Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
9 కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.
15 యోషీయా బేతేలు వద్ద గల బలిపీఠాన్ని ఉన్నత స్థలమును ధ్వంసము చేశాడు. నెబాతు కొడుకైన యరొబాము ఈ బలిపీఠం నిర్మించాడు. యరొబాము ఇశ్రాయేలుని పాపానికి పాల్పడజేశాడు. యోషీయా బలిపీఠపు శిలలను ముక్కలు ముక్కలుగా చేశాడు. యోషీయా బలిపీఠమును ఉన్నత స్థానమును ధ్వంసము చేశాడు. తర్వాత వాటిని ధూళిగా చేశాడు. మరియు అతను అషేరా స్తంభమును కాల్చివేసెను. 16 యోషీయా చుట్టు ప్రక్కలు చూచెను; కొండమీద సమాధులు కనిపించాయి అతను మనుష్యులను పంపాడు. వారు ఆ సమాధులనుండి ఎముకలు తీసుకువాచ్చారు. తర్వాత బలిపీఠం మీద ఆ ఎముకలను కాల్చాడు. ఈ విధంగా యోషీయా బలిపీఠాన్ని అపవిత్రము చేశాడు. దైవజనుడు ప్రకటించెనని యెహోవా యొక్క సందేశం తెలిపినట్లుగా ఇది జరిగింది. యరొబాము బలిపీఠం ప్రక్కగా నిలబడినప్పుడు దైవజనుడు ఇది ప్రకటించాడు.
తర్వాత యోషీయా చుట్టుప్రక్కల చూశాడు. దైవజనుడి సమాధి చూశాడు.
17 “నేను చూస్తున్న సమాధి ఏమిటి?” అని యోషీయా అడిగాడు.
“యూదానుంచి వచ్చిన దైవజనుని సమాధి ఇది. బేతేలులోని బలిపీఠానికి నీవు చేసిన పనులను ఈ దైవజనుడు చెప్పాడు. ఈ విషయాలను అతను చాలా కాలము క్రిందటనే సూచించాడు” అని ఆ నగర ప్రజలు చెప్పారు.
18 “దైవజనుడను ఒంటరిగా విడిచిపెట్టండి, అతని ఎముకలను కదిలించకండి” అని యోషీయా చెప్పాడు. అందువల్ల వారు అతని ఎముకలు విడిచిపెట్టారు. షోమ్రోను నుంచి వచ్చిన దైవజనుని ఎముకలు కూడా విడిచిపెట్టారు.
19 యోషీయా షోమ్రోను నగరాలలోని ఉన్నత స్థలాలలో వున్న అన్ని ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు. ఇశ్రాయేలు రాజులు ఆ ఆలయాలను నిర్మించారు. అది యెహోవాను ఆగ్రహాపరిచింది. యోషీయా బేతేలులోని ఆరాధనాస్థలాలను ధ్వంసము చేసినట్లుగా, ఆ ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు.
20 యోషీయా షోమ్రోనులోని ఉన్నత స్థలాలకు చెందిన యాజకులందరినీ చంపివేశాడు. ఆ బలిపీఠముల మీద ఆ యాజకులను చంపాడు. బలిపీఠముల మీద మనుష్యుల ఎముకలు కాల్చాడు. ఈ విధంగా అతను ఆ ఆరాధనా స్థలాలను పాడుచేశాడు. తర్వాత అతను యెరుషలేముకు మరలి వెళ్లాడు.
యూదా ప్రజలు పస్కా పండుగను ఆచరించుట
21 తర్వాత యోషీయా రాజు ప్రజలందరకు ఒక ఆజ్ఞ విధించాడు. “మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి. ఒడంబడిక పుస్తకంలో వ్రాయబడినట్లుగా జరపండి” అని అతను చెప్పాడు.
22 న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలించిన నాటినుంచి ప్రజలు ఈ విధంగా ఆ ఉత్సవము జరపలేదు. ఇశ్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని పస్కా పండుగను అంత బ్రహ్మాండంగా ఆచరించి వుండలేదు. 23 యోషీయా రాజయిన 18వ సంవత్సరాన యెరూషలేములో యెహోవాకు ఈ ఉత్సవము జరిపారు.
