Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 145

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
    యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.

యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
    యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా, అందరి యెడలా మంచివాడు.
    దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
    నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
    నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
    మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
    నీవు శాశ్వతంగా పాలిస్తావు.

14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
    కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
    సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
    జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
    యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
    యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
    యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
    మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
    దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
    ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!

పరమ గీతము 4:1-8

అతను ఆమెతో అంటున్నాడు

నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు!
    ఆహా, నువ్వు సుందరంగా ఉన్నావు!
నీ మేలి ముసుగు క్రింద
    నీ కళ్లు పావురాల కళ్లలా ఉన్నాయి.
నీ శిరోజాలు పొడుగ్గా గిలాదు పర్వత సానువుల కింద
    నృత్యం చేసే మేకపిల్లల్లా జారుతున్నాయి.
గొడ్డువి కాక, కవలపిల్లల్ని కలిగి,
    కత్తరించబడి, కడుగబడి, పైకి వస్తున్న
తెల్ల గొర్రె మందల్ని పోలినవి నీ పళ్లు.
నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి.
    నీ నోరు అందంగా ఉంది
నీ మేలి ముసుగు క్రింద నీ చెక్కిళ్లు రెండు
    దానిమ్మపండు చెక్కల్లా ఉన్నాయి.
నీ మెడ పొడుగ్గా సన్నగా
    జయ సూచకాల్ని ఉంచే దావీదు గోపురంలా ఉంది
శక్తిమంతులైన సైనికుల డాళ్లు
    వెయ్యి డాళ్ళు దాని గోడల మీద
    అలంకరించడం కోసం ఆ గోపురాన్ని కట్టారు.
నీ స్తనాలు,
    తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక పిల్లల్లా ఉన్నాయి
    కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి.
సూర్యాస్తమయ వేళ, నీడలు కనుమరుగయ్యే వేళ
    నేను ఆ గోపరస పర్వతానికి వెళ్తాను
    ఆ సాంబ్రాణి కొండకు వెళ్తాను.
నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది.
    నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు!
నా వధువా! లెబానోను నుండి
    నాతోరా! లెబానోనునుండి నాతోరా.
అమాన పర్వత శిఖరాన్నుండి
    శెనీరు హెర్మోనుల కొండకొనల నుండి
    సింహపు గుహల నుండి
    చిరుత పులుల పర్వతాలనుండి రమ్ము!

1 కొరింథీయులకు 1:3-17

మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించు గాక!

కృతజ్ఞత

యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను. మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు. క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది. మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు. తన కుమారుడు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహవారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్థుడు.

సంఘంలో చీలికలు

10 సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.

11 నా సోదరులారా! మీలో మీరు పోట్లాడుకుంటున్నారని క్లోయె కుటుంబం నాకు తెలియ చేసింది. 12 నేను చెప్పేదేమిటంటే మీలో ఒకడు, “పౌలును అనుసరిస్తున్నాను” అని, ఇంకొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని, మరొకడు, “నేను కేఫాను[a] అనుసరిస్తున్నాను” అని, నాలుగో వాడు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నాను” అని అంటున్నారు. 13 అంటే క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు మీకోసం సిలువపై చనిపొయ్యాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా? 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 15 కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవ్వరూ అనలేరు. 16 ఔను, నేను స్తెఫను కుటుంబానికి చెందినవాళ్ళకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వరికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు. 17 ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International