Revised Common Lectionary (Semicontinuous)
దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన
3 యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు
అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
2 చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.
3 అయితే, యెహోవా, నీవు నాకు కేడెము.
నీవే నా అతిశయం.
యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా[a] చేస్తావు.
4 యెహోవాకు నేను ప్రార్థిస్తాను.
ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!
5 నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును.
ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును.
కాని ఆ శత్రువులకు నేను భయపడను.
7 యెహోవా, లెమ్ము[b]
నా దేవా, వచ్చి నన్ను రక్షించుము!
నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి,
వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.
8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు.
యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.
22 పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు. రాజైన సొలొమోను చేతులు చాపి, ఆకాశంవైపు చూశాడు. 23 అతనిలా అన్నాడు:
“ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా! నీవంటి యెహోవా ఆకాశంలో గాని, భూమి మీద గాని మరొక్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పక అమలు పర్చుతావు. 24 నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానం చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్దానం ఈ రోజు నిజమయ్యేలా చేశావు. 25 ఇశ్రాయేలీయుల దేవుడవైన నా ప్రభువా, నా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడ ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు: ‘నీవు నా ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ననుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇశ్రాయేలును పాలించటానికి ఒకనిని కలిగి వుంటావు.’ 26 ఇశ్రాయేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా తండ్రికిచ్చిన ఆ వాగ్దానం కొనసాగించుమని కూడా నేను వేడు కుంటున్నాను.
27 “కాని దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడ ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు. 28 దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. 29 గతంలో నీవు, ‘నేనక్కడ గౌరవింపబడుదు’నని చెప్పావు. దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉండు. ఈ దేవాలయంలో నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు. 30 దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని మేము నిన్ను వేడుకుంటున్నాము.
9 “మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10 మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రకటించాలి. 11 మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి తీసుకు వెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.
12 “సోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకొని, ఒకరి మరణానికి ఒకరు కారకులౌతారు. అదే విధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడౌతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారకులౌతారు. 13 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో ఉన్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు.
14 “నాశనం కలిగించేది, అసహ్యమైనది, తనది కాని స్థానంలో నిలుచొని ఉండటం మీకు కనిపిస్తే[a] యూదయలో ఉన్నవాళ్ళు కొండల మీదికి పారిపొండి. 15 ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు క్రిందికి దిగి తమ వస్తువులు తెచ్చుకోవటానికి తమ యిళ్ళలోకి వెళ్ళరాదు. 16 పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు తమ దుస్తులు తెచ్చుకోవటానికి యిళ్ళకు వెళ్ళరాదు.
17 “గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా ఉంటాయో కదా! 18 ఈ సంఘటన చలికాలంలో సంభవించకూడదని ప్రార్థించండి. 19 ప్రపంచంలో ఇదివరకు ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నాటినుండి ఈనాటి వరకూ సంభవించని దుర్భరమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి కష్టాలు యిక ముందు కూడా ఎన్నడూ కలగవు. 20 కాని దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసాడు. లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్ళు కాదు. తానెన్నుకున్న తన ప్రజల కోసం ఆ రోజుల సంఖ్యను తగ్గించాడు.
21 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా ‘ఇదిగో! క్రీస్తు యిక్కడ ఉన్నాడని’ కాని, ‘అదిగో అక్కడున్నాడని’ కాని అంటే నమ్మకండి. 22 దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, మహత్యాలు చేసి ఐనంతవరకు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళను మోసం చెయ్యాలని చూస్తారు. 23 అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని, అన్ని విషయాలు మీకు ముందే చెబుతున్నాను.
© 1997 Bible League International