Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
2 యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
నా మీద దయ చూపించుము.
3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.
6 యెహోవాను స్తుతించండి.
కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
7 యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
9 దేవా, నీ ప్రజలను రక్షించుము.
నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
కాపరిలా వారిని నిత్యం నడిపించుము.
ఇశ్రాయేలీయుల పాపం కష్టాన్ని తెస్తుంది
9 న్యాయం, మంచితనం అంతా పోయింది.
చీకటి మాత్రమే మనవద్ద ఉంది.
అందుచేత మనం వెలుగుకోసం కనిపెట్టాలి.
ప్రకాశవంతమైన వెలుగుకోసం మనం నిరీక్షిస్తాం.
కానీ మనకు ఉన్నదంతా చీకటి మాత్రమే.
10 మనం కళ్లులేని ప్రజల్లా ఉన్నాం.
మనం గుడ్డివాళ్లలా గోడల మీదికి నడుస్తాం.
అది రాత్రియైనట్టు మనం జారి పడ్తాం.
పగటి వెలుగులో కూడా మనం చూడలేం.
మధ్యాహ్న సమయంలో మనం చచ్చినవాళ్లలా పడిపోతాం.
11 మనం అందరం ఎంతో విచారంగా ఉన్నాం.
పావురాల్లా, ఎలుగుబంట్లలా విచారకరమైన శబ్దాలు మనం చేస్తాం.
మనుష్యులు న్యాయంగా ఉండేకాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం.
కానీ ఇంకా న్యాయం ఏమీ లేదు.
మనం రక్షించబడాలని ఎదురు చూస్తున్నాం,
కానీ రక్షణ ఇంకా దూరంగానే ఉంది.
12 ఎందుకంటే మనం మన దేవునికి వ్యతిరేకంగా ఎన్నెన్నో తప్పు పనులు చేశాం గనుక.
మనదే తప్పు అని మన పాలు చూపెడ్తున్నాయి.
ఈ పనులు చేసి మనం దోషులంగా
ఉన్నామని మనకు తెలుసు.
13 మనం పాపంచేసి,
యెహోవాకు విరోధంగా తిరిగాం.
మనం యెహోవా నుండి తిరిగిపోయి,
ఆయన్ని విడిచిపెట్టేశాం.
చెడు విషయాలను మనం ఆలోచించాం.
దేవునికి వ్యతిరేకమైన వాటినే మనం ఆలోచించాం.
వీటిని గూర్చి మనం ఆలోచించి,
మన హృదయాల్లో వాటి పథకాలు వేసుకొన్నాం.
14 మన దగ్గర్నుండి న్యాయం తొలగిపోయింది.
న్యాయం దూరంగా నిలుస్తుంది.
సత్యం వీధుల్లో పడిపోయింది.
మంచితనం పట్టణంలో ప్రవేశించటానికి అనుమతించబడటం లేదు.
15 సత్యం పోయింది.
మంచి జరిగించాలనుకొనే మనుష్యులు దోచుకోబడ్డారు.
యెహోవా చూశాడు, కానీ మంచితనం ఏమీ ఆయనకు కనబడలేదు. ఇది
యెహోవాకు ఇష్టం కాలేదు.
16 యెహోవా చూశాడు.
నిలిచి, ప్రజలకు సహాయం చేసే వ్యక్తి ఒక్కడూ ఆయనకు కనిపించలేదు.
కనుక యెహోవా తన స్వంత శక్తి, తన స్వంత మంచితనం ప్రయోగించాడు.
మరియు యెహోవా ప్రజలను రక్షించాడు.
17 యెహోవా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
యెహోవా మంచితనాన్ని ఒక కవచంలా కప్పుకొన్నాడు.
రక్షణ శిరస్త్రాణం ధరించాడు.
శిక్షను వస్త్రాలుగా ధరించాడు.
బలీయమైన ప్రేమ అంగీ ధరించాడు.
18 యెహోవా తన శత్రువుల మీద కోపంగా ఉన్నాడు
కనుక వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
యెహోవా తన శత్రువులమీద కోపంగా ఉన్నాడు.
కనుక దూరస్థలాలు అన్నింటిలోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
19 అప్పుడు పశ్చిమాన ప్రజలు యెహోవా నామాన్ని గౌరవిస్తారు. తూర్పున ప్రజలు యెహోవా మహిమను గూర్చి భయపడతారు.
వేగంగా ప్రవహించే ఒక నదిలా యెహోవా వెంటనే వస్తాడు.
యెహోవా ఈ నదిమీద విసరగా వచ్చిన శక్తివంతమైన గాలిలా అది ఉంటుంది.
2 అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి. 2 అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు. 3 ప్రభువు మంచివాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు.
4 మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. 5 మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. 6 ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు:
“అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను!
పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది.
ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”(A)
7 ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు:
“ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన
రాయి మూలకు తలరాయి అయింది.”(B)
8 మరొక చోట యిలా వ్రాయబడి ఉంది:
“ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది.
ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.”(C)
దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.
9 కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు.
10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు.
ఇప్పుడు మీరు దేవుని ప్రజ.
పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు.
కాని యిప్పుడు లభించింది.
© 1997 Bible League International