Revised Common Lectionary (Semicontinuous)
దావీదు తుది పలుకులు
23 ఇవి దావీదు చివరి మాటలు,
“యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన రాజు,
ఇశ్రాయేలు మధుర గాయకుడు,
యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన సందేశం.
దావీదు ఇలా అన్నాడు:
2 యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది.
ఆయన పలుకే నా నోటిలో వున్నది.
3 ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు,
ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు:
‘ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో,
ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో
4 ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు,
ఆ వ్యక్తి మబ్బులేని ప్రాతఃకాలంలా ప్రశాంతంగా వుంటాడు,
లేతగడ్డిని చిగురింపజేయు వర్షానంతర సూర్యకాంతిలా
ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.’
5 “గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చలేదు.
తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేశాడు.
అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు.
ఈ ఒడంబడికను దేవుడు బలపర్చాడు.
దానిని ఆయన ఉల్లంఘించడు!
ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగు చేస్తాడు!
6 “కాని దుష్టులు ముండ్లవంటి వారు.
జనులు ముండ్లనుచేతబట్టరు.
వాటిని తక్షణం విసర్జిస్తారు!
7 వాటిని ఎవరు తాకినా కర్ర,
ఇనుము బల్లెములతో గుచ్చివేసినట్లవుతుంది.
దుష్టులు కూడ ముండ్ల వంటి
వారు వారు అగ్నిలో తోయబడి
పూర్తిగా దహింపబడతారు.”
యాత్ర కీర్తన.
132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
2 కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
3 దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
నేను నా పడక మీద పండుకొనను,
4 నేను నిద్రపోను,
నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
5 యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”
6 ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
7 మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
8 యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
9 యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.
13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”
శుభాకాంక్షలు
4 యోహాను నుండి,
ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు,
భూత భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక! 5 మరియు, చనిపోయి బ్రతికింపబడిన వాళ్ళలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు క్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక!
ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు. 6 మనల్ని ఒక రాజ్యంగా స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక! ఆమేన్.
7 చూడు! ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్ళు[a] కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్.
8 భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును[b] నేనే” అని అన్నాడు.
33 పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
34 యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు.
35 పిలాతు, “నేను యూదుణ్ణి అని అనుకుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు.
36 యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు.
37 “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు.
యేసు జవాబు చెబుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.”
© 1997 Bible League International