Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
9 కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.
దావీదును గూర్చి సౌలుకు భయం ప్రారంభం
55 దావీదు ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్న తీరును సౌలు గమనించాడు. తన సేనాని అబ్నేరును పిలిచి, “ఆ కుర్రవాని తండ్రి ఎవరని” అడిగాడు.
“మీ తోడు అతనెవరో నాకు తెలియదు రాజా” అన్నాడు అబ్నేరు.
56 సౌలు, “ఆ కుర్రవాని తండ్రి ఎవరో తెలుసుకో” అన్నాడు.
57 గొల్యాతును చంపి దావీదు తిరిగి రాగానే అబ్నేరు అతనిని సౌలువద్దకు తీసుకుని వచ్చాడు. దావీదు ఇంకా ఆ ఫిలిష్తీయుని తలను చేతిలో పట్టుకొని ఉన్నాడు.
58 “చిన్నవాడా! నీ తండ్రి ఎవరు?” అని సౌలు అతన్ని అడిగాడు.
“బేత్లెహేములో ఉన్న మీ సేవకుడు యెష్షయి కుమారుడను నేను” అని దావీదు జవాబు చెప్పాడు.
దావీదు-యోనాతానుల స్నేహం
18 దావీదు సౌలుతో మాట్లాడటం ముగించాక, యోనాతాను దావీదుకు చాలా సన్నిహితుడయ్యాడు. తనను తాను ప్రేమించుకున్నంతగా యోనాతాను దావీదును ప్రేమించాడు. 2 సౌలు ఆ రోజు నుంచీ దావీదును తన వద్దనే ఉంచుకొన్నాడు. దావీదును ఊరిలోవున్న తన తండ్రి వద్దకు సౌలు పోనీయలేదు. 3 యోనాతాను దావీదుతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఎందువల్లనంటే, దావీదు అంటే యోనాతానుకు ఎనలేని ప్రేమ. 4 యోనాతాను తన అంగీ తీసి దావీదుకు తొడిగాడు. యోనాతాను తన సైనిక దుస్తులు కూడా దావీదుకు ఇచ్చాడు. అంతేగాదు; యోనాతాను తన ఖడ్గం, విల్లంబులు, పటకా అన్నీ దావీదుకు ఇచ్చాడు.
దావీదు విజయాన్ని సౌలు గుర్తించుట
5 సౌలు దావీదును అనేక యుద్ధాలకు పంపాడు అన్నింటిలో అతడు విజయం సాధిస్తూ వచ్చాడు. కాబట్టి అతనిని సైన్యాధికారిగా సౌలు నియమించాడు. దీనికి ప్రజలంతా చాలా సంతోషించారు. సౌలు అధికారులు కూడ సంతోషించారు.
ఏడవ బూర
15 ఏడవ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం నుండి అనేక స్వరాలు యిలా బిగ్గరగా అనటం వినిపించింది:
“ప్రపంచం మన ప్రభువు రాజ్యంగా మారింది. ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది.
ఆయన చిరకాలం రాజ్యం చేస్తాడు.”
16 దేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న యిరువది నాలుగు మంది పెద్దలు సాష్టాంగపడ్డారు. 17 వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారు:
“ప్రభూ! సర్వశక్తివంతుడవైన దైవమా!
నీవు ప్రస్తుతం ఉన్నావు, గతంలో ఉన్నావు.
నీ గొప్ప శక్తిని ఉపయోగించి మళ్ళీ పాలించటం మొదలుపెట్టావు.
కనుక నీకు మా కృతజ్ఞతలు!
18 దేశాలు ఆగ్రహం చెందాయి.
ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది.
చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పే సమయం వచ్చింది.
నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం యిచ్చే సమయం వచ్చింది.
నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించేవాళ్ళకు,
సామాన్యులకు, పెద్దలకు,
అందరికి ప్రతిఫలం యిచ్చే కాలం వచ్చింది.
భూమిని నాశనం చేసేవాళ్ళను నాశనం చేసే కాలం వచ్చింది.”
19 అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరిశుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద వడగండ్ల వాన వచ్చాయి.
© 1997 Bible League International