Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
నెహెమ్యా ప్రార్థన
1 హకల్యా కుమారుడైన నెహెమ్య మాటలు ఇవి: నెహెమ్యా అనే నేను కిస్లేవు నెలలో రాజధాని నగరమైన షూషనులో ఉన్నాను. అర్తహషస్త రాజ్య పాలన ఇరవయ్యవ ఏట ఇది జరిగింది. 2 నేను షూషనులో వుండగా, నా సోదరుల్లో ఒకడైన హనానీయ, మరి కొందరు యూదా నుంచి వచ్చారు. అక్కడ నివసిస్తున్న యూదులను గురించి నేను వాళ్లని అడిగాను. వాళ్లు చెరనుంచి తప్పించుకొని, ఇంకా యూదాలోనే నివసిస్తున్న యూదులు. నేను వాళ్లని యెరూషలేము నగరం గురించి కూడా అడిగాను.
3 హనానీయ, అతనితో ఉన్న వాళ్లూ ఇలా చెప్పారు: “నెహెమ్యా, చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లకి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. ఎందుకంటే, యెరూషలేము ప్రాకారం కూల్చబడింది. దాని ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి.”
4 యెరూషలేము ప్రజలను గురించి, ప్రాకారం గురించీ ఈ విషయాలు విన్నాక, నేను చాలా కలత చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారానికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను. 5 తర్వాత ఈ క్రింది ప్రార్థన చేశాను:
పరలోక దేవా, యెహోవా ప్రభూ, నీవు అత్యంత శక్తిశాలివైన మహా దేవుడివి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించే మనుష్యులను నీవు కటాక్షించి వారితో ప్రేమ ఒడంబడికను అమలుపరుస్తావు.
6 దయచేసి నీవు కళ్లు తెరిచి, చెవులొగ్గి ఈ నీ సేవకుడు రాత్రింబగళ్లు నీ సన్నిధియందు చేస్తున్న ప్రార్థనలను విను. నేను నీ సేవకులైన ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థిస్తున్నాను. మేము నీకు వ్యతిరేకంగా పాపాలు చేశామన్న విషయాన్ని నేను ఒప్పుకొంటున్నాను. నేనూ, నా తండ్రి కుటుంబంలోని ఇతరులూ నీకు వ్యతిరేకంగా పాపం చేశామని ఒప్పుకొంటున్నాను. 7 ఇశ్రాయేలు ప్రజలమైన మేము నీపట్ల చాలా చెడుగా వ్యవహరించాము. నీవు నీ సేవకుడైన మోషే ద్వారా యిచ్చిన ఆజ్ఞలనూ, బోధనలనూ, విధులనూ మేము తృణీకరించాము.
8 నీవు నీ సేవకుడైన మోషేకి ఇచ్చిన ఉపదేశాన్ని దయచేసి గుర్తుచేసుకొనుము. దేవా, నీవు అతనికి “మీ ఇశ్రాయేలు ప్రజలు విశ్వసనీయంగా వ్యవహరించక పోయినట్లయితే, మిమ్మల్ని యితర దేశాల మధ్యకు చెదరగొడ్తాను. 9 అలాకాక, మీ ఇశ్రాయేలీయులు నా వద్దకు తిరిగి వచ్చి, నా ఆదేశాలను పాటించినట్లయితే, అప్పుడు నేనిలా చేస్తాను: మీ ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదలటానికి బలవంతం చేయబడినా, భూలోకపు అంచులదాకా పోయినా సరే, నేను వాళ్లని అక్కడనుంచి తిరిగి ఒక్కచోట చేరుస్తాను. ఎక్కడైతే నా నామాన్ని ఉంచుటకు ఏర్పాటు చేసుకున్నానో అక్కడికి తిరిగి వాళ్లని నేను తీసుకొస్తాను” అని చెప్పావు.
10 ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు, నీ ప్రజలు. నీవు నీ గొప్ప శక్తిని వినియోగించి, వాళ్లని విడిపించావు. 11 కాబట్టి ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నేను నీ దాసుడను. నీ నామం పట్ల గౌరవం ప్రదర్శించాలని ఇష్టపడే నీ సేవకుల ప్రార్థనలు దయచేసి ఆలకించు. ప్రభూ, నేను రాజుకి ద్రాక్షారసం అందించే సేవకుణ్ణి.[a] ఈ విషయం నీకు తెలుసు. అందుకని దేవా, నాకు ఈ నాడు సహాయం చెయ్యి. నేను రాజు సహాయాన్ని అర్థిస్తున్నాను. ఈ నా ప్రయత్నంలో నాకు విజయం చేకూర్చు. రాజుకు నా పట్ల అభిమానం కలిగేలా చెయ్యి.
11 మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? 12 దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు, 13 ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపువాడు. ఆ గోత్రానికి చెందినవాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయ లేదు. 14 మన ప్రభువు యూదా వంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే! ఈ గోత్రపువాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు.
యేసు మెల్కీసెదెకులాంటి యాజకుడు
15 పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. 16 మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. 17 ఎందుకంటే, “నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు”(A) అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి.
18 పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది. 19 ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది.
20 దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతావాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు. 21 కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు:
“ప్రభువు ప్రమాణం చేశాడు.
తన మనస్సును మార్చుకోడు.
‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.’”(B)
22 ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్ఠమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు.
© 1997 Bible League International