Revised Common Lectionary (Semicontinuous)
హన్నా కృతజ్ఞతలు
2 హన్నా దేవుని ఇలా కీర్తించెను:
“నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది.
నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను.
నా శత్రువులను నేను పరిహసించగలను.
నా విజయానికి మురిసిపోతున్నాను.
2 యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు.
నీవు తప్ప మరో దేవుడు లేడు!
మన దేవుని వంటి బండ[a] మరొకడు లేడు.
3 ఇక డంబాలు పలుకవద్దు!
గర్వపు మాటలు కట్టి పెట్టండి!
ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు,
వారికి తీర్పు తీరుస్తాడు.
4 మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి!
బలహీనులు బలవంతులవుతారు!
5 ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు
భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు
కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి
ఇప్పుడు సమృద్ధిగా భోజనం!
గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు!
సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు.
6 యెహోవా జనన మరణ కారకుడు!
దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు.
ఆయన వారిని మరల బ్రతికించగలడు.
7 యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు,
మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు.
పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.
8 మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు.
యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు.
యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు.
యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్నతాసీనులను చేస్తాడు.
పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే!
యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు.
9 యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు.
వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు.
కాని దుష్టులు నాశనం చేయబడతారు.
వారు అంధకారంలో పడిపోతారు.
వారి శక్తి, వారు జయించేందుకు తోడ్పడదు.
10 యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు.
సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు.
సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు!
యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు.
ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”
21 ఆ సంవత్సరం ఎల్కానా సకుటుంబంగా షిలోహుకు వెళ్లి, యెహోవాకు బలులు సమర్చించి, మొక్కిన మొక్కులు తీర్చేందుకు వెళ్లాడు. 22 కాని ఈ సారి ఎల్కానాతో హన్నా వెళ్లలేదు. “బిడ్డకు ఆహారం తినే వయస్సు వచ్చిన్నపుడు షిలోహుకు తీసుకుని వెళతాను. అప్పుడతనిని దేవునికి అంకితం చేస్తాను. అతడు నాజీరు అవుతాడు. అది మొదలు శాశ్వతంగా షిలోహులో ఉండిపోతాడు” అని హన్నా ఎల్కానాకు చెప్పింది.
23 “నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి. కుమారుడు స్వయంగా ఆహారం తినగలిగే వయస్సు వచ్చే వరకు ఇంటివద్దనే ఉండు. యెహోవా తన వాగ్దానం నెరవేర్చునుగాక” అని ఆమె భర్త ఎల్కానా అన్నాడు. తన కుమారుని పెంచుతూ హన్నా ఇంటి వద్దనే ఉండి పోయింది.
హన్నా సమూయేలును షిలోహులోని ఏలీ వద్దకు కొనిపోవటం
24 బాలునికి స్వయంగా అన్నం తినే వయస్సు వచ్చినప్పుడు హన్నా అతనిని షిలోహులోని యెహోవా ఆలయానికి తీసుకుని వెళ్లింది. తనతోపాటు మూడు సంవత్సరాల గిత్తదూడను, అరబస్తా పిండిని, ఒక ద్రాక్షారసం సీసాను తీసుకుని వెళ్లినది.
25 యెహోవా ముందరకు వెళ్లి ఎల్కానా యథావిధిగా కోడెదూడను యెహోవాకు బలిగా వధించాడు. అప్పుడు హన్నా బాలుని ఏలీ వద్దకు తీసుకుని వెళ్లింది. 26 అప్పుడామె ఏలీతో, “అయ్యా, నీ జీవము తోడుగా చెప్పుచున్నాను; నేను గతంలో నీ చెంత నిలబడి యెహోవాకి ప్రార్థించిన స్త్రీనే, 27 ఈ బిడ్డ కోసమే నేను ప్రార్థించాను. యెహోవా నా ప్రార్థన ఆలకించి ఈ బిడ్డను నాకు ప్రసాదించాడు. 28 ఇప్పుడు ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వీడు జీవితాంతం యెహోవా సేవలో నిమగ్నమై ఉంటాడు” అని అన్నది.
హన్న తన కుమారుని అక్కడ వదిలి[a] యెహోవాను ఆరాధించింది.
తిమోతికి చెప్పిన ఉపదేశము
11 కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. 12 నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు. 13 అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 14 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు. 15 “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. 16 మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.
17 ధనవంతులు గర్వించరాదనీ, క్షణికమైన ధనాన్ని నమ్మకూడదనీ, వాళ్ళతో చెప్పుదానికి మారుగా మన ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని ఆజ్ఞాపించు. 18 సత్కార్యాలు చేస్తూ సత్ ప్రవర్తన కలిగి అవసరమైనవాటిని యితర్లతో ఔదార్యముగా పంచుకుంటూ ఉండుమని ఆజ్ఞాపించు. 19 ఈ విధంగా ఆత్మీయతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం పొందకల్గుతారు.
20 తిమోతీ, నీకు అప్పగింపబడిన సత్యాన్ని జాగ్రత్తగా కాపాడు. ఆత్మీయతలేని చర్చలకు దూరంగా ఉండు. జ్ఞానంగా చెప్పబడే వ్యతిరేక సిద్ధాంతాలకు దూరంగా ఉండు. 21 కొందరు ఈ వ్యతిరేక సిద్ధాంతాలు బోధించారు. ఇలా చేసిన వాళ్ళు, మనము విశ్వసిస్తున్న సత్యాలను వదిలి తప్పు దారి పట్టారు.
దైవానుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
© 1997 Bible League International