Revised Common Lectionary (Semicontinuous)
106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
5 యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
6 మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
7 యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
విరోధంగా ఎదురు తిరిగారు.
8 అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
9 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!
12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
వారు ఆయనకు స్తుతులు పాడారు.
స్త్రీ న్యాయమూర్తి దెబోరా
4 చెడ్డవి అని యెహోవా చెప్పిన వాటినే ప్రజలు ఏహూదు చనిపోయిన తర్వాత మరల చేశారు. 2 కనుక కనాను రాజు యాబీను ఇశ్రాయేలీయులను ఓడించేలాగ యెహోవా చేశాడు. యాబీను హాసోరు పట్టణంలో పరిపాలించాడు. సీసెరా అను పేరుగలవాడు యాబీను రాజు సైన్యానికి సేనాధిపతి. హరోషెతు హాగ్గోయిం అనే పట్టణంలో సీసెరా నివసించాడు. 3 సీసెరాకు తొమ్మిదివందల ఇనుప రథాలున్నాయి. అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల ఎడల చాలా క్రూరంగా ఉన్నాడు. కనుక సహాయం కోసం వారు యెహోవాకు మొరపెట్టారు.
4 దెబోరా అనే పేరుగల ఒక ప్రవక్తి ఉంది. ఆమె లప్పీదోతు అను పేరుగల వాని భార్య. ఆ కాలంలో ఆమె ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి. 5 ఒక రోజు దెబోరా ఖర్జూర చెట్టు క్రింద కూర్చుని ఉంది. సీసెరా విషయం ఏమి చెయ్యాలి అని ఆమెను అడిగేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఆమె దగ్గరకు వచ్చారు. ఎఫ్రాయిము కొండ దేశంలో రామా, బేతేలుకు మధ్య దెబోరా యొక్క ఖర్జూర చెట్టు ఉంది. 6 బారాకు అను పేరుగల మనిషికి దెబోరా ఒక వర్తమానం పంపింది. ఆమెను కలుసుకునేందుకు రమ్మని ఆమె అతనిని అడిగింది. బారాకు అబీనోయము అనే పేరుగల వాని కుమారుడు. బారాకు నఫ్తాలి ప్రాంతంలోని కెదెషు పట్టణంలో నివసించేవాడు. దెబోరా బారాకుతో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడు యెహోవా నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘వెళ్లి నఫ్తాలి జెబూలూను వంశాల నుండి పదివేల మంది పురుషులను సమావేశపరచి, ఆ మనుష్యులను తాబోరు కొండకు నడిపించు. 7 యాబీను రాజు సైన్యాధిపతి సీసెరాను నేను నీ దగ్గరకు రప్పిస్తాను. సీసెరాను, అతని రథాలను, మరియు అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నేను రప్పిస్తాను. అక్కడ నీవు సీసెరాను ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను.’”
8 అప్పుడు బారాకు, “నీవు నాతో కూడా వస్తే నేను వెళ్లి ఈ పని చేస్తాను. కాని నీవు నాతో రాకపోతే, నేనూ వెళ్లను” అని దెబోరాతో చెప్పాడు.
9 “ఓ, నేను తప్పకుండా నీతో వస్తాను” అని దెబోరా జవాబిచ్చింది. “కానీ నీ వైఖరి మూలంగా, సీసెరా ఓడించబడినప్పుడు నీవు ఘనత పొందవు. ఒక స్త్రీ సీసెరాను ఓడించేటట్టు యెహోవా చేస్తాడు” అని చెప్పింది.
కనుక బారాకుతో కూడ కెదెషు పట్టణానికి దెబోరా వెళ్లింది. 10 కెదెషు పట్టణం దగ్గర జెబూలూను, నఫ్తాలి వంశాలను బారాకు సమావేశ పరిచాడు. ఆ వంశాల నుండి అతనిని వెంబడించేందుకు పదివేల మంది పురుషులను సమావేశపర్చాడు. దెబోరా కూడా బారాకుతో వెళ్లింది.
11 కెనితీ ప్రజలకు చెందిన, హెబెరు అను పేరుగల ఒకడు ఉన్నాడు. (కెనితీ ప్రజలు హోబాబు వంశస్థులు. హోబాబు మోషే భార్యకు సోదరుడు.) జయనన్నీము అనుచోట మస్తకి చెట్టు దగ్గర హెబెరు తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. జయనన్నీము కెదెషు పట్టణానికి దగ్గరగా ఉంది.
12 అబీనోయము కుమారుడు బారాకు తాబోరు కొండ దగ్గర ఉన్నాడని సీసెరాతో ఎవరో చెప్పారు. 13 కనుక సీసెరా తన తొమ్మిదివందల ఇనుప రథాలను సిద్ధం చేసాడు. సీసెరా తన మనుష్యులందరినీ ఒక్క చోట చేర్చాడు. వారు హారోషెతు హగ్గోయిము పట్టణం నుండి కీషోను నది దగ్గరకు సాగిపోయారు.
14 అప్పుడు దెబోరా, “ఈ వేళ నీవు సీసెరాను ఓడించేందుకు యెహోవా సహాయం చేస్తాడు. నీ కోసం యెహోవా ఇప్పటికే మార్గాన్ని చక్కగా తయారు చేశాడని నీకు గట్టిగా తెలుసు” అని బారాకుతో చెప్పింది. కనుక పదివేల మంది మనుష్యులను తాబోరు కొండ నుండి బారాకు నడిపించాడు. 15 బారాకు, అతని మనుష్యులు సీసెరా మీద దాడిచేసారు. యుద్ధ సమయంలో సీసెరాను, అతని సైన్యాన్ని, రథాలను యెహోవా కలవరపర్చాడు. ఏమి చేయాలో వారికి తెలియలేదు. అందుచేత బారాకు, అతని మనుష్యులు సీసెరా సైన్యాన్ని ఓడించారు. కానీ, సీసెరా తన రథాన్ని విడిచిపెట్టి కాలినడకన పారిపోయాడు. 16 బారాకు సీసెరా సైన్యంతో పోరాటం కొనసాంగించాడు. హారోషెతు, హగ్గోయిము వరకూ కూడా సీసెరా రథాలను, సైన్యాన్ని బారాకు, అతని మనుష్యులు తరిమి వేసారు. బారాకు, అతని మనుష్యులు వారి ఖడ్గాలను ఉపయోగించి సీసెరా మనుష్యులను చంపివేసారు. సీసెరా మనుష్యులలో ఒక్కడు కూడా ప్రాణంతో విడువబడలేదు.
దేవుడు యిచ్చిన ఆయుధాలు
10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. 11 సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. 12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. 13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.
14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. 16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. 17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి.
© 1997 Bible League International