24 కర్ణపిశాచి గలవారిని, సొదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహాలను, యూదా యెరూషలేములోనున్న ప్రజలు పూజించే ఆ భయంకర వస్తువులను యోషీయా నాశనము చేశాడు. హిల్కీయా యాజకుడు యెహోవాయొక్క ఆలయములో కనుగొన్న ధర్మశాస్త్రములోని నియమాలను పాటించేందుకు యోషీయా ఈ విధముగా చేశాడు.
25 అంతకు ముందు యోషీయా వంటి రాజు లేడు. యోషీయా పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో శక్తినంతా కూడాగట్టుకుని యెహోవా వైపు నిలిచాడు. యోషీయా వలె మోషే ధర్మశాస్త్రాన్ని ఏ రాజు పాటించి వుండలేదు. ఆ తర్వాత కూడా యోషీయా వంటి మరొక రాజు లేడు.
ఇద్దరు సాక్షులు
11 ఒక దేవదూత ఒక కొలత బద్ద లాంటిది నాకిచ్చి ఈ విధంగా అన్నాడు: “వెళ్ళు, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలత వేయి. ఎంతమంది ప్రజలు ఆరాధిస్తున్నారో కూడ లెక్కపెట్టు. 2 కాని వెలుపలి ఆవరణం, యూదులు కానివాళ్ళకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభై రెండు నెలల దాకా ఈ పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు. 3 నేను నా యిరువురి సాక్షులకు శక్తినిస్తాను. వాళ్ళు గోనెపట్ట కట్టుకొని పన్నెండువందల అరువది దినాల దాకా దైవసందేశం చెబుతారు.”
4 రెండు ఒలీవ వృక్షాలు, రెండు దీపస్తంభాలు ఆ సాక్షులు. ఇవి ఈ భూమిని పాలించే దేవుని సమక్షంలో ఉన్నాయి. 5 వారికి హాని కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ నోళ్ళనుండి మంటలు వచ్చి, తమ శత్రువుల్ని మ్రింగివేస్తాయి. వారికి హాని తలపెట్టినవాళ్ళు ఈ విధంగా మరణిస్తారు. 6 తాము దేవుని సందేశం బోధించే కాలంలో వర్షం కురియకుండా చేయటానికి వాళ్ళు ఆకాశాన్ని మూసి వేస్తారు. వాళ్ళకా శక్తి ఉంది. అంతేకాక, నీళ్ళను రక్తంగా మార్చగల శక్తి కూడా వాళ్ళకు ఉంది. రకరకాల తెగుళ్ళను తమకు యిష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో వ్యాపింప చేయగల శక్తి కూడా వాళ్ళకు ఉంది.
7 వాళ్ళు తమ సందేశం చెప్పటం ముగించాక, ఒక మృగం పాతాళంనుండి మీదికి వచ్చి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి చంపి వేస్తుంది. 8 వాళ్ళ మృతదేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉన్నాయి. ఈ మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ వాళ్ళ ప్రభువు సిలువకు వేయబడ్డాడు. 9 మూడున్నర రోజులు ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలు ఆ శవాలను చూస్తారు. వాళ్ళు వాటిని సమాధి చేయటానికి నిరాకరిస్తారు. 10 ఈ యిరువురు ప్రవక్తలు భూమ్మీద నివసిస్తున్న వాళ్ళకు కష్టాలు కలిగించారు. కనుక ప్రజలు ఆ ప్రవక్తలు మరణించటం చూసి ఆనందించారు. పరస్పరం కానుకలు పంపుకున్నారు. వేడుకలు చేసుకొన్నారు.
11 కాని మూడున్నర రోజుల తర్వాత దేవుడు ప్రవక్తల్లో మళ్ళీ ప్రాణం పోశాడు. వాళ్ళు లేచి నిలుచున్నారు. వీళ్ళను చూసిన ప్రజలు చాలా భయపడిపోయారు. 12 అప్పుడు పరలోకంనుండి ఒక స్వరం బిగ్గరగా, “మీదికి రండి” అని అనటం వాళ్ళు విన్నారు. శత్రువులు చూస్తుండగా, వాళ్ళు ఒక మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయారు.
13 అదే క్షణంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. పట్టణంలో పదవ భాగం నాశనమైపోయింది. భూకంపంవల్ల సుమారు ఏడువేల మంది మరణించారు. బ్రతికున్నవాళ్ళు చాలా భయపడిపోయి పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతించారు.
14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ త్వరలో జరుగనుంది.
© 1997 Bible League International