Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
రూతు 1:1-18

యూదాలో

పూర్వం న్యాయాధిపతులు ఏలిన కాలంలో, తినటానికి చాలినంత ఆహారం దొరకని కరువు రోజులు వచ్చాయి. ఎలీమెలెకు అనే ఒకతను యూదాలోని బేత్లెహేము వదలిపెట్టి, అతను, అతని భార్య, అతని యిద్దరు కుమారులు మోయాబు కొండ ప్రదేశంలో బ్రతకడానికి వెళ్లారు. అతని భార్య పేరు నయోమి, అతని యిద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వాళ్లు యూదాలోని బేత్లెహేములో ఎఫ్రాతా వంశానికి చెందినవాళ్లు. ఈ కుటుంబం మోయాబులోని కొండ ప్రదేశానికి ప్రయాణము కట్టి అక్కడే ఉండిపోయారు.

ఆ తరువాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. అందుచేత నయోమి, ఆమె యిద్దరు కుమారులు మాత్రమే మిగిలారు. మోయాబు దేశపు స్త్రీలను ఆమె కుమారులు పెళ్లాడారు. ఒకని భార్య పేరు ఓర్పా, ఇంకొకని భార్య పేరు రూతు. మోయాబులో సుమారు పది సంవత్సరాలు వాళ్లు నిపసించారు. అంతలో మహ్లోను, కిలియోను కూడా చనిపోయారు. అందుచేత నయోమి ఇటు భర్తగాని, అటు కుమారులుగాని లేని ఒంటరిదయిపోయింది

నయోమి ఇంటికి వెళ్లిపోతుంది

దేవుడు తన ప్రజలకు సహాయం చేసినట్టు, ఆయన తన ప్రజలకు (యూదాలో) ఆహారం దయచేసినట్టు మోయాబు కొండదేశంలో నయోమి విన్నది. అందుచేత నయోమి మోయాబు కొండ దేశము విడిచిపెట్టి తిరిగి తన ఇంటికి వెళ్లి పోవాలని తీర్మానించుకుంది. ఆమె కోడళ్లు కూడా ఆమెతోనే వెళ్లిపోయేందుకు తీర్మానించుకున్నారు. అంతవరకు బ్రతుకుతున్న చోటు విడిచిపెట్టేసి మళ్లీ యూదా దేశము పోయేదారి పట్టి ప్రయాణము మొదలు పెట్టారు.

అప్పుడు నయోమి తన కోడళ్లు యిద్దరితో ఇలా అన్నది: “మీరు ఎవరి పుట్టింటికి వారు వెళ్లండి. మీరు చనిపోయిన నా ఇద్దరు కుమారులపైన, నాపైన ఎంతో దయ చూపెట్టారు. అలాగే యెహోవా మీపైన దయ చూపెట్టాలని కోరుకుంటున్నాను. మీరు ఇద్దరూ మళ్లీ పెళ్లాడి మీ భర్తలతో సుఖంగా ఉండేందుకు ఆ దేవుడే మీకు సహాయం చేయాలనేదే నా ప్రార్థన.” నయోమి తన యిద్దరు కోడళ్లను ముద్దు పెట్టుకుంది. దానితో అందరూ ఏడ్వటం మోదలు పెట్టారు.

10 ఆ కోడళ్లు, “మేమూ నీతోనే వచ్చేస్తాము. నీ కుటుంబంలోనే ఉంటాము” అన్నారు.

11 కాని నయోమి ఇలా అన్నది: “నా కుమార్తెలారా! మీ పుట్టిళ్లకు వెళ్లిపొండి. మీరు నాతో రావడం దేనికి? మిమ్మల్ని పెళ్లిచేసుకునేందుకు నా దగ్గర ఇంకెవరూ కుమారులు లేరు. 12 ఇంటికి వెళ్లిపోండి. ఇంకో భర్తను కట్టుకునేందుకు నేను మరీ ముసలిదానను, ఒకవేళ నాకు మళ్లీ పెళ్లవుతుందని నేను అనుకున్నా లాభం లేదు. ఎందుచేతనంటే ఒకవేళ నేను ఈ రాత్రికి రాత్రే గర్భవతినై నాకు ఇద్దరు కుమారులు పుట్టినా 13 మీరు వారిని పెండ్లాడాలంటే వాళ్లు పెద్ద వాళ్లయ్యేంతవరకు మీరు వాళ్లకోసం వేచి ఉండాలి. అన్నాళ్లూ మీరు పెళ్లి చేసుకోకుండా ఆపుజేయడం నాకు మరీ విచారం. ఎందుకంటే, యెహోవా హస్తము నాకు విరోధముగా ఎన్నో పనులు చేసింది.”

