Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 146

146 యెహోవాను స్తుతించండి!
    నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
    నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
    మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
    అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
    సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
    ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
    గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
    విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
    అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!

రూతు 1:18-22

స్వంత ఇంటికి రావటం

18 రూతు తనతోనే రావాలనే పట్టుదలతో ఉన్నట్టు గ్రహించి, నయోమి ఆమెతో వాదించడం మానివేసింది. 19 నయోమి, రూతు కలసి బేత్లెహేము పురము వరకు ప్రయాణము చేశారు. వారిద్దరూ బేత్లెహేము చేరగానే ఆ ఊరివారంతా సంబరపడిపోయి. “ఈమె నయోమి కదూ?” అని చెప్పుకున్నారు.

20 “నన్ను (మధురము) నయోమి[a] అని పిలవకండి. నన్ను మారా[b] అని పిలవండి. ఎందుచేతనంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు నా బ్రతుకును చాలా దుఃఖమయం చేశాడు. 21 నేను వెళ్లినప్పుడు నాకు కావాల్సింది అంతా ఉండేది. కాని, దేవుడు ఇప్పుడు నన్నుఏమీ లేనిదానిగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన నన్ను దుఃఖమయినిగా చేస్తే, మీరు నన్ను సంతోషం[c] అని పిలవడం దేనికి? సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను చాలా బాధపెట్టాడు” అని నయోమి వారితో అన్నది.

22 అలా నయోమి, ఆమె కోడలు రూతు (మోయాబు స్త్రీ) మోయాబు దేశమునుండి తిరిగి వచ్చేశారు. యవల పంటకోత మొదలవుతున్న రోజుల్లో వీరిద్దరూ యూదాలోని బేత్లెహేము పురము చేరుకున్నారు.

హెబ్రీయులకు 9:1-12

భూలోక గుడారములో సేవ

సేవా నియమాలను గురించి, మానవ నిర్మితమైన గుడారమును గురించి మొదటి ఒడంబడికలో వ్రాయబడి ఉంది. గుడారం వేసి మొదటి గదిని సిద్ధం చేసేవాళ్ళు. ఆ గదిలో ఒక దీప స్థంభం, ఒక బల్ల, ప్రతిష్ఠించబడిన రొట్టె ఉంచేవాళ్ళు. ఈ గదిని పవిత్రస్థానమని పిలిచేవాళ్ళు. మరొక తెరవేసి రెండవ గదిని సిద్ధం చేసేవాళ్ళు. దీన్ని అతి పవిత్ర స్థానమని పిలిచేవాళ్ళు. ఇక్కడ బంగారు ధూప వేదిక, మరియు బంగారు రేకుచేత కప్పబడిన ఒడంబడిక మందసము ఉండేవి. ఈ మందసంలో మన్నా[a] ఉంచబడిన బంగారుగిన్నె, చిగురు వేసిన అహరోను చేతికర్ర, ఒడంబడిక పలకలు ఉండేవి. ఈ మందసం మీద కరుణాపీఠం ఉండేది. దానికి యిరువైపులా దేవదూతలు ఉండేవారు. వారి రెక్కలు ఆ కరుణాపీఠాన్ని కప్పి ఉంచేవి. కాని వీటిని గురించి ప్రస్తుతం వివరంగా చర్చించలేము.

అన్నీ ఈ విధంగా అమర్చబడిన తర్వాత, యాజకులు నియమానుసారం ముందున్న గదిలోకి ప్రవేశించి సేవ చేసేవాళ్ళు. కాని ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తంతో ప్రవేశించేవాడు. తన పక్షాన, అజ్ఞానంతో పాపాలు చేసిన ప్రజల పక్షాన తప్పకుండా రక్తాన్ని తెచ్చి దేవునికి అర్పించేవాడు.

అంటే మొదటి గది ఉన్నంతకాలం అతి పవిత్ర స్థానానికి ప్రవేశం కలుగదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఇది ప్రస్తుత కాలాన్ని సూచిస్తోంది. అంటే కానుకలు, బలులు అర్పించటం వల్ల యాజకుని అంతరాత్మ పరిశుద్ధం కాదని పరిశుద్ధాత్మ సూచిస్తున్నాడు. 10 ఇవి కేవలం అన్నపానాలకు పలురకాల పరిశుద్ద స్నానాలకు సంబంధించిన ఆచారాలు. క్రొత్త క్రమం వచ్చేదాకా ఈ బాహ్య నియమాలు వర్తిస్తాయి.

యేసు రక్తం

11 దేవుడు చేసిన మంచి పనులు సాగించటానికి క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది. శ్రేష్ఠమైనది. అది మానవుడు నిర్మించింది కాదు. 12 ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా ఆ గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థలాన్ని శాశ్వతంగా ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International