Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 113

113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
    యెహోవా నామాన్ని స్తుతించండి.
ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
    సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
    ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
    దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
    ఆయన తప్పక కిందికి చూడాలి.
దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
    భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
    ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
    కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.

యెహోవాను స్తుతించండి!

ఆదికాండము 24:11-27

11 పట్టణం వెలుపల ఉన్న మంచి నీళ్ల బావి దగ్గరకు ఆ సేవకుడు సాయంకాలం వెళ్లాడు. నీళ్లు తీసుకొని పోయేందుకు స్త్రీలు సాయంకాలం వస్తారు. ఆ సేవకుడు తన ఒంటెలను అక్కడ మోకరింపజేసాడు.

12 ఆ సేవకుడు చెప్పాడు: “ప్రభూ, నీవు నా యజమాని అబ్రాహాము దేవుడవు. ఈ వేళ నన్ను అతని కుమారుని కోసం భార్యను కనుగొనునట్లు చేయుము. నా యజమాని అబ్రాహాముకు దయచేసి ఈ మేలు అనుగ్రహించు. 13 ఇదిగో, మంచి నీళ్ల బావి దగ్గర నేను ఉన్నాను, పట్టణం నుండి అమ్మాయిలు నీళ్లు తోడటానికి ఇక్కడికి వస్తున్నారు. 14 ఇస్సాకు కోసం ఏ అమ్మాయి సరైనదో తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక సూచన కోసం నేను కనిపెడుతున్నాను. ఆ ప్రత్యేక సూచన ఏమిటంటే: ‘నేను నీళ్లు త్రాగాలి, నీ కడవ క్రింద పెట్టు’ అని అమ్మాయితో నేను అంటాను. ‘త్రాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను’ అని అమ్మాయి గనుక చెబితే, అప్పుడు ఆమె సరైన అమ్మాయి అని నేను తెలుసుకొంటాను. అలా జరిగితే ఆమె ఇస్సాకుకు సరైన జోడు అని నీవు రుజువు చేసినట్టే. నా యజమానికి నీవు కరుణ చూపించావని నాకు తెలుస్తుంది.”

భార్య దొరికింది

15 అంతలో, ఆ సేవకుడు ప్రార్థన ముగించక ముందే రిబ్కా అనే ఒక అమ్మాయి తన గ్రామం నుండి బావి దగ్గరకు వచ్చింది. రిబ్కా బెతూయేలు కుమార్తె. బెతూయేలు అబ్రాహాము సోదరుడు నాహోరు, మిల్కాల కుమారుడు. రిబ్కా తన నీళ్ల కడవ తన భుజంమీద పెట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. 16 ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఆమె కన్య. ఆమె ఎన్నడూ పురుషునితో శయనించలేదు. ఆమె తన కడవ నింపుకోటానికి బావిలోనికి దిగింది. 17 అప్పుడు ఆ సేవకుడు ఆమె దగ్గరకు పరుగెత్తి వెళ్లి, “నాకు త్రాగటానికి దయచేసి నీ కడవలో కొన్ని నీళ్లు ఇస్తావా” అన్నాడు.

18 రిబ్కా త్వరగా తన భుజంమీద నుండి కడవ దించి, అతనికి నీళ్లు ఇచ్చింది. “అయ్యా, ఇదిగో త్రాగండి” అంది రిబ్కా. 19 అతను త్రాగటానికి నీళ్ళు పోయడం అయిన వెంటనే, “నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను” అంది రిబ్కా. 20 రిబ్కా వెంటనే తన కడవలోని నీళ్లన్నీ ఒంటెల కోసం అని చెప్పి నీళ్ల తొట్టిలో పోసింది. తర్వాత ఇంకా నీళ్లు తెచ్చేందుకు ఆమె బావి దగ్గరకు పరుగెత్తింది. ఆ ఒంటెలన్నింటికి ఆమె నీళ్లు పెట్టింది.