14 అప్పుడు ఆ స్త్రీలు మరింతగా ఏడ్చేశారు. ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. కాని రూతు ఆమెను హత్తుకుని ఉండిపోయింది.

15 నయోమి అన్నది: “చూడమ్మా! నీ తోడికోడలు తన సొంతవారి దగ్గరకు, వారి దేవుళ్ల దగ్గరకు తిరిగి వెళ్లిపోయినది. నీవు కూడా అలానే చేయి.”

16 కానీ రూతు, “నిన్ను విడిచి నా స్వంతవాళ్ల దగ్గరకు వెళ్లి పొమ్మని నన్ను బలవంతం చేయవద్దు. నేను నీతోనే వస్తాను. నీవు ఎక్కడికి వెళ్తే, నేనూ అక్కడికి వెళ్తాను. నీవు ఎక్కడవుంటే, నేనూ అక్కడే ఉంటాను. నీవారే నావారు, నీ దేవుడే నా దేవుడు. 17 నీవు ఎక్కడ చస్తే నేనూ అక్కడే చస్తాను. అక్కడే సమాధి చేయబడతాను. నేను ఈ మాట నిలబెట్టు కోలేకపోతే, దేవుడే నన్ను శిక్షిస్తాడు. చావుతప్ప ఇంకేది మనలను విడదీయ లేదు.”

స్వంత ఇంటికి రావటం

18 రూతు తనతోనే రావాలనే పట్టుదలతో ఉన్నట్టు గ్రహించి, నయోమి ఆమెతో వాదించడం మానివేసింది.

కీర్తనలు. 146

146 యెహోవాను స్తుతించండి!
    నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
    నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
    మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
    అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
    సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
    ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
    గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
    విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
    అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!

హెబ్రీయులకు 9:11-14

యేసు రక్తం

11 దేవుడు చేసిన మంచి పనులు సాగించటానికి క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది. శ్రేష్ఠమైనది. అది మానవుడు నిర్మించింది కాదు. 12 ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా ఆ గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థలాన్ని శాశ్వతంగా ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు.

13 మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని, దూడలను కాల్చిన బూడిదను, అపవిత్రంగా ఉన్నవాళ్ళపై ప్రోక్షించి, వాళ్ళను పవిత్రం చేసేవాళ్ళు. ఇలా చేయటం వల్ల వాళ్ళు బాహ్యంగా మాత్రమే పవిత్రులౌతారు. 14 కాని, నిష్కళంకుడైన యేసు శాశ్వతమైన తన ఆత్మను దేవునికి అర్పించుకొన్నాడు. తద్వారా క్రీస్తు రక్తం మన చెడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం చేస్తోంది. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని ఆయనీవిధంగా చేసాడు.

మార్కు 12:28-34

అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?

(మత్తయి 22:34-40; లూకా 10:25-28)

28 శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు చక్కటి సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ ముఖ్య మైనది?” అని యేసును అడిగాడు.

29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఓ ఇశ్రాయేలు జనాంగమా విను. మొదటిది ఇది: మన ప్రభువైన దేవుడు మాత్రమే ప్రభువు. 30 నీ శక్తి, బుద్ధి, సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు,(A) 31 రెండవది ఇది: నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు.(B) వీటిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు.”

32 ఆ శాస్త్రి, “అయ్యా! చక్కగా చెప్పారు. దేవుడు ఒక్కడేనని, ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా చెప్పారు. 33 ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో, సంపూర్ణమైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించాలని, మరియు తనను ప్రేమించుకొన్నంతగా, తన పొరుగువాణ్ణి ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ రెండు ఆజ్ఞలు, బలులకన్నా, దహన బలులకన్నా ముఖ్యమైనవి” అని అన్నాడు.

34 అతడు తెలివిగా చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు!” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International