Revised Common Lectionary (Semicontinuous)
దేవుడు యోబుతో మాట్లాడటం
38 అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
2 “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన,
తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే వీడు ఎవడు?
3 యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు.
నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండు.
4 “యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు?
నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు.
5 యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు?
నీకు తెలిసినట్టే ఉంది! కొలబద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు?
6 భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి?
భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు?
7 అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసి పాడాయి.
దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.
34 “యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు
నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా?
35 యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంపగలవా?
మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, ‘ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాలి?’
అని అంటాయా?
36 “ఒక మనిషి మనస్సులో జ్ఞానం కలిగించేది ఎవరు?
మనస్సుకు గ్రహింపును ఇచ్చేది ఎవరు?
37 యోబూ, మేఘాలను లెక్కించుటకు,
అవి వాటి వర్షమును కురియునట్లు వాటికి లంచం ఇచ్చుటకు అంతటి తెలివిగలవారు ఎవరు?
38 ఆ వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది.
ఆ మట్టి గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి.
39 “యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా?
ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా?
40 అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో
పండుకొని లేక కూర్చొని ఉంటాయి.
41 యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు
కాకులను పోషించేది ఎవరు?
104 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు.
మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
2 ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు.
ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.
3 దేవా, వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు.
దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు.
గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.
4 దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు.
నీ సేవకులను అగ్నిలా చేశావు.
5 దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు.
కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.
6 దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు.
నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.
7 కాని నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి.
దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.
8 పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత
నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
9 సముద్రానికి నీవు హద్దులు నియమించావు.
నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.
24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను స్తుతించు!
5 ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. 2 ఇతనిలో కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు సానుభూతి కనుబరుస్తాడు. 3 ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది.
4 ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు. దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు. 5 క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో,
“నీవు నా కుమారుడవు.
నేడు నేను నీకు తండ్రినయ్యాను”(A)
అని చెప్పి మహిమ పరచాడు. 6 మరొక చోట, ఇలా అన్నాడు:
“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం
యాజకుడవై ఉంటావు.”(B)
7 యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు. 8 యేసు దేవుని కుమారుడైనా, తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో ఉండటం నేర్చుకొన్నాడు. 9 పరిపూర్ణత పొందాక, తన పట్ల విధేయతగా ఉన్నవాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ ప్రసాదించ గలవాడయ్యాడు. 10 దేవుడు మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసును ప్రధాన యాజకునిగా నియమించాడు.
యాకోబు మరియు యోహానుల నివేదన
(మత్తయి 20:20-28)
35 జెబెదయి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము అడిగింది చెయ్యమని కోరుతున్నాము” అని అన్నారు.
36 “ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు.
37 వాళ్ళు, “మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతి వైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చోనివ్వండి” అని అడిగారు.
38 యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగినదాన్ని మీరు త్రాగగలారా? నేను పొందిన బాప్తిస్మము మీరు పొందగలరా?” అని అడిగాడు.
39 “పొందగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందుదురు. 40 కాని నా కుడివైపు, లేక నా ఎడమ వైపు కూర్చోమనటానికి అనుమతి యిచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం నియమించబడ్డాయో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు” అని అన్నాడు.
41 ఇది విని మిగతా పది మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది. 42 యేసు వాళ్ళను దగ్గరకు పిలిచి, “యూదులుకాని వాళ్ళను పాలించ వలసిన ప్రభువులు, వాళ్ళపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్ళపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. 43 మీ విషయంలో అలా కాదు. మీలో అందరి కన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్ళందరికి సేవ చేయాలి. 44 మీలో ప్రాముఖ్యత పొందాలనుకొన్నవాడు మీ అందరికి బానిసగా ఉండాలి. 45 ఎందుకంటే మనుష్యకుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు. కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు” అని అన్నాడు.
© 1997 Bible League International