Revised Common Lectionary (Semicontinuous)
యెహోవాకు యోబు జవాబు
42 అప్పుడు యెహోవాకు యోబు ఇలా జవాబు చెప్పాడు.
2 “యెహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు.
నీవు పథకాలు వేస్తావు, నీ పథకాల్లో ఏదీ మార్చబడజాలదు, నిలిపివేయబడదు.
3 ‘నా సలహాను గూర్చి ఈ వెర్రి ప్రశ్నలు అడుగుతున్న ఇతడు ఎవరు?’ అని యెహోవా, నీవు ప్రశ్నించావు.
నేను (యోబును) నాకు అర్థం కాని విషయాలు యెహోవాని అడిగాను.
నేను తెలిసికోలేనంత మరీ విపరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను గూర్చి నేను మాట్లాడాను.
4 “యెహోవా, ‘నీవు నాతో యోబూ, నేను నీతో మాట్లాడుతాను.
నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి’ అన్నావు.
5 యెహోవా, ఇదివరకు నిన్ను గూర్చి నేను విన్నాను.
కానీ ఇప్పుడు నా స్వంత కళ్లతో నేను నిన్ను చూశాను.
6 కనుక ఇప్పుడు, నన్ను గూర్చి
నేను సిగ్గుపడుతున్నాను.
యెహోవా, నేను విచారిస్తున్నాను.
నేను ఈ ధూళిలో, బూడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం, నా హృదయం మార్చుకొంటానని వాగ్దానం చేస్తున్నాను.”
10 కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించటం ముగించాడు. అప్పుడు యెహోవా యోబుకు మరల విజయం ఇచ్చాడు. యోబుకు అంతకు ముందు ఉన్నదానికి రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. 11 యోబు సోదరులు, ఆడపడుచులు అందరూ తిరిగి యోబు ఇంటికి వచ్చారు. అంతకు ముందు యోబును ఎరిగిన ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు. వాళ్లంతా యోబుతో కలిసి విందు భోజనం చేశారు. యోబుకు యెహోవా చాలా కష్టం కలిగించాడు గనుక వాళ్లంతా అతనిని ఓదార్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెండి నాణెం, ఒక బంగారు ఉంగరం యోబుకు ఇచ్చారు.
12 యోబు జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగాన్ని యెహోవా అధికంగా ఆశీర్వదించాడు. పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటెలు, రెండు వేల ఆవులు, వెయ్యి ఆడ గాడిదలు యోబుకు స్వంతంగా యిచ్చాడు. 13 యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు మరల కలిగారు. 14 యోబు మొదటి కుమార్తెరైకు యెమీమా అని పేరు పెట్టాడు. యోబు రెండో కుమార్తెకు కెజీయా అని పేరు పెట్టాడు. యోబు మూడో కుమార్తెకు కెరెంహప్పుకు అని పేరు పెట్టాడు. 15 దేశం అంతటిలో యోబు కుమార్తెలు మహాగొప్ప సౌందర్యవతులు. యోబు తన కుమార్తెలకు తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. వారి సోదరులు కూడ తమ తండ్రి ఆస్తిలో వాటా పొందారు.
16 కనుక యోబు మరో నూటనలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన పిల్లలను, మనుమలు, మనుమరాండ్రను, మునిమనుమలు, మనుమరాండ్రను, వారి పిల్లలను చూచేంతవరకు నాలుగు తరాలు జీవించాడు. 17 యోబు చనిపోయినప్పుడు అతడు కడు వృద్ధుడు. యోబు సుదీర్ఘమైన కాలం జీవించాడు.
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
23 ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. 24 కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. 25 అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు.
26 పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధానయాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. 27 ఆయన, ఇతర ప్రధానయాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే! 28 ధర్మశాస్త్రం బలహీనులైనవాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధానయాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.
గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం
(మత్తయి 20:29-34; లూకా 18:35-43)
46 ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు. 47 ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు.
48 చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు.
49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అని అన్నాడు.
వాళ్ళా గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు. 50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు.
51 యేసు, “ఏమి కావాలి?” అని అడిగాడు.
ఆ గ్రుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు.
52 యేసు, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. యిక వెళ్ళు” అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.
© 1997 Bible League International