Revised Common Lectionary (Semicontinuous)
సొలొమోను కీర్తన.
72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
2 నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
3 దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
4 పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
5 సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
6 పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
7 అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
8 సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు
అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
9 అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము
అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
15 రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక.
షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక.
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.
ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక.
కొండలు పంటలతో నిండిపోవునుగాక.
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక.
పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక.
సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక.
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక.
మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.
18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!
20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.
దేవుడు యెషయాను ప్రవక్తగా ఉండమని పిలుచుట
6 ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరం నా ప్రభువును నేను చూశాను. మహా ఎత్తయిన సింహాసనంమీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంగీతో దేవాలయం నిండిపోయింది. 2 సెరాపులనే దేవదూతలు ఆయన పైగా నిలబడ్డారు. ఒక్కొక్క సెరాపు దేవదూతకు ఆరు రెక్కలు ఉన్నాయి. ఆ దేవదూతలు వారి ముఖాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు, పాదాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు మరియు ఎగిరేందుకు రెండేసి రెక్కలు ఉపయోగించారు. 3 దేవదూతలు ఒకరితో ఒకరు, “ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన మహిమ భూలోకమంతా నిండిపోయింది” అని ఘనంగా స్తుతిస్తున్నారు. 4 వారి స్వరాలు గడప కమ్ముల్ని కదలించి వేశాయి. అంతలో దేవాలయం ధూమంతో నిండిపోవటం మొదలయింది.
5 “అయ్యో! నాకు శ్రమ, నేను నాశనమయ్యాను. నేను అశుద్ధమైన పెదవులున్న వాడను, నేను అపరిశుద్ధమైన పెదవులున్న జనుల మధ్య నివసిస్తున్నాను. సైన్యములకధిపతియైన యెహోవాను నేను చూశాను.”
44 “మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడక ముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించుమని ఆజ్ఞాపించాడు. 45 ఆ తర్వాత ఇది మన పూర్వికులకు లభించింది. వాళ్ళు యెహోషువ నాయకత్వాన, దేవుడు పారద్రోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ళ దగ్గరే ఉంది. దావీదు కాలందాకా అది ఆ దేశంలో ఉంది. 46 దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీయుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం యివ్వుమని దేవున్ని కోరాడు. 47 అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు.
48 “కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త యిలా అన్నాడు:
49 ‘ఆకాశం నా సింహాసనం!
భూమి నా పాదపీఠం!
నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు?
విశ్రాంతికి నాకు స్థలం ఏది?
50 ఇవన్నీ నిర్మించింది నేనే కాదా?’ అని ప్రభువన్నాడు.”(A)
51 స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కానివాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవసందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. 52 మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పినవాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు. 53 దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు.
© 1997 Bible League International