Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
సరదాలు సుఖాన్నిస్తాయా?
2 నాలో నేను, “నేను సరదాగా గడపాలి. నేను నా శాయశక్తులా సమస్త సుఖాలూ అనుభవించాలి” అనుకున్నాను. కాని, అది కూడా నిష్ప్రయోజనమైన పనే అని గ్రహించాను. 2 (ఎల్లప్పుడు) సరదాగా నవ్వుతూ గడపడం మూర్ఖత్వం. సరదాగా గడిపేయడం ద్వారా కలిగే మేలేమీ లేదు.
3 అందుకని, కడుపునిండా ద్రాక్షారసం తాగుతూ మనస్సును జ్ఞానంతో నింపుదామని అనుకున్నాను. సంతోషంగా వుండాలన్న ప్రయత్నంలో నేనీ మూర్ఖత్వానికి చోటిచ్చాను. తమ స్వల్పకాల జీవితంలో జనానికి ఏది మంచిదో కనుక్కోవాలనుకున్నాను.
కఠిన శ్రమ సుఖాన్నిస్తుందా?
4 అప్పుడిక నేను పెద్ద పెద్ద పనులు చెయ్య నారంభించాను. నేను నాకోసం భవనాలు కట్టించాను. ద్రాక్షాతోటలు నాటించాను. 5 తోటలు వేయించాను, ఉద్యానవనాలు నెలకొల్పాను. నేను రకరకాల పండ్ల చెట్లు నాటించాను. 6 నేను నాకోసం నీటి మడుగులు తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు పోసేందుకు వినియోగించాను. 7 నేను మగ, ఆడ బానిసలను ఖరీదు చేశాను. నా భవనంలోనే కొందరు బానిసలు పుట్టారు. నాకు చాల గొప్ప వస్తువులు ఉన్నాయి. నాకు పశువుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయి. యెరూషలేములో ఏ ఒక్కనికన్న నాకు ఎక్కువ వస్తువులు ఉన్నాయి.
8 నేను దండిగా వెండి బంగారాలు కూడబెట్టాను. ఆయా రాజుల, రాజ్యాల సంపదలను సంపాదించాను. నా ఆస్థానంలో గాయనీ, గాయకులు ఉన్నారు. నేను ఎవరు కోరినదైనా కలిగియుంటిని.
9 నేను బాగా ధనవంతుణ్ణీ, కీర్తిమంతుణ్ణీ అయ్యాను. యెరూషలేములో నా వెనుకటి వారందరికంటె నేను గొప్పవాడినయ్యాను. నా జ్ఞానం వివేకం నాకు సహాయం చేశాయి. 10 నేను చూసి, కోరుకున్నదల్లా నేను పొందాను. నేను చేసినవన్నీ నా మనస్సుకి తృప్తిని కలిగించాయి. నేను చేసిన శ్రమ అంతటికీ ప్రతిఫలం ఈ ఆనందమే.
11 అయితే, అటు తర్వాత నేను చేసినవాటన్నింటినీ నేనొకసారి సమీక్షించుకున్నాను. నేను పడ్డ శ్రమ అంతటినీ బేరీజు వేసుకున్నాను. అదంతా వృథా శ్రమ అన్న నిర్ణయానికి వచ్చాను! అది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నంలాంటిది.[a] ఈ జీవితంలో మనం చేసే పనులన్నింటి వల్లా మనం పొందే లాభం ఏమీ లేదు.
నా సందేశం: సిలువ వేయబడిన యేసు క్రీస్తు
2 సోదరులారా! నేను మీ దగ్గరకు వచ్చి దేవుని రహస్యాన్ని ప్రకటించినప్పుడు మాటల చాతుర్యంతో గాని లేక ఉత్కృష్టమైన విజ్ఞానంతో గాని ప్రకటించలేదు[a] 2 ఎందుకంటే నేను మీతో ఉన్నప్పుడు యేసు క్రీస్తునూ, ఆయన సిలువ మరణాన్ని తప్ప మిగతా వాటిని గురించి మరచిపోవాలని నిర్ణయించుకొన్నాను. 3 నేను మీదగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ వచ్చాను. 4 మిమ్నల్ని సమ్మతింప చెయ్యాలని నేను జ్ఞానంతో నిండిన పదాలుపయోగించి నా సందేశం బోధించలేదు. దేవుని ఆత్మ యిచ్చిన శక్తినుపయోగించి నా సందేశంలో ఉన్న సత్యాన్ని ఋజువు చేసాను. 5 మీ విశ్వాసానికి మానవుల పాండిత్యం కాకుండా దేవుని శక్తి పునాదిగా ఉండాలని నా ఉద్దేశ్యం.
ఆత్మ ఇచ్చిన జ్ఞానము
6 కాని ఆత్మీయ పరిపూర్ణత పొందినవాళ్ళకు మేము జ్ఞానంతో నిండిన సందేశం చెపుతాము. ఆ సందేశం ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు. అది ప్రపంచాన్ని పాలించే పాలకులకు సంబంధించిన జ్ఞానమూ కాదు. చివరికి ఆ పాలకులు లేకుండా పోతారు. 7 నేను చెపుతున్నది దేవుడు చెప్పిన రహస్య జ్ఞానం. “ఇది” ఇంతదాకా మానవులనుండి రహస్యంగా దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు. 8 ఈనాటి పాలకులు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని అర్థం చేసుకొనివుంటే మహిమా స్వరూపి అయిన మన ప్రభువును సిలువకు వేసి చంపేవాళ్ళు కాదు. 9 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకోసం సిద్ధంగా
ఉంచిన వాటిని ఎవరి కళ్ళూ చూడలేదు.
ఎవరి చెవులు వినలేదు.
ఎవరూ వాటిని ఊహించలేదు.”(A)
10 కాని దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ ద్వారా తెలియచేసాడు.
ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి ఉన్నవాటిని కూడా పరిశోధిస్తాడు.
© 1997 Bible League International