Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
2 కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
3 దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
నేను నా పడక మీద పండుకొనను,
4 నేను నిద్రపోను,
నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
5 యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”
6 ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
7 మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
8 యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
9 యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.
13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”
ప్రజలు ధర్మశాస్త్రము వినుట
23 యూదా నాయకులందరిని యెరూషలేము నాయకులను తనను కలుసుకోవలసిందిగా యోషీయా రాజు చెప్పాడు. 2 తర్వాత రాజు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లాడు. యూదాలోని మనష్యులందరు మరియు యెరుషలేములో నివసించేవారు. అతనితో పాటు వెళ్లారు. యాజకులు, ప్రవక్తలు, అందరు మనుష్యులు తక్కువ ప్రాముఖ్యము కలవారి నుండి ఎక్కువ ప్రాముఖ్యం కలవారి వరకు అతనితో పాటు వెళ్లారు. తర్వాత అతను ఒడంబడిక పుస్తకము చదివాడు. ఇది యెహోవా యొక్క ఆలయములో కనిపించిన ధర్మశాస్త్ర గ్రంథము. యోషీయా అందరు వినేటట్లుగా పుస్తకము చదివాడు.
3 రాజు స్తంభం ప్రక్కగా నిలబడి యెహోవాతో ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. యెహోవా ఆజ్ఞలను, ఒడంబడికను, అతని నిబంధనలను పాటించడానికి అతను సమ్మతించాడు. హృదయపూర్వకంగా అతను వాటికి సమ్మతించాడు. ఆ పుస్తకంలోని ఒడంబడికను పాటించడానికి సమ్మతించాడు. రాజు ఒడంబడికను తాము అంగీకరిస్తున్నట్టుగా ప్రజలందరు నిలబడ్డారు.
4 తర్వాత ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా, ఇతర యాజకులు, ద్వారపాలకులు మొదలైన వారికి రాజు ఆజ్ఞాపించాడు, యెహోవా యొక్క ఆలయము నుండి బయలు అషేరాదేవికి, ఆకాశములోని నక్షత్రాలను గౌరవించేందుకు చేయబడిన అన్ని పాత్రలు తీసుకురమ్మని తర్వాత యోషీయా ఆ వస్తువులను యెరూషలేముకు వెలుపల కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత వారు బూడిదను బెతేలుకు తీసుకువెళ్లారు.
5 యూదా రాజులు కొందరు సామాన్యులను యాజకులుగా ఎంపిక చేశారు. ఆ మనుష్యులు అహరోను వంశానికి చెందినవారు కారు. ఆ అబద్ధపు యాజకులు యూదాలోని ప్రతినగరంలో ఉన్నత స్థానాలలోను యెరూషలేముకు చుట్టుప్రక్కలనున్న పట్టణాలలోను ధూపం వెలిగించారు. వారు బయలునకు సూర్య చంద్రులను, నక్షత్రగణాలను, ఆకాశంలోని అన్ని నక్షత్రాలను గౌరవించేందుకు ధూపం వేసారు. కాని యోషీయా ఆ అబద్ధపు యాజకుల చేతలు ఆపివేశాడు.
6 యోషీయా యెహోవాయొక్క ఆలయము నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత ఆ కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ఆ ధూళిని సామాన్యుల సమాధుల మీద చల్లాడు.
7 తర్వాత యోషీయా రాజు యెహోవా ఆలయంలోని పురుష వ్యభిచారుల ఇండ్లను ధ్వంసము చేశాడు. ఆ ఇండ్లను స్త్రీలు కూడా ఉపయోగించి, అబద్ధపు దేవత అషేరా గౌరవార్థం గుడారపు కప్పులు తయారు చేశారు.