21 ఆ సేవకుడు మౌనంగా ఆమెను గమనించాడు. యెహోవా తనకు జవాబిచ్చాడని, తన ప్రయాణాన్ని విజయవంతం చేశాడని అతను రూఢిగా తెలుసుకోవాలనుకొన్నాడు. 22 ఒంటెలు నీళ్లు త్రాగడం అయిపోగానే, అతడు అరతులం బంగారపు ఉంగరం రిబ్కాకు ఇచ్చాడు. 5 తులాల ఎత్తుగల బంగారపు గాజులు రెండు అతడు ఆమెకు ఇచ్చాడు. 23 “నీ తండ్రి ఎవరు? మా గుంపు పండుకొనేందుకు నీ తండ్రి ఇంటిలో చోటు ఉందా?” అని ఆ సేవకుడు ఆమెను అడిగాడు.

24 “నా తండ్రి బెతూయేలు. నాహోరు, మిల్కాయొక్క కుమారుడు” అని రిబ్కా జవాబిచ్చింది. 25 తర్వాత, “అవునండి, మీ ఒంటెలకు గడ్డి, మీరు పండుకొనేందుకు స్థలం మా దగ్గర ఉంది” అని ఆమె చెప్పింది.

26 ఆ సేవకుడు వంగి యెహోవాను ఆరాధించి, 27 “నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా స్తుతించబడు గాక. యెహోవా నా యజమానుని పట్ల దయ చూపాడు. నా యజమాని బంధువు యింటికి యెహోవా నన్ను నడిపించాడు” అని చెప్పాడు.

1 తిమోతికి 5:9-16

ఒకే పురుషుణ్ణి పెండ్లాడి అరవై ఏండ్లు దాటి ఉంటే తప్ప ఆమె పేరు వితంతువుల జాబితాలో చేర్చరాదు. 10 అంతేకాక, సత్కార్యాలు చేసే స్త్రీయని ఆమెకు మంచి పేరుండాలి. పిల్లల్ని సక్రమంగా పెంచటం, అతిథి సత్కారాలు చెయ్యటం, పవిత్రుల కాళ్ళు కడగటం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చెయ్యటంలాంటి గుణాలు ఆమెలో ఉండాలి. తన జీవితాన్ని యిలాంటి మంచి పనులు చెయ్యటానికి అంకితం చేసిన స్త్రీగా ఉండాలి.

11 చిన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ల వాళ్ళకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటారు. 12 తద్వారా తమ మొదటి ప్రమాణాన్ని ఉల్లంఘిస్తారు. ఇలా చెయ్యటంవల్ల వాళ్ళకు శిక్ష లభిస్తుంది. 13 పైగా వాళ్ళు వ్యర్థంగా కాలయాపన చెయ్యటానికి, ఇంటింటికి తిరగటానికి అలవాటు పడిపోతారు. వాళ్ళిలా కాలయాపన చెయ్యటమే కాకుండా, యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి అలవాటుపడ్తారు. వాళ్ళకు మౌనంగా ఉండటం చేతకాదు. 14 అందువల్ల చిన్న వయస్సులో ఉన్న వితంతువులు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని, తమ యిండ్లను చూసుకోవాలి. ఇది నా సలహా. అప్పుడు వాళ్ళను నిందించడానికి యితర్లకు ఆస్కారము ఉండదు. 15 నిజానికి కొందరు సాతాన్ను అనుసరించటానికి యిదివరకే తిరిగి వెళ్ళారు.

16 క్రీస్తును విశ్వసించే స్త్రీ,[a] తన కుటుంబంలో వితంతువులున్నట్లైతే, వాళ్ళకు సహాయం చేయాలి. సంఘంపై ఆ భారం వేయరాదు. అప్పుడు క్రీస్తు సంఘం నిజంగా ఆసరాలేని వితంతువులకు సహాయం చేయకల్గుతుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International