Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
బబులోను నుంచి వచ్చిన వార్తాహరులు
12 ఆ సమయమున, బలదాను కొడుకైన మెరోదక్బలదాను బబులోనుకు రాజుగా వున్నాడు. అతను హిజ్కియాకి ఒక కానుక, ఉత్తరాలు పంపాడు. మెరోదక్బలదాను ఇలా చేయడానికి కారణం, హిజ్కియా వ్యాధిగ్రస్తుడైవున్నాడని విన్నందువల్లనే. 13 హిజ్కియా బబులోను నుంచి వచ్చిన మనుష్యుల్ని ఆహ్వానించాడు. వారికి తన ఇంటగల అన్ని విలువగల వస్తువులు చూపించాడు. అతడు తన నిధులలో వున్న వెండి బంగారాలు, మసాలా వస్తువులు, ఖరీదైన పరిమళ తైలము, ఆయుధాలు, మొదలైన వాటిని చూపించాడు. తన మొత్తము రాజభవనములో హిజ్కియాకు కలిగిన దానంతటిలో వారికి చూపనిది ఏదీ లేదు.
14 తర్వాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు వద్దకు వచ్చి అతనిని, “ఈ మనుష్యులేమని చెప్పారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని అడిగాడు.
“వారు చాలా దూరదేశమైన బబులోను నుంచి వచ్చారు” అని హిజ్కియా చెప్పాడు.
15 “వారు నీ ఇంటిలో ఏమి చూశారు?” అని యెషయా అడిగినాడు.
“వారు మా ఇంట అన్నీ చూశారు. నా నిధులలో వారు చూడనిది ఏదీలేదు.” అని హిజ్కియా సమాధానమిచ్చాడు.
16 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇట్లన్నాడు: “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము విను. 17 మీ ఇంటగల వస్తువులన్నీ, నేటిదాకా మీపూర్వికులు సమకూర్చిన వస్తువులు బబులోనుకు తీసుకొని పోబడతాయి. ఏమియు మిగలదని యెహోవా చెబుతున్నాడు. 18 బబులోను వారు నీ కుమారులను తీసుకుపోతారు. మరియు నీ కుమారులు బబులోను రాజు అంతఃపురములో నపుంసకులు అవుతారు.”
19 అప్పుడు యెషయాతో, “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము మంచిది” అని హిజ్కియా చెప్పాడు. హిజ్కియా ఇది కూడా చెప్పాడు: “నా జీవితకాలములో నిజమైన శాంతి నెలకొన్నచో, అది చాలా మంచిది.”
మెల్కీసెదెకు
7 ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. 2 అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు.
మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. 3 మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.
4 మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. 5 ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. 6 మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. 7 ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు.
8 ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. 9 ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. 10 ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.
© 1997 Bible League International