Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
2 కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
3 దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
నేను నా పడక మీద పండుకొనను,
4 నేను నిద్రపోను,
నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
5 యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”
6 ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
7 మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
8 యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
9 యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.
13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”
యోషీయా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట
22 యోషీయా పరిపాలనకు వచ్చేనాటికి, అతను ఎనిమిదేండ్లవాడు. యెరూషలేములో అతను 31 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతుకి చెందిన అదయా కుమార్తె. 2 యెహోవా మంచివని చెప్పిన పనులు యోషీయా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదు వలె, యోషీయా దేవుని అనుసరించాడు. దేవుడు ఆశించిన విధంగా యోషియా దేవుని బోధనలు పాటించాడు.
ఆలయ మరమ్మతుకి యోషీయా ఆజ్ఞాపించుట
3 యోషీయా రాజుగా వున్న 18వ సంవత్సరాన, అతను కార్యదర్శి అయిన మెఘల్లాము కొడుకైన అజల్యా కుమారుడు షాఫానును యెహోవా యొక్క ఆలయానికి పంపాడు. 4 “ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా వద్దకు వెళ్లుము. యెహోవా ఆలయానికి ప్రజలు తీసుకువచ్చిన ధనాన్ని ఎంచమని చెప్పుము. ప్రజల వద్దనుంచి ద్వారపాలకులు ఆ ధనము వసూలు చేశారు. 5 యెహోవా ఆలయము మరమ్మతుల కోసము పనివారికి ఆ ధనాన్ని యాజకులు వినియోగించాలి. యెహోవా ఆలయాన్ని పర్యవేక్షించే వారికి యాజకులు ఆ డబ్బు ఇవ్వాలి. 6 ఆ డబ్బును వడ్రంగులకు, రాయి బ్రద్దలు చేసేవారికి, రాతి పనివారికి ఆ డబ్బు ఉపయోగించబడాలి. ఆలయము కోసము కలపకొనేందుకు రాళ్లు కొనేందుకు ఆ డబ్బు వినియోగము కావాలి. 7 పనివారికి ఇచ్చే ధనాన్ని లెక్కించవద్దు. పనివారు నమ్మదగిన వారు” అని యోషీయా చెప్పాడు.
ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడుట
8 ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శి అయిన షాఫానుతో, “యెహోవా ఆలయములో నేను ధర్మశాస్త్ర గ్రంథము కనుగొన్నాను” అని చెప్పాడు. హిల్కీయా ఆ పుస్తకము షాఫానుకి ఇవ్వగా, షాఫాను అది చదివాడు.
9 కార్యదర్శి షాఫాను యోషీయా రాజు వద్దకు పోయి జరిగిన విషయము చెప్పాడు. “నీ సేవకులు ఆలయములో వున్న ధనమునంతా పోగుజేశారు. యెహోవా ఆలయాన్ని పరీక్షించేవారికి ఆ ధనమును వారు ఇచ్చివేశారు.” అని షాఫాను చెప్పాడు. 10 తర్వాత షాఫాను కార్యదర్శి రాజుతో, “మరియు ప్రధాన యాజకుడు హిల్కీయా నాకు ఈ గ్రంథము ఇచ్చాడు” అని పలికాడు. తర్వాత షాఫాను రాజుకు ఆ పుస్తకము చదివి వినిపించాడు.
స్తెఫన్ను రాళ్ళతో కొట్టి చంపటం
54 ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు. 55 కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపు చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు. 56 “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు.
57 ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు. 58 అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటనను చూస్తున్నవాళ్ళు తమ వస్త్రాల్ని “సౌలు” అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు. 59 వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు. 60 ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.
8 1-3 అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు.
సౌలు సంఘాన్ని హింసించటం
ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
© 1997 Bible League International