Revised Common Lectionary (Semicontinuous)
దావీదు ప్రార్థన.
145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
2 ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
3 యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
4 యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
5 ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
6 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
7 నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.
8 యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా, అందరి యెడలా మంచివాడు.
దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
నీవు శాశ్వతంగా పాలిస్తావు.
14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!
9 నా ప్రియురాలా![a] నా ప్రియ వధువా,
నీవు నన్ను ఉద్రేక పరుస్తావు.
ఒకే ఒక చూపుతో
నీ హారంలోని ఒకే ఒక రత్నంతో
నా హృదయాన్ని దోచుకున్నావు.
10 నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీ ప్రేమ చాలా సుందరమైనది
ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ మధురమైంది,
నీ పరిమళ ద్రవ్యపు సువాసన
ఏ రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది!
11 నా ప్రియవధువా, నీ పెదవులు తేనె లూరుతున్నాయి
నీ నాలుక (కింద) నుంచి తేనే, పాలూ జాలువారుతున్నాయి
నీ దుస్తులు మధుర పరిమళాన్ని[b] గుబాళిస్తున్నాయి.
12 నా నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నిష్కళంకురాలివి.
మూయబడిన ఉద్యానవనం వలె,
మూయబడిన జలాశయంవలె,
మూయబడిన జలధారలవలె స్వచ్ఛమైనదానవు.
13 నీ శరీరమొక తోటను పోలినది
దానిమ్మ వృక్షాలతో తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా మాంసి,
14 కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది
అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో
నిండిన సుందర వనాన్ని పోలినది.
15 నీవు ఉద్యాన జలాశయం వంటిదానివి,
మంచినీటి ఊటల బావిలాంటిదానివి,
లెబానోను పర్వతం నుంచి జాలువారే సెలయేరు వంటిదానివి.
ఆమె అంటుంది
16 ఉత్తర పవనమా లే!
దక్షిణ పవనమా రా!
నా ఉద్యానవనంపై వీచి,
దాని మధుర సౌరభాన్ని వెద జల్లండి.
నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి
అందలి మధుర ఫలాలు ఆరగించాలి.
అతను అంటాడు
5 నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను,
నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను,
తేనె త్రాగాను. తేనె పట్టును తిన్నాను
నేను నా ద్రాక్షాక్షీరాలు సేవించాను.
ప్రేమికులతో స్త్రీలు అంటారు
ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, త్రాగండి!
ప్రేమను త్రాగి మత్తిల్లండి!
యేసు ఇతర మతనాయకులవలె కాదు
(మత్తయి 9:14-17; మార్కు 2:18-22)
33 వాళ్ళు, “యోహాను శిష్యులు ఎప్పుడూ ఉపవాసాలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిసయ్యులు కూడా అదేవిధంగా చేస్తూ ఉంటారు. కాని మీ వాళ్ళు తింటూ త్రాగుతూ ఉంటారు” అని యేసుతో అన్నారు.
34 యేసు, “పెళ్ళి కుమారుని అతిథులు పెళ్ళి కుమారునితో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? 35 కాని పెళ్ళి కుమారుణ్ణి వాళ్ళనుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.
36 యేసు వాళ్ళకు ఈ ఉపమానం కూడా చెప్పాడు: “క్రొత్త బట్టను చింపి పాత బట్టకు ఎవ్వరూ అతుకులు వెయ్యరు. అలా వేస్తే క్రొత్త బట్ట పాత బట్టను చింపివేస్తుంది. పైగా క్రొత్తబట్ట నుండి చింపిన గుడ్డ పాతబట్టకు సరిగ్గా అతకదు. 37 అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తిలో ఎవ్వరూ నింపరు. అలా చేస్తే క్రొత్త రసం తిత్తిని చింపుతుంది. ద్రాక్షారసం కారి పోతుంది. తిత్తి కూడా నాశనమౌతుంది. 38 అలా చెయ్యరాదు. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తిలోనే పొయ్యాలి. 39 పాత ద్రాక్షారసం త్రాగిన వాడు క్రొత్త ద్రాక్షారసాన్ని కోరడు. అతడు, ‘పాతది బాగుంది’ అని అంటాడు.”
© 1997 Bible League International