Revised Common Lectionary (Semicontinuous)
20 నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు.
నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు.
21 నేను యెహోవాను అనుసరించాను.
నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చేయలేదు.
22 యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను.
ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు.
23 ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను.
నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను.
24 నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు.
నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు.
25 యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మదగినవాడవు.
మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు.
26 యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైనవాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైనవాడవు.
కాని, గర్విష్ఠులను, టక్కరివాళ్లను నీవు అణచివేస్తావు.
27 యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు.
కాని గర్విష్ఠులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు.
28 యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు.
నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు.
29 యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను.
నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను.
30 దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం.
ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.
కళ్లము దగ్గర రూతు, బోయజు
3 రూతు అత్త నయోమి, “చూడు బిడ్డా, ఒకవేళ నీ కోసం నేనొక మంచి భర్తను చూస్తే బాగుంటుందేమో, అది నీకు క్షేమం. 2 (ఒక వేళ బోయజే తగినవాడేమో) బోయజు మనకు చాలా దగ్గర బంధువు. అతని దగ్గర పనిచేసే స్త్రీలతో నీవూ పని చేసావు. ఈ రోజు రాత్రి అతడు కళ్లము దగ్గర పని చేస్తాడు. 3 నీవు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకో, మంచి బట్టలు కట్టుకొని కళ్లము దగ్గరకు వెళ్లు, అయితే, బోయజు భోజనము చెయ్యటము అయ్యేంత వరకు అతనికి కనబడకు. 4 అతడు భోజనము చేసిన తర్వాత పండుకొని విశ్రాంతి తీసుకుంటాడు. అతను ఎక్కడ పండుకుంటాడో గమనిస్తూ ఉండు. అక్కడికి వెళ్లి, అతని కాళ్లమీదున్న దుప్పటి తొలగించి, అక్కడే అతని దగ్గరే పండుకో. అప్పుడు నీవేమి చేయాలో (పెళ్లి గూర్చి) అతనే నీకు చెప్తాడు.”
5 “నీవు చెప్పినట్టే చేస్తా” అని జవాబిచ్చింది రూతు.
6 రూతు కళ్లము దగ్గరకు వెళ్లింది. ఏమి చేయుమని అత్త చెప్పిందో అదంతా చేసింది రూతు. 7 తిని తాగడం అయినతర్వాత బోయజు బాగా తృప్తిగా ఉన్నాడు. ధాన్యంకుప్ప దగ్గర పండుకునేందుకు వెళ్లాడు బోయజు. అప్పుడు రూతు మెల్లమెల్లగా వెళ్లి అతని కాళ్లమీద దుప్పటి తొలగించింది. అతని పాదాల దగ్గరే ఆమె పండుకొంది.
17 “దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది. 18 కొంత కాలం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు. 19 అతడు మన వాళ్ళను మోసం చేసాడు. మన వాళ్ళ సంతానం చనిపోవాలని, వాళ్ళకు పుట్టిన పసికందుల్ని బయట వేయించి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.
20 “ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే మూడు నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది. 22 ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో గొప్ప పనులు చేయటంలో ఆరితేరినవాడయ్యాడు.
23 “మోషేకు నలభై సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొన్నాడు. 24 ఒకసారి, మోషే ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించటం చూసి ఇశ్రాయేలువానికి సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, అతణ్ణి రక్షించటానికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు. 25 ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్ళు తెలుసుకొంటారని మోషే ఆశించాడు. కాని వాళ్ళకది అర్థం కాలేదు.
26 “మరుసటి రోజు మోషే యిద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి, వాళ్ళను శాంత పరచాలనే ఉద్దేశ్యంతో, ‘అయ్యా! మీరు సోదరులు! పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు?’ అని అడిగాడు. 27 ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు, మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద తీర్పు చెప్పటానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు? 28 ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా?’ అని అన్నాడు. 29 ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి, మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి యిద్దరు కుమారులు కలిగారు.
© 1997 Bible League International