Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.
2 దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని
ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
12 “యోబూ, మొసలి కాళ్లను గూర్చి, దాని బలం,
దాని అందమైన ఆకారం గూర్చి నేను నీతో చెబుతాను.
13 మొసలి చర్మాన్ని ఎవరూ ఊడదీయలేరు.
ఒక కళ్లెం పట్టుకొని ఎవ్వరూ దాని సమీపంగా రాజాలరు.
14 మొసలి దవడలు తెరిపించడానికి ఎవరూ దానిని బలవంతం చేయలేరు.
దాని దవడల్లోని పళ్లు మనుష్యులను భయపెడతాయి.
15 మొసలి వీపు మీది గట్టి పొలుసుల వరుసలు
దగ్గర దగ్గరగా కుదించబడ్డాయి.
16 గాలి జొరబడలేనంత దగ్గర దగ్గరగా
ఆ పొలుసులు ఉంటాయి.
17 ఆ పొలుసులు ఒక దానితో ఒకటి జత చేయబడ్డాయి.
వాటిని ఊడబెరుకుటకు వీలులేనంత గట్టిగా ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉంటాయి.
18 మొసలి తుమ్మినప్పుడు అది వెలుగు ప్రకాశించినట్టుగా ఉంటుంది.
దాని కళ్లు ఉదయపు వెలుగులా ఉంటాయి.
19 దాని నోటి నుండి మండుతున్న జ్వాలలు బయటకు వస్తాయి.
నిప్పు కణాలు బయటకు లేస్తాయి.
20 ఉడుకుతూ ఉన్న కుండ కింద కాలుతున్న
పిచ్చి మొక్కలనుండి పొగవచ్చినట్టుగా మొసలి ముక్కునుండి పొగ వస్తుంది.
21 మొసలి శ్వాస బొగ్గులను మండిస్తుంది.
దాని నోటినుండి అగ్ని జ్వాలలు వస్తాయి.
22 మొసలి మెడ చాలా బలంగా ఉంటుంది.
మనుష్యులు దానిని చూచి భయపడి దాని నుండి పారిపోతారు.
23 మొసలి శరీరంలో బలహీనత ఏమీ లేదు.
అది ఇనుములా గట్టిగా ఉంటుంది.
24 మొసలి గుండె బండలా ఉంటుంది.
దానికి భయం ఏమీ లేదు. అది తిరుగలి క్రింది రాయిలా గట్టిగా ఉంటుంది.
25 మొసలి మేల్కొన్నప్పుడు బలమైన మనుష్యులు భయపడతారు.
మొసలి తోక ఆడించినప్పుడు వారు పారిపోతారు.
26 ఖడ్గం, బల్లెం, బాణం మొసలిని కొడితే అవి తిరిగి వస్తాయి.
ఆ ఆయుధాలు దానికే మాత్రం హాని చేయవు.
27 మొసలికి ఇనుమును గడ్డి పరకలా విరుగ గొట్టడం తేలిక.
ఇత్తడిని పుచ్చిపోయిన చెక్కలా విరుగ గొట్టటం తేలిక.
28 బాణాలు మొసలిని పారిపోయేటట్టు చేయలేవు.
దానిమీద విసిరిన బండలు ఎండి గడ్డిపోచల్లా ఉంటాయి.
29 దుడ్డు కర్రతో మొసలిని కొట్టినప్పుడు అది దానికి ఒక గడ్డి పరకలా అనిపిస్తుంది.
మనుష్యులు దాని మీద ఈటెలు విసిరినప్పుడు అది నవ్వుతుంది.
30 మొసలి శరీరం క్రింద ఉన్న చర్మం పగిలి పోయిన చాలా వాడి చిల్లపెంకుల్లా ఉంటుంది.
అది నడిచినప్పుడు మట్టిలో నురిపిడి కొయ్యలా గుంటలు చేస్తుంది.
31 కాగుతున్న కుండలోని నీళ్లను అది బుడగలు పొంగిస్తుంది.
నూనె మసులుతున్న కుండలా అది నీటిని పొంగిస్తుంది.
32 మొసలి ఈదినప్పుడు దాని వెనుక ఒక దారి ఏర్పడుతుంది.