8-9 ఆ సమయాన యాజకులు బలులు యెరూషలేముకు తీసుకురాలేదు; ఆలయములో బలిపీఠం మీద వాటిని నివేదించలేదు. యూదా అంతటా నగరాలలో యాజకులు నివసించారు. ఆ నగరాలలో వారు ఉన్నత స్థానాలలో ధూపము వేసేవారు. బలులు సమర్పించేవారు. ఆ ఉన్నత స్థలాలు గెబానుండి బెయేర్షెబా వరకు అన్ని చోట్ల వుండేవి. మరియు యాజకులు ఆ పట్టణాలలో పులియని రొట్టెను సామాన్యులతో కలిసి తింటూ ఉన్నారు. యెరూషలేములో యాజకులకోసం ప్రత్యేకించబడిన స్థలంలో కాదు. కాని యోషీయా రాజు ఆ ఉన్నత స్థానాలను ధ్వంసము చేసి, యెరూషలేముకు ఆ యాజకులను తీసుకువచ్చాడు. యోషీయా యెహోషువ ద్వారానికి ఎడమ నున్న ఉన్నత స్థానాలను కూడా ధ్వంసము చేశాడు. (యెహోషువ ఆ నగరపు పాలకుడు).
10 అబద్ధపు దేవుడైన మొలెకు గౌరవార్థం ప్రజలు తమ పిల్లలను చంపి బలిపీఠం మీద కాల్చివేసేవారు. ఈ పని బెన్‌హిన్నోము లోయలో తోఫెతు అనేచోట జరిగేది. యోషీయా ఆ స్థలాన్ని ప్రజలు దానిని మరల ఉపయోగించుకొనేందుకు వీలులేనంతగా ధ్వంసము చేశాడు. 11 వెనకటి కాలంలో, యూదా రాజులు యెహోవా యొక్క ఆలయ ప్రవేశద్వారం వద్ద కొన్ని గుర్రాలను, ఒక రథాన్ని ఉంచేవారు. నెతన్మెలకు అనే ముఖ్య అధికారి గదికి దగ్గరగా వుండేది. ఆ గుర్రాలూ, రథమూ సూర్యదేవుని గౌరవార్థం నిలపబడేవి. యోషీయా ఆ గుర్రాలను తొలగించి రథాన్ని కాల్చివేశాడు.
12 వెనుకటి రోజుల్లో, యూదా రాజుల అహాబు భవనం కప్పు మీద బలిపీఠాలు అమర్చారు. మనష్షే రాజు కూడా యెహోవా యొక్క ఆలయము రెండు ప్రాంగణాలలో బలిపీఠాలు నిర్మించాడు. యోషీయా ఆ బలిపీఠాలన్నిటినీ నాశనము చేశాడు. విరిగిపోయిన ముక్కలను కిద్రోను లోయలోకి విసిరివేశాడు.
13 వెనుకటి కాలములో, సొలొమోను రాజు యెరూషలేముకు దగ్గరలో “నాశన పర్వతము” మీద కొన్ని ఉన్నత స్థలాలు నిర్మించాడు. ఆ కొండకు దక్షిణంగా ఆ ఉన్నత స్థలాలు ఉండేవి. ఆ ఉన్నతస్థలాలలో ఒకటి అష్ఠారోతు గౌరవార్థము కట్టబడింది. సీదోను ప్రజలు ఆరాధించే హేయమైన విగ్రహమది. మరియు సొలొమోను రాజు మిలోము గౌరవార్థం ఒక ఉన్నత స్థానము నిర్మించాడు. అమ్మోనీయులు కొలిచే హేయమైన విగ్రహమది. కాని యోషీయా రాజు ఆ ఆరాధనా స్థలాలన్నిటినీ ధ్వంసంచేశాడు. 14 యోషీయా రాజు స్మారక శిలలను పగులగొట్టాడు; అషరా స్తంభాలను విరగగొట్టాడు. తర్వాత అతను ఆ స్థలము మీద చచ్చినవారి ఎముకలను వెదజల్లాడు.
పరలోకమునుండి వచ్చువాడు
31 “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. 32 ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు. 33 దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు. 34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు. 36 ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.
© 1997 Bible League International