Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
9 కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.
దావీదు తన మనుష్యులతో హెబ్రోనుకు వెళ్లటం
2 దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు.
“వెళ్లు” అన్నాడు యెహోవా.
“ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడిగితే,
“హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.
2 కావున దావీదు అక్కడికి వెళ్లాడు. ఆయన భార్యలైన యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలు భార్యయు విధవరాలునగు అబీగయీలు ఆయనతో వెళ్లిరి. 3 దావీదు తన మనుష్యులందరినీ వారి వారి కుటుంబాలతో సహా తనవెంట తీసుకొనివెళ్లాడు. వారంతా హెబ్రోను నగర ప్రాంతాలలో తమ నివాసాలను ఏర్పరచుకున్నారు.
4 యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సౌలుకు అంత్యక్రియలు జరిపినది యాబేష్గిలాదు” వారని దావీదుకు చెప్పారు.
5 యాబేష్గిలాదు ప్రజల వద్దకు దావీదు దూతలను పంపాడు. దావీదు మాటగా వారు యాబేషు ప్రజలకు ఈ విధంగా చెప్పారు: “మీ రాజైన సౌలు అస్థికలను[a] మీరు దయతో పాతిపెట్టినందుకు దేవుడు మిమ్మునాశీర్వదించు గాక! 6 దేవుడు ఇప్పుడు మీపట్ల దయగలవాడై, సత్య దృష్టితో వుంటాడు. మీరు సౌలు అస్థికలను పాతిపెట్టినందుకు నేను కూడా మీపట్ల దయగలిగి వుంటాను. 7 మీ రాజైన సౌలు చనిపోయాడు. కనుక ఇప్పుడు యూదావారు నన్ను పట్టాభిషిక్తునిగా చేశారు. అందువల్ల మీరు బలపరాక్రమ సంపన్నులుగా మెలగండి.”
లోకముపై జయము
25 “నేను యింతవరకూ ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించకుండా నేను స్పష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. అప్పుడు నేను మీకు తండ్రిని గురించి స్పష్టంగా చెబుతాను. 26 ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగుతారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని అనటం లేదు. 27 నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు. మీకు నా పట్ల ప్రేమ ఉంది. కనుక తండ్రికి స్వయంగా మీ పట్ల ప్రేమ ఉంది. 28 నేను తండ్రి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ ప్రపంచాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.”
29 శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు. 30 మీకు అన్నీ తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము” అని అన్నారు.
31 యేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట! 32 మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను.
33 “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.
© 1997 Bible League International