అది నీళ్లను పొంగింప జేసినప్పుడు దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది.
33 భూమి మీద ఏ జంతువూ మొసలిలాంటిది లేదు.
అది భయం లేని జంతువుగా చేయబడింది.
34 మహా గర్విష్ఠి జంతువులను మొసలి చిన్న చూపు చూస్తుంది.
క్రూర జంతువులన్నిటికీ అది రాజు.”
యేసు తన శిష్యుల పాదాలు కడగటం
13 పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని వదిలి తన తండ్రి దగ్గరకు వెళ్ళే సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న తన వాళ్ళను ప్రేమించాడు. తాను వాళ్ళనెంత సంపూర్ణంగా ప్రేమించాడంటే ఆ ప్రేమను వాళ్ళకు చూపించాడు.
2 యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయుటకు కూర్చొని ఉన్నారు. సైతాను అప్పటికే సీమోను కుమారుడైన యూదా ఇస్యరియోతులో ప్రవేశించి యేసుకు ద్రోహం చెయ్యమని ప్రేరేపించాడు. 3 తండ్రి తనకు సంపూర్ణమైన అధికారమిచ్చినట్లు యేసుకు తెలుసు. తాను దేవుని నుండి వచ్చిన విషయము, తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళ బోతున్న విషయము ఆయనకు తెలుసు. 4 అందువల్ల ఆయన భోజన పంక్తి నుండి లేచాడు. తన పైవస్త్రాన్ని తీసివేసి, ఒక కండువాను నడుముకు చుట్టుకున్నాడు. 5 ఆ తర్వాత ఒక వెడల్పయిన పళ్ళెంలో నీళ్ళు పోసి తన శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టుకున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు.
6 యేసు సీమోను పేతురు దగ్గరకు రాగానే, పేతురు ఆయనతో, “ప్రభూ! మీరు నా పాదాలు కడుగుతారా?” అని అన్నాడు.
7 యేసు, “నేను చేస్తున్నది నీకు యిప్పుడు అర్థం కాదు. తదుపరి అర్థమౌతుంది” అని సమాధానం చెప్పాడు.
8 పేతురు, “మీరు నా పాదాలు ఎన్నటికీ కడుగకూడదు. నేను ఒప్పుకోను” అని అన్నాడు.
యేసు, “నీ పాదాలు కడిగితే తప్ప నీకు, నాకు సంబంధం ఉండదు!” అని సమాధానం చెప్పాడు.
9 సీమోను పేతురు, “ప్రభూ! అలాగైతే నా పాదాలేకాదు. నా చేతుల్ని, నా తలను కూడా కడగండి!” అని అన్నాడు.
10 యేసు సమాధానం చెబుతూ, “స్నానం చేసినవాని శరీరమంతా శుభ్రంగా ఉంటుంది. కనుక అతడు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు ఒక్కడు తప్ప మీరందరూ పవిత్రులై ఉన్నారు” అని అన్నాడు. 11 తనకు ద్రోహం చేయనున్న వాడెవడో యేసుకు తెలుసు. కనుకనే ఒక్కడు తప్ప అందరూ పవిత్రంగా ఉన్నారని ఆయనన్నాడు.
12 ఆయన వాళ్ళ పాదాలు కడగటం ముగించి, పై వస్త్రాన్ని వేసుకొని తాను యింతకు ముందు కూర్చున్న స్థలానికి వెళ్ళాడు. యేసు, “నేను చేసింది మీకు అర్థమైందా? 13 మీరు నన్ను ‘బోధకుడా!’ అని ‘ప్రభూ!’ అని పిలుస్తారు. నేను బోధకుడను కనుక మీరు నన్ను ఆ విధంగా పిలవటం సమంజసమే! 14 మీ బోధకుడను, ప్రభువును అయిన నేను మీ పాదాలు కడిగాను. కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. 15 నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను చేసినట్లు మీరు కూడా చేయాలని నా ఉద్దేశ్యం. 16 ఇది నిజం. యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు. అలాగే వార్త తెచ్చేవాడు వార్త పంపినవాని కన్నా గొప్ప కాదు. 17 ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. వీటిని ఆచరిస్తే ధన్యులౌతారు.
© 1997 Bible League International