కొంచెం సేపు మాత్రమే. 9 కాని యిప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీకు దుఃఖం కలిగించానని కాదు, మీ దుఃఖం మారుమనస్సుకు నడిపింది. దేవుని చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారు. గాని మేము మీకు ఏ హానీ కలిగించలేదు. 10 దేవుడు కలిగించిన దుఃఖం, మారుమనస్సు పొందేటట్లు చేసి రక్షణకు దారితీస్తుంది. దాని వల్ల నష్టం కలుగదు. కాని ఈ ప్రపంచం కలిగించే దుఃఖం మరణానికి దారితీస్తుంది. 11 దేవుడు కలిగించిన దుఃఖం వల్ల మీలో కలిగిన మార్పుల్ని గమనించండి. మీలో ఎంత నిజాయితీ కలిగిందో చూడండి. నిర్దోషులని నిరూపించుకోవటానికి మీరు ఎంత ఉత్సాహంతో ఉన్నారో గమనించండి. ఎంత ఆందోళన కలిగిందో గమనించండి. మీ అభిమానం ఎంతగా అభివృద్ధి చెందిందో గమనించండి. మీ విశ్వాసం ఎంతగా పెరిగిందో, న్యాయం చేకూర్చాలనే ఆత్రుత ఎంతగా కలిగిందో గమనించండి. మీరు ఈ సమస్యవల్ల కలిగిన ప్రతీ నిందనుండి తప్పించుకొన్నారు. 12 కనుక నేనా ఉత్తరం మీలో అన్యాయం చేసినవానికొరకు గాని, ఆ అన్యాయానికి గురి అయినవానికొరకు గాని, వ్రాయలేదు. దేవుని సాక్షిగా చెపుతున్నాను, మీరు కనబరుస్తున్న అభిమానాన్ని, మీరు చూడగలగాలని వ్రాసాను.
© 1997 Bible League International