Revised Common Lectionary (Semicontinuous)
సొలొమోను యాత్ర కీర్తన.
127 ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే
కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు.
పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే
కాపలావాళ్లు వారి సమయం వృధా చేసుకొంటున్నట్టే.
2 నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే
నీవు నీ సమయం వృధా చేనుకొంటున్నట్టే.
దేవుడు తనకు ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు.
వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ధ తీసుకొంటాడు.
3 పిల్లలు యెహోవానుండి లభించే కానుక.
వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
4 యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటివారు.
5 తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.
ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో[a] అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.
బోయజు మరియు మరో బంధువు
4 పట్టణ ద్వారము దగ్గర ప్రజలు సమావేశమయ్యే చోటికి బోయజు వెళ్లాడు. బోయజు చెప్పిన దగ్గర బంధువు అటుపైపు వచ్చేంతవరకు బోయజు అక్కడే కూర్చున్నాడు. “మిత్రమా, ఇలా రా! ఇక్కడ కూర్చో” అని బోయజు అతడిని పిల్చాడు.
2 తర్వాత బోయజు కొందరు సాక్షులను పదిమంది పెద్దలను సమావేశ పర్చాడు. వాళ్లను, “అక్కడ కూర్చో” మని చెప్పినప్పుడు వాళ్లు కూర్చున్నారు.
3 అప్పుడు నయోమి దగ్గరి బంధువుతో బోయజు మాట్లాడాడు. “నయోమి మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేసింది. మన బంధువు ఎలీమెలెకు భూమిని ఆమె అమ్మేస్తుంది. 4 ఈ ఊరి ప్రజలయెదుట, నా వాళ్ల పెద్దలయెదుట ఈ విషయం నీతో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈ భూమిని నీవు విడిపించాలనుకుంటే నీవు కొనుక్కో. ఆ భూమిని విడిపించడం నీకు ఇష్టము లేకపోతే నాకు చెప్పు, ఆ భూమిని విడిపించాల్సిన బాధ్యత నీ తర్వాత నాదే అని నాకు తెలుసు. ఆ భూమిని నీవు తిరిగి కొనకపోతే, నేను కోంటాను” అంటూ బోయజు ఆ దగ్గరి బంధువుతో చెప్పాడు.
5 “నయోమి దగ్గరనుండి నీవు ఆ భూమిని కొంటే, చనిపోయినవాని భార్య మోయాబు స్త్రీ నీదే అవుతుంది (రూతుకు సంతానం కలిగినప్పుడు ఆ సంతానానికి ఆ భూమి చెందుతుంది) ఆ విధంగా ఆ భూమి చనిపోయినవాని కుటుంబానికే చెంది ఉంటుంది” అన్నాడు.
6 ఆ దగ్గరి బంధువు జవాబుగా అన్నాడు: “నేను ఆ భూమిని కొనలేను. ఆ భూమి నాకు చెందాల్సిందే, కాని నేను దాన్ని కొనలేను. ఒకవేళ నేను దాన్ని కొనాల్సివస్తే, నా సొంత భూమిని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. అందుచేత నీవు ఆ భూమిని కొనవచ్చు.” 7 (పూర్వము ఇశ్రాయేలులో ప్రజలు ఆస్తి కొన్నా, విడిపించినా ఒకడు తన చెప్పు తీసి అవతల వ్యక్తికి ఇచ్చేవాడు. క్రయ విక్రయాలకు అది వారి రుజువు). 8 “కనుక ఆ భూమిని నీవే కొనుక్కో” అన్నాడు ఆ దగ్గరి బంధువు. తర్వాత ఆ దగ్గరి బంధువు తన చెప్పుతీసి దానిని బోయజుకు ఇచ్చాడు.
9 అప్పుడు బోయజు పెద్దలతోను, ప్రజలందరితోను చెప్పాడు. “ఎలీమెలెకు, కిలియోను, మహ్లూనులకు చెందిన దానినంతటినీ నయోమి దగ్గరనుండి నేను కొంటున్నాను. దానికి నేడు మీరే సాక్షులు. 10 నా భార్యగా ఉండేందుకు రూతును కూడా నేను తీసుకొంటున్నాను. చనిపోయినవాని ఆస్తి అతని కుటుంబానికే ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. ఈ విధంగా చేయటంవల్ల చనిపోయిన వాని పేరు అతని దేశానికి, కుటుంబానికి దూరముకాకుండా ఉంటుంది. ఈ వేళ మీరంతా దీనికి సాక్షులు.”
6 నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు. 7 నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు. 8 కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు.
9 దేవుడు యేసు క్రీస్తు రక్తంద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసు క్రీస్తు ద్వారా సంభవిస్తుంది. 10 ఒకప్పుడు మనం దేవుని శత్రువులం. అయినా తన కుమారుని మరణంవల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. 11 పైగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము.
© 1997 Bible League International